ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

సాత్నాల: ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించడమే లక్ష్యమని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’, రైతు వారోత్సవాల్లో భాగంగా సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలోని మేడిగూడ–సి కెనాల్‌ వద్ద పూడికతీత పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సాగునీటి రంగంలో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 3.6 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువలో ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల మేర పూడికతీత, చెట్ల తొలగింపు పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న ఈ పనులు పూర్తయితే ఆయకట్టు చివరి వరకు సక్రమంగా సాగునీరు అందుతుందన్నారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించారు. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.69 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ మహేశ్‌, తహసీల్దార్‌ జాదవ్‌ రామారావు, ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకట్‌రాజు, ఏపీవో వెంకటరమణ, సర్పంచ్‌ అంజనాబాయి, ఇతర అధికారులు, కూలీలు పాల్గొన్నారు.

విద్యా వారోత్సవాలు

ఘనంగా నిర్వహించాలి

కై లాస్‌నగర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమీక్షిస్తూ, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా జయశంకర్‌ బడిబాట, లైబ్రరీ డే, తల్లిదండ్రుల సమావేశాలు, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యాసంస్థల్లో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఇందులో ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో భాగంగా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రతి ఒక్కరూ పూర్తి చేసేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులు విధిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని, ఇందుకోసం ఏఈవోలకు స్పష్టమైన లక్ష్యాలను కేటాయించి రోజువారీ నివేదికలు సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.ఇందులో అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌ స్వామి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ సుధారాణి, విద్యా, రవాణా, మార్కెటింగ్‌, ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement