కై లాస్‌నగర్: మీ సేవ ద్వారా అందించే సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తహసీల్దార్లకే పరిమితమైన లాగిన్లను జీపీవో, ఆర్‌ఐలకు కల్పించింది. ప్రయోగాత్మకంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి ఈ విధానాన్ని అమలు చేసింది. విజయవంతం కావడంతో దశలవారీగా అ న్ని సర్టిఫికెట్లకు వర్తింపజేస్తోంది. నూతన విధానం అమలుతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు పారదర్శకత పెరగనుంది.
జీపీవో, ఆర్‌ఐలకు ప్రత్యేక లాగిన్‌లు ..
ఇప్పటి వరకు తహసీల్దార్‌కే పరిమితమైన లాగిన్‌లను తాజాగా గ్రామపాలన అధికారి (జీపీవో), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)లకు కల్పించింది. వారి సెల్‌ఫోన్లలోనే దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు వీలుగా మీసేవ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా ఆదాయ సర్టిఫికెట్ల జారీ కోసం దీనిని అమలు చేసింది. మీసేవ నుంచి జీపీవోలకు దరఖాస్తు వివరాలు అందిన వెంటనే వారు దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. యాప్‌లో అప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రస్తుతం కులం, నివాస, కుటంబ సభ్యుల ధ్రువీకరణ, ఈబీసీ, ఓబీసీ వంటి సర్టిఫికెట్ల జారీకి వర్తింపజేస్తుంది. ప్రజలు సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వివరాలు తొలుత యాప్‌లో జీపీవో లాగిన్‌కు వెళుతాయి. విచారణ చేపట్టి ధ్రువీకరిస్తే ఆర్‌ఐ లాగిన్‌కు చేరుతాయి. అక్కడ ఓకే చేస్తే డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ లాగిన్‌లకు వెళుతాయి. వారు అప్రూవ్ చేయగానే సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా కార్యాలయంలో హార్డ్ కాపీలు ఇచ్చే ఇక్కట్లు తొలగిపోయాయి.
రెవెన్యూశాఖ ద్వారా జారీ చేసే కుల, ఆదాయ, నివాస వంటి వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు సమీప మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసేవారు. ఈ వివరాలు ఆన్‌లైన్‌లో తహసీల్దార్ లాగిన్‌కు వెళ్లేవి. అయినా దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు జతచేసిన ధ్రువీకరణపత్రాలతో కూడిన హార్డ్‌కాపీలను తహసీల్ కార్యాలయాలకు వెళ్లి ఇచ్చేవారు. వాటిని ఆర్‌ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు పరిశీలించిన అనంతరం సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్‌ఐలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకుండానే ధ్రువీకరించేవారు. ఫలితంగా అనర్హులు సైతం సర్టిఫికెట్లు పొందేవారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది.
హార్డ్‌కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు
రెవెన్యూశాఖ ద్వారా అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. గతంలో మాదిరి తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చి హర్డ్‌కాపీలే ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తు వివరాలు జీపీవో, ఆర్‌ఐల లాగిన్లకు వెలుతాయి. వారు మొబైల్‌యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత డీటీ, తహసీల్దార్ లాగిన్లకు చేరుతాయి. వారు ఓకే చేయగానే సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ ప్రక్రియ తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు కార్యాలయాలకు తిరిగే ఇక్కట్లు తొలగిపోతాయి. అలాగే గడువు లోపు సర్టిఫికెట్లు జారీ అవుతాయి.
– బండి రవి,ఈ డిస్ట్రిక్ మేనేజర్, ఆదిలాబాద్
జిల్లాలోని మీసేవ కేంద్రాలు : 72
రోజుకు సర్టిఫికెట్ల కోసం
అందే దరఖాస్తులు : 218


