ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కమీషన్ల కోసమే కాళేశ్వరానికి ప్రాజెక్టు తరలింపు : మంత్రి వివేక్ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది పరిశీలన
కౌటాల: తెలంగాణలో సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రాణహిత ప్రాజెక్టును పక్కాగా కట్టి తీరుతామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఎకై ్స జ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని శుక్రవారం రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీశ్‌బాబుతో కలి సి పరిశీలించారు. బరాజ్ ఎత్తు, సామర్థ్యం, గతంలో చేపట్టిన కాలువల పనులు, మహారాష్ట్రలోని శివిని గ్రామ పరిధిలోని ముంపు పరిధి, అటవీ, పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు శిలాఫలకాన్ని పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బుద్ధ మందిర్‌లో పూజ లు చేశారు. ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజలు చేసి జలహారతి ఇచ్చారు.
గ్రావిటీ ద్వారా ‘ఎల్లంపల్లి’కి నీరు
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారని గుర్తు చేశారు. అప్పట్లోనే 106 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి 71.5 కి.మీ.ల భూసేకరణ పూర్తి చేశారని తెలిపారు. 46 కి.మీ.ల మేర పనులు కూడా పూర్తయ్యాయని వెల్ల డించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించవచ్చని తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యట నకు రానున్న నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ విషయాన్ని బీజేపీ నేతలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి జిల్లా రైతాంగానికి అన్యాయం
ప్రాణహిత ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్ల కోసమే తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం చేశారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్‌గా ఉన్న మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్‌గా ఎదిగా రని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ వహీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం జానకీరావు, శ్యామ్‌నాయక్, మండల అధ్యక్షుడు నికాడే గంగారాం తదితరులు పాల్గొన్నారు.


