బక్రీద్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బక్రీద్‌ను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖలతో పాటు పోలీస్‌ అధికారులు, ముస్లిం మత పెద్దలు, ఖురేషి వర్గ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసి వధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో వాహనాల తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాను అడ్డుకునే పేరుతో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, వ్యక్తిగత దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, మార్ఫింగ్‌ ఫొటోలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం జిల్లా పోలీస్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ నిరంతర నిఘా కొనసాగిస్తోందన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించే పుకార్లను వ్యాప్తి చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్‌ 100, సమీప పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతనే పశువుల వధ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ పోతారం శ్రీనివాస్‌, సీఐలు బి.సునీల్‌ కుమార్‌, నాగరాజు, ఫణిదర్‌, ముస్లిం మత పెద్దలు, ఖురేషి వర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement