కై లాస్‌నగర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత పాలకవర్గాలకే తిరిగి ప్రభుత్వం పగ్గాలు అప్పగించింది. పాలకవర్గాలను రద్దు చేస్తూ ఇటీవల జారీ చేసిన జీవో 597ను హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లుగా మొన్నటి వరకు విధులు నిర్వహించిన వారికే తిరిగి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా సహకార శాఖ అధికారి ఎం.సత్యనారాయణ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి జిల్లాలోని 28 పీఏసీఎస్ పాత పాలవర్గాలు యథావిధిగా కొనసాగనున్నాయి. హైకోర్టు తీర్పు, ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
జిల్లా సహకార శాఖ పరిధిలోని ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలకు 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. సొసైటీ చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీటి ఐదేళ్ల పదవీకాలం గడువు గతేడాది ఫిబ్రవరి 13తో ముగిసింది. వారి విజ్ఞప్తి మేరకు పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించింది. గతేడాది ఆగస్టు 14తో పూర్తి కావడంతో ప్రభుత్వం రెండో సారి పొడిగిస్తూ అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దుచేస్తూ 19 డిసెంబర్ 2025న జీవో 597 జారీ చేసింది. దీంతో సర్కారు నిర్ణయంపై పాలకవర్గాలు ఒక్కసారిగా ఖంగుతున్నాయి. ఉన్నపాటుగా రద్దు చేసిన ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహిస్తుందని భావించారు. అయితే అలా చేయకుండా పర్స న్ ఇన్‌చార్జీలుగా సహకార శాఖ అధికారులు, ఉద్యోగులను నియమించింది. దీంతో ఆగ్రహించిన చైర్మ న్లు రాష్ట్ర హైకోర్టును అప్పట్లోనే ఆశ్రయించారు. ఈ క్రమంలో వారినే కొనసాగించాలంటూ హైకోర్టు సైతం ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఈ ఆదేశాలు లెక్కచేయకుండా నామినేటేడ్ పద్ధతిలో పాలకవర్గాలను భర్తీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది.
జీవో ఉపసంహరించుకున్న ప్రభుత్వం ..
సొసైటీ పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించాలని చెప్పినహైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయకపోవడంతో సొసైటీ చైర్మన్లు మరోసారి న్యా యస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వంపై కోర్టు ది క్కరణ కేసు ఫైల్ చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 597ను ఉపసంహరించుకుంది. 14.02.2025 రోజున చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారిని యఽథావిధిగా నియమించాలని సహకారశాఖ అధి కారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా సహకారశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 28 సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లుగా పాత వారికి బాధ్యతలు అప్పగిస్తూ డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తదుపరి చర్యల వరకు పాత సొసైటీలే కొనసాగనున్నాయి.


