నేరడిగొండ: అసెంబ్లీలో తాను చేసిన ప్రస్తావన ఫలి తంగా రాజురా గ్రామ రైతులకు నష్ట పరిహారం అందినట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని రాజురా గ్రామంలో చెరువు నిర్మాణంతో భూములు కోల్పోయిన 38 మంది రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.కోటి 18 లక్షల నష్టపరిహారాన్ని మంగళవారం ఆయన పంపిణీ చేశారు. 2012లో చెరువు నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు అప్పటి ప్రభుత్వం 2014లో 50 శాతం నిధులు విడుదల చేసిందని, మిగతా వాటి కోసం రైతులు ఏళ్లుగా ఎదురుచూస్తుండగా, ఇటీవల అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రెండో విడతగా నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇందులో మండల రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


