కై లాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎండగట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వీబీజీ రామ్‌జీ పేరిట తీసుకువస్తున్న కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ పేరిట కార్మికుల హక్కులను దెబ్బతీయాలని చూస్తోందన్నారు. గతంలో 95 శాతం వరకు నిధులు కేటాయించిన కేంద్రం, ప్రస్తుతం కేవలం 60 శాతానికి పరిమితం చేస్తూ పథకాన్ని క్రమంగా కనుమరుగుచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమం కోసం సీపీఎం చేపడుతున్న పోరాటాలకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇందులో నాయకులు మల్లేశ్, రాఘవులు, కిరణ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.


