ఆదిలాబాద్: దేశ రాజధానిలో జిల్లా బాల కేంద్రం చిన్నారులు తమ కూచిపూడి నృత్య ప్రతిభతో సత్తా చాటారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జాతీయ నృత్య పురస్కార మహోత్సవంలో అద్భుత ప్రదర్శన ఇచ్చి అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం, న్యూఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన సాంస్కృతిక లలిత కళల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నృత్యోత్సవం నిర్వహించారు. ఇందులో గడ్డం శ్రీనిధి, క్షీరసాగర జాహ్నవి, లింగంపల్లి సాయి కార్తీక, పడాల ధన్విక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వీరి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు వారికి పురస్కారాలు అందజేయడమే కాకుండా, మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ నృత్య పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అలాగే హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ సత్యరెడ్డి తన తదుపరి సినిమాలో వీరికి నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజేతలను మాస్టర్స్, తల్లిదండ్రులు, బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి ప్రత్యేకంగా అభినందించారు.


