జిల్లాకు చేరుకున్న 85శాతం బుక్స్ పాఠశాలల పునఃప్రారంభం రోజే పంపిణీ ఈనెల 15 నుంచి బడులకు సరఫరా
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బడుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించింది. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సైతం బడులు తెరిచే రోజు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 85 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాములకు చేరాయి. ఈనెల 15 నుంచి వాటిని మండల పాయింట్లకు చేర్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే వీటిని రవాణా చేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో అయోమయంలో ఉన్నారు.
చేరుకున్న పాఠ్య పుస్తకాలు..
పాఠ్యపుస్తకాల్లో తెలుగు, ఉర్దూ మీడియం వారికి పార్ట్–1 పుస్తకాలను పంపిణీ చేస్తారు. మొదటి విడ త జూన్‌లో పంపిణీ చేయనుండగా, నాలుగైదు నెలల తర్వాత పార్ట్–2 పుస్తకాలు రానున్నాయి. వీటిలో తెలు గు, ఉర్దూ ఒకవైపు ఉండగా, ఇంగ్లిష్‌లో మరోవైపు ముద్రించబడి ఉంటుంది. దీంతో ఆంగ్ల మాధ్య మం చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఇంగ్లిష్, మరాఠీ, హిందీ మీడియంకు సంబంధించి ఒకేసారి సరఫరా అవుతా యి. అయితే ఈ పుస్తకాలను పార్ట్–1గా విభజించడం ద్వారా బరువు సైతం తగ్గిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటితో పాటు విద్యార్థులకు నోట్‌బుక్‌లను సైతం ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇవి నేరుగా పాఠశాలలకే సరఫరా కానున్నాయి.
మొదటిరోజే పంపిణీ..
ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి జిల్లా కేంద్రాలకు సరఫరా చేసింది. అయితే ఇక్కడి నుంచి ఎంఆర్‌సీ పాయింట్లకు, అక్కడినుంచి స్కూళ్లకు సరఫరా చేయాల్సి ఉంది. గ తేడాది పాఠ్య పుస్తకాల పంపిణీలో కొంత ఆలస్యమైంది. ఈసా రి అలా జరగకుండా పుస్తకాలను సరఫరా చేసేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు చేపడుతున్నాయి. పుస్తకాల పంపిణీకి గడువు సమీపిస్తుండడంతో పూర్తిస్థాయిలో సరఫరా అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాల ఎంఈవోలు గోదాం నుంచి పుస్తకాల ను తీసుకెళ్తుండగా, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, బోథ్, ఇంద్రవెల్లి దూర ప్రాంతాల మండలాలకు సకాలంలో సరఫరా చేస్తే విద్యార్థులకు మొదటిరోజే పుస్తకాలను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రాథమిక స్థాయికి సంబంధించిన పుస్తకాలు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. సకాలంలో పుస్తకాలు పాఠశాలలకు చేరుకుంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
జిల్లాలో..
మొత్తం పాఠశాలలు : 1,439
రావాల్సిన పాఠ్యపుస్తకాలు : 4,80,700
ఇప్పటివరకు చేరుకున్నవి : 4,10,000
ఇంకా రావాల్సినవి : 70,700
డీఈవో పరిధిలో 702 పాఠశాలలు ఉండగా, మిగతా అన్ని యాజమాన్యాలు కలిపి 1,439 ఉన్నాయి. కాగా ప్రైవేట్ మినహా మిగతా యాజమాన్యాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. జిల్లాకు అవసరమైన పుస్తకాలు 4లక్షల 80వేల 700 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల10వేల పుస్తకాలు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌వీఎం గోదాంతో పాటు మార్కెట్ యార్డులో వీటిని భద్రపర్చారు. ఈనెల 15 నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే రవాణా చార్జీలు విడుదల కాకపోవడంతో సరఫరా ఏవిధంగా చేయాలనే ఆలోచనలో పడ్డారు. గతేడాది డీసీఈబీ నుంచి నిధులను సమకూర్చారు.


