బల్దియా గ్యారేజ్‌ | - | Sakshi
Sakshi News home page

బల్దియా గ్యారేజ్‌

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

సొంతంగా మరమ్మతులు, సర్వీసింగ్‌ నిర్వహణ రూ.50లక్షల వ్యయంతో ఏర్పాటు టెండర్ల నిర్వహణకు అధికారుల కసరత్తు అందుబాటులోకి వస్తే మున్సిపల్‌కు భారీగా నిధులు ఆదా

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి ఇక సొంత వాహన గ్యారేజీ అందుబాటులోకి రానుంది. చెత్త సేకరణ, నీటి సరఫరా, ఇతరత్రా వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్‌కు బల్దియా ఏటా లక్షలా ది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. చిన్నపాటి మరమ్మతులకు సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో బల్దియాపై ఆర్థిక భా రం పడుతుంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలని భావించిన మున్సిపల్‌ నూతన కౌన్సిల్‌ సొంతంగా గ్యారేజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖర్చులు తగ్గించుకునేలా..

మున్సిపల్‌ పరిధిలో చెత్త సేకరణ, నీటి సరఫరాకు సంబంధించిన ట్రాక్టర్లు, ట్రాలీఆటోలు, పొక్లెయిన్లు, ట్యాంకర్లు వందలాదిగా ఉన్నాయి. వీటి నిర్వహణను ప్రైవేట్‌గా చేయిస్తున్నారు. దీంతో ప్రతినెలా మున్సిపల్‌ నుంచి రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరం లేనప్పటికీ ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది తప్పుడు బిల్లులు సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించిన నూతన కౌన్సిల్‌ సొంతంగా బల్దియా గ్యారేజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతనెల 29న నిర్వహించిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. టెండర్లు నిర్వహణకు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్థలం ఎంపిక..

పట్టణంలోని 44వ వార్డు పరిధిలోకి వచ్చే సుందరయ్యనగర్‌లోని రక్షిత మంచినీటి స్థలంలో గల మున్సిపల్‌ ప్రాంతాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఇప్పటికే అక్కడ తాత్కాలికంగా ప్రహరీ నిర్మించి ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో గ్యారేజీగా రూపుదిద్దనున్నారు. మరమ్మతులకు ప్రత్యేక షెడ్లతో పాటు వాటర్‌ వాషింగ్‌ కోసం మిషన్‌ కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులను ఇద్దరు కార్మికులు చేపడుతుండగా, గ్యారేజ్‌ అందుబాటులోకి వస్తేమరో ఇద్దరిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌ ద్వారా అవసరమైన సామగ్రి తెప్పించాలని భావిస్తున్నారు. మొత్తంగా బల్దియాకు సొంతంగా గ్యారేజ్‌ ఏర్పాటు కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement