కై లాస్‌నగర్: జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని స్థానిక ఎస్టీయూ భవన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూషతో కలిసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు యంత్రాంగం నిరంతరం గ్రామాలను సందర్శించాలన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతీ దరఖాస్తును నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు వివిధ పథకాల ప్రయోజనాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అంగన్‌వాడీల స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో టీజీఎస్‌సీపీసీఆర్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, అదనపు ఎస్పీ పి.సురేందర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


