కై లాస్‌నగర్: పట్టణ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. అలాగే ఆదిలాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతాం.. బల్దియా ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అన్నారు ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జగదీశ్వర్‌గౌడ్. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: మరో వారం, పది రోజుల్లో పట్టణంలోని పలు కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశముంది.. నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతారు?
కమిషనర్: ప్రస్తుతం మిషన్ భగీరథ నీటితో పాటు లాండసాంగ్వి, మావల నుంచి కూడా నీటి సరఫరా జరుగుతుంది. సమస్య తలెత్తితే ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం.
సాక్షి: పట్టణంలోని 49 వార్డులకు ఒకే శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉండటంతో పర్యవేక్షణ లోపించి పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతుందనే విమర్శలున్నాయి.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
కమిషనర్: త్వరలోనే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తోపాటు జవాన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా. అలాగే చెత్త సేకరణ కోసం కొత్తగా ఐదు ఎలక్ట్రికల్ ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దు. ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికే అప్పగించాలి. పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలి.
సాక్షి: గ్రేడ్–1 స్థాయి కలిగిన మున్సిపల్‌లో ఆదాయం పెంపుకోసం ఎలాంటి కార్యాచరణ చేపడుతారు..?
కమిషనర్: ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, నల్లా బిల్లులు సకాలంలో వసూలు చేసేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాను. ప్రధానంగా జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా ఇళ్లను సర్వే చేయిస్తాను. అలాగే ప్రచార హోర్డింగ్‌లకు సంబంధించి పన్నులను సైతం రెగ్యులర్‌గా రాబట్టేలా చూస్తాను. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది.
సాక్షి: కార్యాలయంలో పలువురు అధికారులతో పాటు ఉద్యోగులు సైతం సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి.. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?
కమిషనర్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు మినహా మిగతా వారంతా సమయపాలన పాటించాలి. కార్యాలయంలో విధిగా అందుబాటులో ఉండాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం.
సాక్షి: పలు కాలనీల్లో లీకేజీల ద్వారా మిషన్ భగీరథ నీరు
వృథాగా పోతుంది.. వాటిని ఎలా
అరికడుతారు?
కమిషనర్: లీకేజీలు గుర్తించేందుకు వార్డుల వారీగా స్పెషల్ డ్రైవ్‌తో పాటు అవసరమైన చర్యలు చేపడుతాం. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి.
సాక్షి: పట్టణంలో చాలా చోట్ల ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకుగా మారాయి.. వాటిపై ఎలాంటి చర్యలు చేపడుతారు?
కమిషనర్: ఆక్రమణల విషయాన్ని చైర్‌పర్సన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం.


