విచారణ నామమాత్రం.. | - | Sakshi
Sakshi News home page

విచారణ నామమాత్రం..

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

జీపీల్లో నిధుల స్వాహా వ్యవహారంపై.. నెల క్రితం వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న అధికారులు ఇప్పుడేమో చిన్న తప్పే అంటూ వెనక్కి.. యంత్రాంగం తీరుపై అనుమానాలు

సాక్షి,ఆదిలాబాద్‌: గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జిల్లాకు మూడు విడతల్లో కలిపి సుమారు రూ.40 కోట్ల వరకు నిధులు వచ్చాయి. వీటిని అడ్డగోలుగా స్వాహా చేస్తున్నారని, పెండింగ్‌ బిల్లులు తమకు వచ్చేవి ఉన్నాయంటూ పలువురు కార్యదర్శులు నిబంధనలు ఉల్లంఘించి హాంఫట్‌ చేసిన తీరును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పట్లో దీనిపై విచారణ చేస్తున్నామని, వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తే చర్యలు తప్పవని చెప్పిన అధికారులు నామమాత్రంగా వ్యవహారాన్ని ముగించేందుకు యత్నిన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలు ఇలా..

ప్రస్తుత పాలకవర్గాలు ఏర్పడక ముందు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కార్యదర్శుల ఆధ్వర్యంలో జీపీల నిర్వహణ కొనసాగిన విషయం తెలిసిందే. గత సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సమయంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచి పోవడం, రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక ఫండ్స్‌ రాకపోవడంతో పారిశుధ్యం, విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్ల నిర్వహణ కోసం కార్యదర్శులుగా వ్యవహరించిన వారు తమ జేబుల్లో నుంచి వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్త పాలకవర్గాలు ఏ ర్పడిన తర్వాత పెండింగ్‌ నిధులు కోట్లలో వచ్చాయి. అయితే వాటిని సరైన బిల్లులు లేకుండానే ఫోరం, ఏజెన్సీల పేరిట కాకుండా నేరుగా వ్యక్తిగత ఖాతా ల్లోకి చాలా మంది కార్యదర్శులు మళ్లించుకున్నారు. ఈ అక్రమాలను ‘సాక్షి’ మార్చి 31న ‘నిధులు స్వాహా’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఏజెన్సీల పేరిట కాకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి లక్షల నిధులను మళ్లించుకుంటున్నారని కథనంలో పేర్కొంది.

కొత్త పేమెంట్స్‌ నిలుపుదల..

జిల్లాకు రూ.40 కోట్ల పెండింగ్‌ నిధులు రాగా ‘సాక్షి’లో ఈ అక్రమాలకు సంబంధించి కథనం ప్రచురితమైన సమయానికే అందులో నుంచి సగానికి పైగా పేమెంట్లు అడ్డగోలుగా చేపట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో విచారణ చేపడుతున్న క్రమంలోనే కొత్త పేమెంట్లను నిలుపుదల చేశారు. ఇప్పటికీ అదే పరిస్థితి. అయితే విచారణ మమ అనిపించేలా కొనసాగిందన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారిస్తే పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు బయటపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

చిన్న చిన్న తప్పులే..

గ్రామపంచాయతీల్లో నిధులను డ్రా చేసుకునే క్రమంలో చిన్న చిన్న తప్పులకు పాల్పడినట్లు మా విచారణలో తేలింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. కొత్త పేమెంట్లను నిలిపివేశాం. పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తున్నాం.

– రమేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి

ఈ విషయంపై డీపీవో రమేశ్‌ను నాడు వివరణ కోరగా.. విచారణ జరుపుతామని, ఎవరైనా వ్యక్తిగతంగా నిధులు స్వాహా చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణ నామమాత్రంగా ముగించి, చిన్న తప్పులే జరిగాయని నివేదిక తయారు చేసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో జరిగిన అక్రమాలకు సంబంధించి విచారణ అధికారులు నామమాత్రంగా ముగించి కప్పిపుచ్చాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement