నాలుగేళ్లుగా జిల్లా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా జిల్లా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా..

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

ఎస్సెస్సీలో జిల్లా ఉత్తీర్ణత 96.90శాతం గతేడాదితో పోల్చితే డౌన్‌ రాష్ట్రస్థాయిలో జిల్లాకు 21వ స్థానం

ఆదిలాబాద్‌టౌన్‌: అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 12 స్థానాలు పడిపోయింది. టెన్త్‌ ఫలితాలను ప్రభుత్వం సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం విడుదల చేశారు. ఈ సారి ప్రైవేట్‌కు ధీటుగా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు సైతం అత్యుత్తమ మార్కులు సాధించారు.

తగ్గిన ఉత్తీర్ణత శాతం..

గతేడాదితో పోల్చితే ఈ సారి 0.5 శాతం ఉత్తీర్ణత తగ్గింది. గత ఏడాది 97.40 శాతం విద్యార్థులు ఉత్తీ ర్ణులు కాగా ఈసారి 96.90 శాతం నమోదైంది. గతేడాది జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలువగా ఈ సారి 21 స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 10,875 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 10,538 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 5,439 మంది హాజరు కాగా 5,227 మంది పాస్‌ అయ్యారు. 91.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 5,436 మంది పరీక్షకు హాజరు కాగా 5,311 మంది పాస్‌ అయ్యారు. 97.7 శాతం ఉత్తీ ర్ణత నమోదైంది. ఉత్తీర్ణత శాతం పరంగా 0.5 శా తం తగ్గినప్పటికీ స్థానం మాత్రం 9 నుంచి 21వ స్థానానికి పడిపోవడం ఫలితాల్లో నమోదైన వెనుకబాటుకు నిదర్శనంగా నిలుస్తోంది.

నేటి నుంచి రీకౌంటింగ్‌కు అవకాశం..

మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు గడువు విధించింది. రీకౌంటింగ్‌ కోసం రూ. 500, రీవెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

సబ్జెక్టుల వారీగా..

తెలుగులో 99.43 శాతం, సెకండ్‌ లాంగ్వేజ్‌లో 99.83, ఇంగ్లీష్‌లో 98.41, గణితంలో 99.23, సైన్స్‌లో 98.79, సాంఘిక శాస్త్రంలో 99.61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలుగులో 62 మంది, సెకండ్‌ లాంగ్వేజ్‌లో 19, ఇంగ్లీష్‌లో 173, గణితంలో 84, సైన్స్‌లో 132, సోషల్‌లో 42 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.

యాజమాన్యాల వారీగా..

ఆశ్రమ పాఠశాలల్లో 98.88 శాతం, బీసీ వెల్పేర్‌లో 99.50, ప్రభుత్వ పాఠశాలల్లో 86.97, కేజీబీవీల్లో 98.40, మోడల్‌ స్కూళ్లలో 99.82, ప్రైవేట్‌ స్కూళ్లలో 98.59, రెసిడెన్షియల్‌ మినీలో వంద శాతం, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌లో వంద శాతం, ట్రైబ ల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌లో 98.99 శాతం, జెడ్పీలో 95.02 శాతం ఉత్తీర్ణత సాధించారు.

డీఈవో కార్యాలయం

సంవత్సరం ఉత్తీర్ణత శాతం జిల్లా స్థానం

2022-23 88.68 19

2023-24 92.23 17

2024-25 97.40 9

2025-26 96.90 21

మెరుగైన ఫలితాల సాధనకు చర్యలు

జిల్లాలో ఈసారి ఫలితాల్లో కొంత వెనుకబడ్డాం. వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేలా ముందు నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తాం. కేజీబీబీవీలతో పాటు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాం. ఫెయిల్‌ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.

– ఎస్‌.రాజేశ్వర్‌, అదనపు కలెక్టర్‌,

ఇన్‌చార్జి డీఈవో

జూన్‌ 5 నుంచి సప్లిమెంటరీ..

పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం జూన్‌ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ నెల 30 నుంచి మే 14 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. మే 15 వరకు ప్రధానోపాధ్యాయులు ఎన్‌ఆర్‌లను ఆన్‌లైన్‌ ద్వారా డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.

Advertisement
 
Advertisement
Advertisement