రూ.7.94లక్షల వ్యయంతో నీటి సంరక్షణ చర్యలు నీటి కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ జేఎస్‌జేబీ నిధులతో పనులు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పా ర్కులో నెలకొన్న నీటి కరువు దూరం చేసి పచ్చదనం పెంపొందించే దిశగా కలెక్టర్ రాజర్షి షా ప్ర త్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాకు ప్రకటించిన జల్‌శక్తి జన్ బాగీదారి నగదు పురస్కారం కింద అందించిన నిధుల ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. రూ.7.94లక్షల వ్యయంతో నీటి కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు నిర్మించే పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన ఈ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. త్వరితగతిన పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు.
పార్కులో నీటి కటకట..
పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజ లకు ఆహ్లాదం పంచే ఏకై క పార్కు ఇది. వారాంతపు సెలవులు, పండుగ రోజుల్లో చిన్నపిల్లలతో కిటకిట లాడుతుంది. అయితే ఈ ఉద్యానవననంలో తర చూ నీటి కటకట నెలకొంటుంది. ముఖ్యంగా వేసవి లో సమస్య జఠిలమవుతుంది. పార్కులో పచ్చద నం పంచేందుకు, నీటి అవసరాలు తీర్చేందు కోసం ఏడు బోర్లు ఉన్నప్పటికీ అందులో వేసవిలో ఒక్కటి మాత్రమే పనిచేయడం గమనార్హం. భూగర్భజలాలు అడుగంటి మిగతా వాటి నుంచి చుక్కనీరు రాని పరిస్థితి. ఈ క్రమంలో మొక్కలను సంరక్షించుకోవడం సమస్యాత్మకంగా మారుతుంది. ఆహ్లాదం పంచాల్సిన పచ్చదనం ఎండలకు కరువవుతోంది. దీంతో సందర్శకులకు నిరాశ తప్పని పరిస్థితి.
వర్షపునీటిని ఒడిసిపట్టేలా..
పార్కులో నీటి ఎద్దడి పరిస్థితిని గమనించిన కలెక్టర్ ఇటీవల జల్‌శక్తి జన్ బాగీదారి కేంద్ర పురస్కారం ద్వారా జిల్లాకు వచ్చిన నిధులను వినియోగించాలని భావించారు. వర్షపునీటిని వందశాతం ఒడిసిపట్టి సంరక్షించేలా ఏడు నీటి కుంటలు నిర్మించాలని నిర్ణయించారు. పార్కులో ని ఉసిరివనంలో నిర్మించే వీటిలో ఒక్కో దానికి రూ.92వేలు వెచ్చించనున్నారు. కుంట చుట్టూరా వర్షపునీరు నిలిచి ఉంచేలా ప్రత్యేకంగా రాళ్ల కట్టలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పార్కులోని ఆరు బోరు బావుల్లో నీటిని నిల్వ ఉంచేలా ప్రత్యేకంగా బోర్‌వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ నిర్మించనున్నారు. ఇందుకోసం ఒక్కో దానికి రూ.30వేల చొప్పున వెచ్చించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల స్విమ్మింగ్ పూల్‌లో వృథా నీటిని వేసవిలో ఇందులోకి మళ్లించేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా తెలు స్తోంది. ఈ చర్యలతో పార్కులో నీటి సమస్య పూర్తిగా తొలగిపోనుందని డీఆర్డీఏ అధికారి గోరఖ్‌నాథ్ చౌహన్ తెలిపారు.


