మళ్లీ తెరపైకి.. అక్రమ అసెస్‌మెంట్లు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో చోటు చేసుకున్న అక్రమ అసెస్‌మెంట్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా వరంగల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) షాహిద్ మసూద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీసులు, మున్సిపల్ అధికారులతో తాజాగా విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. గత కౌన్సిల్ హయాంలో పట్టణంలోని కేఆర్‌కే, ఎంప్లాయీస్ కాలనీ, సర్వే నం.170, టీచర్స్ కాలనీ, మావల, సర్వేనం.68, ఖానాపూర్, దుబ్బగూడ తది తర కాలనీల్లో వందలాది ప్రభుత్వ స్థలాలతో పా టు పేదలకు సర్కారు కేటాయించిన స్థలాలను కొంత మంది ఆక్రమించేశారు. వాటికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో అసెస్‌మెంట్ (డోర్ నంబర్) పొందారు. ఆందోళనకు గురైన బాధితులు అప్పట్లోనే ఎస్పీ అఖిల్ మహా జన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా పోలీస్ బాస్ సీడీఎంఏకు లేఖ రాశారు. ఈమేరక ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆర్‌డీ మంగళవారం విచారణ జరిపారు. మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో జరిగిన అక్రమ అసెస్‌మెంట్లు, వాటికి జతచేసిన డాక్యుమెంట్లను పరిశీలించారు. మున్సిపల్, పోలీసు అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్ల వివరాలు పరిశీలించారు. వాటిని ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీశారు. కాలనీల వారీగా అక్రమ అసెస్‌మెంట్లపై నిర్ణీత ప్రొఫా ర్మాలో నివేదిక అందజేయాలని మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. చర్యలు తప్పవనే అధికారుల సూచనతో వాటి నుంచి ఏవిధంగా బయటపడాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో ముగ్గురు మున్సిపల్ అధికారులపై వేటుపడిన విషయం తెలిసిందే. మరింత సమగ్రంగా విచారణ జరిపితే మరింత మందిపై చర్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నివేదిక సిద్ధం చేస్తున్నాం..
గతంలో జరిగిన అక్రమ అసెస్‌మెంట్ల వ్యవహారంపై వరంగల్ ఆర్‌డీ విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో ఆరా తీసి డాక్యుమెంట్లను పరిశీలించారు. కాలనీల వారీగా ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ ల్యాండ్‌లు, పట్టా కలిగిన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసి అసెస్‌మెంట్ చేసుకున్న వారి వివరాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు. తదనుగుణంగా దృష్టి సారించాం. పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పిస్తాం.
– జి.రాజు, మున్సిపల్ కమిషనర్


