కై లాస్‌నగర్: కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ బండారి అనూష అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆయన తొలిసారిగా హాజరయ్యారు. పట్టాణాభివృద్ధిలో ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై ఆరా తీశారు. ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కేంద్రం నుంచి అదనంగా నిధులు తీసుకువస్తానన్నారు. అమృత్ పథకంలో వివిధ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బల్దియాకు సొంత గ్యారేజ్ ..
మున్సిపల్ వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్, వాటర్ వాషింగ్ పనులను సొంతంగా నిర్వహించేలా రూ.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న సొంత గ్యారేజ్‌కు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే అన్ని కమ్యూనిటీల శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించింది. నీటి సరఫరా మోటర్ల మరమ్మతు, వీధి దీపాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ వేతనాల కోసం నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. 16 అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించగా వినాయక్ చౌక్, ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలోని వీధి వ్యాపారుల దుకాణాల అద్దె పెంపును వాయిదా వేయగా.. మిగతా అన్ని అంశాలకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. సమావేశానికి మున్సిపల్ అధికారులతో పాటు హౌసింగ్, రెవెన్యూ, డీఆర్డీఏ, విద్యుత్‌శాఖల అధికారులు తొలిసారిగా హాజరయ్యారు. సమావేశంలో కమిషనర్ జి.రాజు, ఎంఈ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


