కూలి బతుకులపై పిడుగు | - | Sakshi
Sakshi News home page

కూలి బతుకులపై పిడుగు

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం మరో ఐదుగురికి గాయాలు మృతులంతా దినసరి, రైతు కూలీలు

యర్రగొండపాలెం/పుల్లలచెరువు/కనిగిరి రూరల్‌/ముండ్లమూరు/దర్శి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం మండుటెండలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వడగండ్ల వానకు తోడు భీకర శబ్దాలతో పిడుగులు పడ్డాయి. బతుకు దెరువు కోసం పంట పొలాల్లో పనులు చేసుకునే కూలీలు, పశువులు మేపుకునే కాపరుల పాలిట ఆ పిడుగులు మృత్యుపాశాలయ్యాయి. పిడుగుల ధాటికి ఆరుగురు మృత్యువాత పడగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

● పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బీహార్‌ రాష్ట్రం అరారియా జిల్లా అచర గ్రామానికి చెందిన కన్నయ్య(18) మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న అచర గ్రామానికి చెందిన అజాద్‌ కుమార్‌, రజనీష్‌ కుమార్‌, నితీష్‌ కుమార్‌, రాజు కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మండలంలోని యండ్రపల్లి గ్రామానికి సమీపంలో మొక్కజొన్న తోటలో కంకులు కోస్తున్న సమయంలో పిడుగు పడటంతో రైతు కూలి బొందలపాటి నాగయ్య (60) మృతి చెందాడు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో పంట అన్‌లోడ్‌కు వచ్చిన లారీలో ఉన్న కంకులు తడుస్తాయని బీహార్‌ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలు ఆ లారీపై పట్టలు కప్పుతున్నారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో అక్కడికి సమీపంలో పిడుగుపడింది. పిడుగు ధాటికి కూలీలు కింద పడిపోయారు. వారిలో కన్నయ్య మృతి చెందాడు. మిగిలిన కూలీలకు గాయాలయ్యాయి. గాయాలైన వారు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సంఘటన తెలిసిన వెంటనే సీఐ అజయ్‌కుమార్‌, ఎస్సై సాంబశివరావు హుటాహుటిన వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. ఈ కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

● అదే విధంగా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(37) పశువుల వ్యాపారం చేసుకుంటూ పుల్లలచెరువు మండలంలోకి రాగా వర్షంతో పాటు మెరుపులు, ఉరుములు రావడంతో సమీపంలోని చెట్టు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడడంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టు తోర్రలో పిడుగు పడడంతో చెట్టు కూడా కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు.

● ముండ్లమూరు మండలంలోని వేములబండ పొలాల్లో సోమవారం సాయంత్రం పిడుగుపడి పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ (19) మృతిచెందాడు. శివకృష్ణ తన బంధువులైన రావులపల్లి శ్రీను, మల్లయ్య, మరికొందరితో కలిసి వేములబండ రైతుల పొలాలకు గొర్రెలను కౌలుకు తీసుకుని మేత మేపుకుంటున్నారు. సోమవారం సాయంత్రం శివకృష్ణ సెల్‌ఫోన్‌ మాట్లాడుతుండగా అతడు ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి కాపరులు శివకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతని తల్లిదండ్రులు కుమార్‌, భవానీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని తహశీల్ధార్‌ ఆర్‌ శ్రీకాంత్‌, ఆర్‌ఐ మూర్తి, ఏఎస్‌ఐ బి పవన్‌ కుమార్‌ పరిశీలించారు.

● దర్శి మండలం శామంతపూడిలో ఆవుల మల్లికార్జునరావు (26) సోమవారం మేత కోసం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు విలపించారు.

● కనిగిరిలో పిడుగుపాటుకు రైల్వే పనుల కోసం వచ్చిన కార్మికుడు దుర్గేష్‌ కుమార్‌ (24) మృతి చెందాడు. బీహార్‌కు చెందిన దుర్గేష్‌ కుమార్‌ వారం రోజుల క్రితం కనిగిరి సమీపంలోని పోలవరం, కలగట్ల వద్ద జరుగుతున్న రైల్వే లైన్‌ పనుల కోసం వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. రైల్వే లైన్‌ సమీపంలో పిడుగు పడటంతో అక్కడే పనులు చేస్తున్న కార్మికుడు దుర్గేష్‌ మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement