‘వేలాల’.. చిన్న చూపెలా?
ఏటా లక్షలాదిగా వస్తున్న భక్తజనం శివరాత్రికి రూ.50లక్షల ఆదాయం ఆదరణ ఉన్నా.. అభివృద్ధి శూన్యం మహాజాతరలో తాత్కాలిక వసతులే ఆలయాన్ని పట్టించుకోని పాలకులు
జైపూర్: ఉత్తర తెలంగాణలో మరో కొమురవెల్లి మల్లన్నగా వెలుగొందుతున్నాడు వేలాల మల్లన్న స్వామి. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులకు కొంగుబంగారం నిలుస్తూ దినదిన ప్రవర్తమానం చెందుతున్నాడు. ఏటా ఇక్కడ శివరాత్రికి మహాజాతర నిర్వహిస్తారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు కూడా వేలాదిగా తరలివస్తారు. జాతర సమయంలో వేలాల ప్రాంతం భక్తజన సంద్రంగా మారుతుంది. కానీ, దశాబ్దాలు గడుస్తున్నా మల్లన్న ఆలయం అభివృద్ధి చెందడం లేదు. జాతర ప్రాముఖ్యతను గుర్తించని ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలేదు. ఇక్కడి పాలకులు ఇంతటి విశిష్టత కలిగిన శైవక్షేత్రంపై దృష్టి సారించకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తంజేస్తున్నారు. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు వేలాలలో మహాజాతర నిర్వహించనున్నారు. మహాజాతర సందర్భంగా రూ.50లక్షలకు పైనే ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. అయినా.. ఆలయాభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.
ఇదీ.. ఆలయ నేపథ్యం
జైపూర్ మండలం వేలాల గ్రామంలో గుట్ట (గట్టు)పై స్వయంభువుగా శ్రీమల్లన్నస్వామి వెలిశా డు. గుట్టపైన దొణలో 200 ఏళ్ల కిందట గట్టు మల్ల న్న స్వామి వెలియగా గ్రామంలో శ్రీమల్లికార్జునస్వామి ఆలయం నిర్మించారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే మహాజాతరకు మూడు రాష్ట్రాల భక్తులు అధికసంఖ్యలో వస్తారు. ఇష్టదైవమైన మల్లన్నస్వామికి మొక్కులు తీర్చుకుంటారు.
తాత్కాలిక వసతులతోనే సరి
జాతర సమయంలోనే ఇక్కడ భక్తులకు తాత్కాలిక సౌకర్యాలు మాత్రమే కల్పిస్తారు. తొలిరోజు గుట్టపై అటవీ ప్రాంతంలో జాతర సాగుతుంది. అక్కడ దొణలోని మల్లన్నస్వామి ఆలయం, కింద గ్రామంలో నిర్మించిన శ్రీమల్లికార్జునస్వామి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రధానంగా గుట్టపైన భక్తులకు తాగునీటి వసతి, గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైటింగ్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వీటితో పాటు ఘాటు రోడ్డు నిర్మాణం, దొణలో వెలిసిన మల్లన్నస్వామిని సులభంగా భక్తులు దర్శనం చేసుకునేలా అవకాశం కల్పించాలి. జాతరలో రెండోరోజున గుట్ట కింద మల్లికార్జునస్వామి ఆలయం వద్ద జాతర సాగుతుంది, కానీ, ఇక్కడా భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలయ సమీపంలో భక్తులకు విశ్రాంతి భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా తాత్కాలిక వసతులతోనే సరి పెడుతున్నారు.
గుట్టపైకి మట్టి రోడ్డే దిక్కు
వేలాల గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులంతా గుట్టపైకి కాలి నడకన చేరుకుంటారు. గుట్టపైకి వెళ్లే రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రోడ్డులో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా దుమ్ము లేచి నడకమార్గంలో వెళ్లే భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. నేటికీ ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించలేదు. దీంతో మట్టి రోడ్డు మార్గంలోనే భక్తులు వెళ్తుంటారు. ప్రతీ నెలలో ఆరుద్ర నక్షత్రం రోజున గట్టు మల్లన్న గుట్టపై భక్తులు గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. జాతర సమయంలోనే కాకుండా మిగతా స మయాల్లోనూ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటికై నా చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతీసుకుని ప్రభుత్వం నుంచి ని ధులు మంజూరు చేయించి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
‘వేలాల’.. చిన్న చూపెలా?
‘వేలాల’.. చిన్న చూపెలా?


