హలో అన్నా.. ఎప్పుడొస్తున్నరు
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఐదేళ్ల పదవిని కోల్పోయన వారు ఎందరో. ఈ మేరకు బరిలో నిలిచిన అభ్యర్థులు అప్రమత్తమవుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్కో ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి మరీ తమకు మద్దతునివ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఓటు ఉండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నారు. తప్పకుండా పోలింగ్‌కు రావాలని కోరుతున్నారు. ప్రయాణ, ఇతర ఖర్చులు చూసుకుంటామని పేర్కొంటున్నారు. అప్పటికప్పుడే ఫోన్‌పే, గుగుల్ పేలో కొంత అమౌంట్ పంపుతున్నారు. వచ్చాక మరి కొంత ఇస్తామని చెబుతున్నారు. తమకు అనుకూలంగా పడే పక్కా ఓట్లు ఎన్ని అనేదానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. కొంత కష్టపడితే వచ్చే ఓట్లేన్ని, తటస్తంగా ఉన్న ఓట్లను ఏ విధంగా రాబట్టుకోవాలనే దానిపై పార్టీ నేతలు, తమ ప్రధాన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వలస ఓటర్లపై దృష్టి సారించారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార ఇతరత్రా పనుల నిమిత్తం హైదరాబాద్, వరంగల్, బెంగుళూర్ వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని రప్పించేలా చర్యలు చేపడుతున్నారు. వారి వివరాలు సేకరిస్తూ ఆ ఓట్లను రాబట్టుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ప్రత్యేక ఆహ్వానం ..
వలస వెళ్లిన కాలనీవాసుల ఓట్లను సొంతం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ ఉండగా ఆ రోజు తప్పకుండా రావాలని ఫోన్లు చేస్తూ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు. వారిని ఒప్పించి, రప్పించేలా చూడాల్సిన బాధ్యతను ప్రత్యేకంగా కొందరికి అప్పగించారు. దీంతో వారు వలస ఓటర్లకు ఫోన్ చేసి రావాలని కోరుతున్నారు. ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చుల కింద కొంత మొత్తంను ఆన్‌లైన్ ద్వారా వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. కొంతమంది స్వయంగా ప్రయాణ టికెట్లను సైతం బుక్ చేస్తున్నారు. నలుగురు, ఐదుగురు ఓటర్లు ఒకే చోట ఉన్నట్‌లైతే వారి కోసం ప్రత్యేకంగా వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో సుమారు 5వేల నుంచి 7వేల వరకు వలస ఓటర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


