ఆకర్షిస్తూ.. ఆలోచింపజేస్తూ
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ప్రత్యేక రథాలను ఏర్పాటు చేసుకుని హోరాహోరీ గా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అధికారికంగానూ పట్టణంలో పలు ప్రచార రథాలు సందడి చేస్తున్నాయి. పార్టీలు తమకు ఓటు వేయమని అభ్యర్థిస్తుంటే... అధికారిక ‘స్వీప్’ రథం ఓటు హక్కును వినియోగించుకోమని సూచిస్తోంది. పోలింగ్ తేదీ, సమయం, ఓటు వేసేందుకు వెంట తీసుకువెళ్లాల్సిన పత్రాలు, బ్యాలెట్ పేపరు నమూనా, ఓటరు ప్రతిజ్ఞ వంటి అంశాలతో రూపొందించిన ఈ రథం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుగుతున్న ఈ స్వీప్ రథాలు ఓటర్లను ఆకర్షిస్తూ, ఆలోచింపజేస్తున్నాయి.


