నామినేషన్ల సందడి
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. పట్టణంలోని టీటీడీసీలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 49 వార్డులుండగా మూడు వార్డులకు ఒకటి చొప్పున రెండు గదుల్లో మొత్తం 17 కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో కౌంటర్‌లో ఆర్‌వో, ఏఆర్‌వోను నియమించారు. నామినేషన్ పత్రాలు అందించడం, అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఒక్కో అభ్యర్థికి రెండు సెట్ల చొప్పున ఫారా లను అందజేశారు. తొలి రోజున వివిధ రాజకీయ పార్టీల తరఫున మొత్తం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్‌ఎస్ తరఫున 4, కాంగ్రెస్ తరఫున 3, బీజేపీ తరఫున ఒకటి దాఖలైంది. కాగా మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ 32వ వార్డు నుంచి తొలి రోజునే తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి , ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కమిషనర్ జి.రాజును ఆదేశించారు. గడువు ఎక్కువగా లేకపోవడంతో గురు, శుక్రవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.


