ముట్టడి ఉద్రిక్తం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తోపులాట నాయకుల అరెస్ట్.. స్టేషన్‌కు తరలింపు
ఆదిలాబాద్‌టౌన్: రంగు మారిన సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు పోలీసులతో పాటు కార్యకర్తలు గాయపడ్డారు.
ముందస్తుగా భారీ బందోబస్తు..
బీఆర్‌ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గులాబీ శ్రేణులు అక్కడికి చేరుకుని రైతుల సమస్యలపై నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన వారిని పొలీసులు అడ్డుకున్నారు. రామన్నతో పాటు పలువురు నేతలను స్టేషన్‌కు తరలించే క్రమంలో పార్టీ నేతలు ఆ వాహనాల ఎదుట బైఠాయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. స్టేషన్‌లోనూ రామన్న నిరసనకు దిగడంతో నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో నేతలు స్టేషన్ ఎదుట బైఠాయించి రామన్నను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగా రు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోనికి అనుమతించడంతో శాంతించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే ఇందుకు కారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా తాము శాంతియుతంగా చేపడుతున్న ధర్నాను పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. రంగు మారిన సోయా, తేమ శాతం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడమే తప్పా అని ప్రశ్నించారు. షాపుల్లో లేని యూరియా కొత్తగా తీసుకువచ్చిన యాప్‌లలో ఎక్కడ ఉంటుందని ఎద్దేశా చేశారు. రైతులను ముప్పుతిప్పలు పెట్టేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు ఆంక్షలు సడలించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, లింగారెడ్డి, ప్రశాంత్, వామన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ విధులకు అటంకం కలిగించిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసు న మోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. సోయా పంట కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల ముట్టడికి వెళ్తున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నను ముందస్తు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంలో తరలిస్తుండగా ఆ పార్టీ నాయకులు అలాల్ అజయ్, బట్టువార్ సతీశ్, వాగ్మారే ప్రశాంత్, కళ్యాణ్ అడ్డువచ్చి పోలీసు విధులకు అటంకపర్చినట్లుగా పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లుగా వివరించారు.
ముట్టడి ఉద్రిక్తం
ముట్టడి ఉద్రిక్తం


