
యూరియా, డీఏపీ కోసం రైతుల పడిగాపులు
బజార్‌హత్నూర్/తాంసి: బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి 60 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో ఉదయం 5 గంటల నుంచి రైతులు బారులు తీరారు. మండలానికి 2వేల మెట్రక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, మంగళవారం మరో 60 మెట్రిక్ టన్నులు వస్తుందని ఏవో ఎండీ సౌద్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సొసైటీలో సోమవారం డీఏపీ పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయమే సొసైటీ కేంద్రానికి చేరుకున్నారు. సుమారు 200 మందికి పైగా రైతులు డీఏపీ కోసం క్యూలో వేచి ఉన్నారు. సొసైటీ కేంద్రంలో మాత్రం కేవలం 200 బ్యాగులు మాత్రమే ఉండడంతో ముందు వరుసలో ఉన్నవారికే బస్తాలు దొరికాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి సరిపడా ఎరువులు అందించాలని తాంసి, బజార్ హత్నూర్ మండలాల రైతులు కోరుతున్నారు.