
ఆ వ్యాపారులకు సహకరిస్తే కేసులు
● కలెక్టర్ రాజర్షి షా ● జొన్నల విక్రయాలపై అధికారులతో సమీక్ష
కైలాస్‌నగర్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మ ద్దతు ధరతో జొన్నలు విక్రయించే వ్యాపారులకు సహకరించే రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జొన్న ల కొనుగోళ్లపై సంబంధిత శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 15 కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. క్వింటాల్‌కు రూ.3,371 మద్దతు ధరతో రైతుల నుంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు జొన్నలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. విజిలెన్స్ బృందాల ద్వారా నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా తీసుకువస్తే జొన్న బస్తాలతో పాటు వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే భీంపూర్ మండలంలో రెండు బొలేరో వాహనాలు, ట్రాక్టర్, అలాగే ఇచ్చోడలోని మాదాపూర్‌లో 500 బస్తాల జొన్నలు, ఇంద్రవెల్లిలో 87 బస్తాలు, బజార్‌హత్నూర్‌లో 54 బస్తాలను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7780 మంది రైతుల నుంచి రూ.83.21 కోట్ల విలువైన 2.46లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు వివరించారు. సమావేశంలో డీఏవో శ్రీధర్ స్వామి, డీసీవో మోహన్, మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.