
ఆలయం వెనుక ఆలయం!
● వేంకటేశ్వర టెంపుల్ వెనుకాల కొత్త మందిరం ● గతంలో వివాదాలతో పనులకు బ్రేక్ ● పదేళ్లుగా ముందుకు సాగని ప్రక్రియ ● అరిష్టమంటున్న భక్తులు
సాక్షి, ఆదిలాబాద్: ప్రస్తుతం ఉన్న ఆలయం శాస్త్రప్రకారం లేదని దాని వెనుకాలే కొత్త ఆలయం నిర్మించాలని పదేళ్ల క్రితం తలపెట్టారు. మండలం, అంతరాలు, అన్ని నియమాలతో కట్టాలని నిర్ణయించారు. రూ.80లక్షలతో పనులకు శ్రీకారం కూడా చుట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే పనులు తుది దశకు వచ్చాయి. ముందుగా అనుకున్నట్లే కొత్త ఆలయం పూర్తవుతుందని భక్తులు భావించారు. ఆ తర్వాత ఏమైందో కానీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పరిస్థితి. పాత ఆలయం యథావిధిగా కొనసాగుతోంది. కొత్త ఆలయంపై మొక్కలు దర్శనమిస్తున్నాయి. పట్టించుకునే వారే లేరు. అయితే అశాసీ్త్రయాన్ని శాసీ్త్రయం చేసే విషయంలో నాడు అడ్డుపుల్ల వేసిన వారికే ఇది మంచిది కాదని కొంతమంది భక్తులు అంటున్నారు. ఆలయం వెనకాల కొత్త ఆలయాన్ని నిర్మించి మధ్యలోనే వదిలిపెట్టడం ఆదిలాబాద్‌కు అరిష్టమని పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఆలయం దేవాదాయశాఖ, ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సంయుక్త నిర్ణయాలు ఆలయ అభ్యున్నతికి తోడ్పడకపోగా, అరిష్టాలను మూటగట్టుకుంటుందని భక్తులు పేర్కొంటున్నారు. తాజాగా రూ.7.30 కోట్లతో నిర్మాణం తలపెట్టడం, ఆ టెండర్ నోటిఫికేషన్‌లో దేవాదాయశాఖ ప్రస్తావన లేకపోవడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో శనివారం ‘గోవిందా.. గోవింద’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలో పలువురు భక్తులు ‘సాక్షి’కి ఫోన్ చేసి ఆలయంలో ప్రణాళికాబద్ధంలేని పనుల విషయాన్ని వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయం వెనుక ఆలయం నిర్మించి వదిలేసిన తీరు సరికాదని పేర్కొన్నారు.
వైఫల్యమా.. నిధుల వృథా ప్రయాసా
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో హుండీ ఆదాయం కూడా అధికమే. తాజాగా ఆలయ ఆవరణలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తుండగా, ఆ వ్యయం రూ.7.30 కోట్లు హుండీ నుంచి వచ్చిన డబ్బులేనని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పదేళ్ల క్రితం ఆలయం వెనుకాల మరో ఆలయం నిర్మించే విషయంలో ఓ దాత ముందుకు వచ్చి దాని వ్యయాన్ని భరించారని పేర్కొంటున్నారు. అయితే ఆ దాత ట్రస్ట్‌కు సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టడం, దీంతో ప్రధాన ట్రస్టీ ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారనేది ప్రచారంలో ఉంది. పాత ఆలయం ప్రాశస్త్యం మరుగున పడుతుందనే కోణంలో ట్రస్టీ అలా వ్యవహరించారని చెప్పుకుంటారు. ఈ విషయంలో అప్పట్లో ట్రస్టీ, సభ్యుల మధ్య కూడా విభేదాలు వచ్చి వర్గాలుగా విడిపోయారని, దేవాదాయశాఖ కూడా ఈ విషయంలో సమన్వయం సాధించలేక మిన్నకుండిపోయిందనే ప్రచారం ఉంది. అంతే కాకుండా ఆలయం విషయంలో రాజకీయాలు కూడా తోడవడంతో అప్పట్లో పనులు తుది దశకు వచ్చినా చివరకు నిలిచిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. మొత్తంగా విభేదాల కారణంగా ఏళ్లుగా నిర్మాణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆలయానికి పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నా పర్యవేక్షణలోపం, ప్రణాళిక అమలుపర్చడంలో వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిధులు వృథా ప్రయాస అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి.
ఆ విషయం నాకు తెలియదు
కొత్త ఆలయం ఎందుకు అసంపూర్తిగా ఆగిపోయిందో తెలియదు. ఈ విషయంలో నాకు స్పష్టత లేదు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌లో దేవాదాయశాఖ అని ప్రస్తావించకపోవడం ఐఅండ్‌పీఆర్‌లో లోపం. మేము ఇక్కడి నుంచి ఇచ్చిన దాంట్లో దేవాదాయశాఖ అని వారికి పంపించాం.
– రమేశ్, ఈవో, దేవాదాయశాఖ, ఆదిలాబాద్