
భారత్ మాతాకీ జై..
● ఉగ్రవాదంపై త్రివిధ దళాలది అద్వితీయ పోరాటం : ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై త్రివిధ దళాలది అద్వితీయ పోరాటమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంటే పాక్ ఉగ్రవాదంతో రెచ్చగొడుతుందన్నారు. వారిని దీటుగా ఎదుర్కొనేందుకు చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందన్నారు. మనపై ఎన్ని రకాలుగా దాడులు చేయాలని యత్నిస్తున్నా, సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారన్నారు. వారందరికీ ప్రతి భారతీయుడు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, భారత త్రివిధ దళాలు పాక్ కుయుక్తులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ఆదినాథ్, వేద వ్యాస్, ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు.