
23 ఏళ్లు.. 108 సామూహిక వివాహాలు
● పోలీసులు ‘మీ కోసం’లో భాగంగా ఇచ్చోడలో సామూహిక వివాహాలు
ఇచ్చోడ: నేటికీ సరిగ్గా 23 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో 108 ఆదివాసీ జంటలకు పోలీసులు సా మూహిక వివాహాలు జరిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జంటలను ఏకం చేశారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని యువతపై నక్సలిజం ప్రభావం ఉండేది. కొందరు సానుభూతిపరులుగా, మరికొందరు నక్సలిజంలో పనిచేయడానికి ఆసక్తి చూపేవారు. వారు అటు వైపు మళ్లకుండా ప్రజాజీవితంలో అడుగులు వేయించడానికి అప్పటి ఎస్పీ మహేశ్ భగవత్ చర్యలు చేపట్టారు. ఆదివాసీ పెద్దలు, రాయి సెంటర్ సార్ మేడిలతో చర్చించి ఆదివాసీ యువతకు సంప్రదాయంగా సామూహిక వివాహాలు జరిపించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా చాలా మంది నక్సల్స్ సానుభూతిపరులకు వివాహాలు జరిపించి వారి దృష్టి మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి కొంతమందికి హోంగార్డ్ ఉద్యోగాలిప్పించారు.
నక్సలిజం వైపు నుంచి దృష్టి మళ్లించేందుకే..
జిల్లాలో యువత నక్సలిజానికి ఆకర్షితులవడం, అందులో చేరడంతో వారి కార్యకలాపాలు జిల్లాలో ఉధృతంగా కొనసాగేవి. దీంతో యువతను గుర్తించి అప్పటి ఎస్పీ మహేశ్ భగవత్, కలెక్టర్ రామకృష్ణారావు (ప్రసుత సీఎస్) అప్పటి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమం చేపట్టి 2002 మే 9న 108 ఆదివాసీ జంటల కు వివాహాలు జరిపించారు. తాళి, నూతన వస్త్రాలు అందించారు. 20వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వధూవరులను మూడు ప్రత్యేక బస్సుల్లో తిరుపతికి తీసుకువెళ్లి వేంకటేశ్వరస్వామి దర్శన భా గ్యం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2002లో ప్రారంభమైన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇచ్చోడలో నిర్వహించిన సాముహిక వివాహాలకు ఉమ్మడి అంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జౌళిశాఖ మంత్రి పడాల భూమ న్న, గిరిజన శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రామకృష్ణారావు, ఎస్పీ మహేశ్ భగవత్, ఓఎస్టీ దేవేంద్రసింగ్ చౌహాన్, ఆదివాసీ సంఘాల నాయకులు హాజరయ్యారు.