బోథ్: ప్రభుత్వ అందించే ప్రభుత్వ పథకాలకు తహసీల్ కార్యాలయాల్లో వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి. ఏడేళ్లుగా కొత్త రేషన్‌కార్డులతో పాటు కార్డుల్లో పేరు చేర్చే ప్రక్రియ చేపట్టకపోవడంతో అనేక మంది అర్హులైన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలు అందక నష్టపోతున్నారు. మరోవైపు ఐదారేళ్ల క్రితం పుట్టిన పిల్లలతో పాటు అకారణంగా తొలగిస్తూ వస్తున్న అనేక మంది పేదల పేర్లు కార్డుల్లో చేర్చకపోవడంతో వారికి రాయితీ బియ్యం అందడం లేదు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి ఏళ్లు గడుస్తున్నా కొత్త కార్డులు ఇంకా మంజూరు కాలేదు.
తొలగింపులు సరే.. చేర్పులేవి
రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించే ప్రక్రియ వెంటనే జరుగుతుండగా.. పేరు చేర్చే ప్రక్రియ మాత్రం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అనేకమంది పేర్లు తొలగించుకునేందుకు మందుకు రావడం లేదు. మరోవైపు ఇటీవల కొన్ని కొత్త కార్డులు మంజూరు చేసిన సమయంలో అకారణంగా పలువురి పేర్లను కార్డుల్లోంచి తొలగించారు. దీంతో వారు ఆరోగ్యశ్రీ వంటి పథకానికి అర్హులు కావడం లేదు. ఇలాంటి వారు నిత్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. 2016 నుంచి జిల్లాలో 19,811 మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా చేపడుతున్న ఈ కేవైసీ రేషన్‌కార్డుదారులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో రేషన్ కార్డుల్లో లేని వారు ఈ పథకానికి దూరమవుతున్నారు.