
ఏబీవీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
ఆదిలాబాద్‌టౌన్: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అరెస్టు చేసి వన్‌టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటనలతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో కార్తీక్, అక్షయ్, అఖిలేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.