
సమావేశంలో మాట్లాడుతున్న సుహాసిని రెడ్డి
ఆదిలాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అసలు దోషులను తప్పిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నిరుద్యోగ పోరాట సమితి గౌరవాధ్యక్షురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో మంగళవారం నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేపర్ లీకేజీ ఘటన వల్ల నిరుద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. ఈ ఘటనలో కిందిస్థాయి ఉద్యోగులను దోషులుగా చూయించి, అసలు దోషులను తప్పిస్తున్నారని, వెంటనే వారిని శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏప్రిల్ 1వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్షను చేపడుతున్నట్లు, దీక్షకు నిరుద్యోగులు మద్దతు పలకాలని కోరారు. నిరుద్యోగ పోరాట సమితి కన్వీనర్ మల్లయ్య, కో కన్వీనర్ సంజీవరెడ్డి, సాగర్, దత్తు, సాయి, ఉదయ్ పాల్గొన్నారు.