
నిరసన దీక్షలో మాట్లాడుతున్న వెడ్మ బొజ్జు
● టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు ● రాహుల్‌పై వేటుకు నిరసనగా ఖానాపూర్‌లో కాంగ్రెస్ దీక్ష
ఖానాపూర్: పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయనాయకుడు రాహుల్‌గాంధీపై వేటుకు నిరసనగా నియోజకవర్గంలో మంగళవారం పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో నిరసన దీక్షా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిప్రాయ ప్రకటనకు వీలులేని స్వాతంత్య్రం నిరర్థకమని అన్నారు. పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థలు ఎందుకని ప్రశ్నించారు. అలా లేనప్పుడు దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి అంతకన్నా పెద్ద ప్రమాదం మరొకటి లేదని వివరించారు. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని, దానిని మరిచిపోవద్దన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణాధ్యక్షుడు దయానంద్, నిమ్మల రమేష్, నాయకులు మడిగెల గంగాధర్, తోట సత్యం, యూసుఫ్ ఖాన్, చిన్నం సత్యం, జహీర్ అహ్మద్, గంగనర్సయ్య, లక్ష్మీరాజం, రాసమల్ల అశోక్, దాసరి రమేష్ ఉన్నారు.