బేల: మండలంలోని కోగ్ధూర్ గ్రామంలో ఈ నెల 14న ప్రభుత్వ స్థలంలో గ్రామస్తులంతా సమిష్ఠిగా హనుమన్ విగ్రహాన్ని ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ హనుమన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేయడంతో కలకలం రేపింది. దీంతో మంగళవారం ఉదయం గ్రామస్తులు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విగ్రహాన్ని మాయం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్టా రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే సర్కిల్ సీఐ కోల నరేష్‌కుమార్, ఆర్‌ఐ గీతలు అక్కడికి చేరుకుని సంఘటపై గ్రామస్తులతో మాట్లాడి ఆరా తీశారు. ఈ క్రమంలోనే విశ్వహిందూ పరిషత్ జిల్లా, మండల బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వీరి చొరవతో గ్రామస్తులు సమిష్ఠిగా నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో సాయంత్రం ఆందోళనలు సర్దుమణిగాయి.