
దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు
ఆదిలాబాద్‌టౌన్: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు సరికాదని డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో సంకల్ప దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు వెనుక కుట్ర దాగి ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రాహుల్ గాంధీని ఆరేళ్లపాటు పార్లమెంటుకు రాకుండా చేసిందన్నారు. అవినీతిపై పార్లమెంట్‌లో గళాన్ని ఎత్తకుండా నిలువరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ చీకటిదినంగా అభివర్ణించారు. మోదీని గద్దె దించేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. దీక్షకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీక్ష ప్రారంభానికి ముందు మహాత్మాగాంధీ, అంబేడ్కర్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు సీఎల్పీ నేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, ఆడే గజేందర్, ఆనంద్‌రావు, కలీం, అర్ఫాత్ తదితరులు పాల్గొన్నారు.