నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని కురన్నపేట్ చెరువులో ఈత కొడుతూ గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ మల్లేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 25న స్థానిక ధ్యగావాడకు చెందిన పూసం పవన్ (28) మద్యం తాగి కురన్నపేట్ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. ఈ మేరకు పోలీసులు, పట్టణ ఎస్సై జ్యోతిమణి ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి మృతదేహం లభ్యమైనట్లు సీఐ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.