World Telugu summit
-
తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో రస స్ఫూర్తికి కొదువ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సారస్వత పరిషత్ భవనంలో ఆదివారం శతావధానం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని అవధాని రామశర్మను సన్మానించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు భాషా ప్రియులకు మేలు చేసేలా మహా సభల ముగింపులో మంచి ప్రకటన చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్
-
తెలుగు మహాసభలపై మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సభ్యులుగా ఉంటారు. సాహిత్య అకాడమీతోపాటు ఇతర సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియం వద్ద సాహిత్యం, సంగీత కార్యక్రమాలతోపాటు ఆహార ప్రదర్శన, అమ్మకాల కేంద్రాలు (ఫుడ్ కోర్టులు), పుస్తక ప్రదర్శన, విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శన, పురావస్తు శాఖ ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. స్టేడియం లోపల, బయట అలంకరణ ఉండాలని, తెలంగాణ సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలో ప్రతీరోజు సాయంత్రం సాహితీ, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు రవీంద్రభారతి, అందులోని మినీ హాలు, ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వవిద్యాలయం, భారతీయ విద్యాభవన్, లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియం, ఎల్బీ ఇండోర్ స్టేడియంలో సాహిత్య సభలు నిర్వహించాలని చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తున్నారని, ఈ రెండు కార్యక్రమాలు ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని పేర్కొన్నారు. అందుకు వీలుగా పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా ఒకరోజు తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంçస్కృతి, కళలు, జీవితం, పండుగలు ప్రతిబింబించేలా లఘుచిత్రానికి(డాక్యుమెంటరీ) రూపొందించాలని సూచించారు. సమీక్షకు ముందే సీఎం ఎల్బీ స్టేడియం సందర్శించారు. ప్రధాన వేదికతోపాటు మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అధికారులకు సూచించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, బుర్రా వెంకటేశం, స్పోర్ట్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి నర్సింహరెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణయుగం నుంచి నేటి దాకా!
రాయల స్వర్ణయుగాన్ని దాటి చక్రవర్తుల కోటల మీదుగా, జమీందార్ల సంస్థానాలను స్పృశిస్తూ పురోగమించినది తెలుగు భాష. వందల ఏళ్ల బానిసత్వాన్ని ఎదిరించి కవుల కలాల్నే ఖడ్గంగా మార్చుకుని పోరాడింది మన భాష. ఈ నెలలో తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు సభలకు విచ్చేస్తున్న దేశ విదేశ తెలుగు ప్రముఖులందరికీ సాదర స్వాగతం. తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. పాశ్చాత్య భాషా పండితులు కూడా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ఎందుకు ప్రశంసించారంటే, ఏ భాషలో లేని అందం చందం, కమనీయత, రమణీయత మన తెలుగు భాషకే సొంతం. అన్ని భాషలను అవలీలగా కలుపుకు పోగల గొప్ప సాంప్రదాయిక సౌగంధం, విశ్వజనీనమైన విశాలభావం మన భాషకు సహజంగా అబ్బిన లక్షణం. ఏ భాషా పదమైనా మన తెలుగు భాషలో హాయిగా ఒదిగించుకోగలిగిన సంస్కారం దీని సొంతం. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజూ మాట్లాడే తెలుగు భాష ద్వారా.. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, పారశీక, సంస్కృత, ప్రాకృత పదాలను అలవోకగా ఉచ్చరిస్తుంటాం. తెలుగు, హిందీ, సంస్కృత భాషలు మొత్తం 56 అక్షరాలను ఉపయోగించడం వల్లనే భాషకు అంత పరిపుష్టి కలిగిందని పండితుల వాదం. దానికి కారణం సమగ్రత్వమే. 2,500 సంవత్సరాల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర ప్రసక్తి ఉండటం వల్ల దీని ఆధారంగానే తెలుగుభాష మొన్ననే ప్రాచీనహోదాను దక్కించుకున్నది. మొదట్లో గాలిపాటగా, మాటగా పుట్టిన తెలుగు భాష ఎప్పటికప్పుడు గాలిలో కలిసిపోతుండేది. అయితే హాలుడు ప్రాకృత భాషలో రాసిన గాథాసప్తశతిలో తెలుగు పదాలు వాడినందువల్ల అప్పటికి కొంత జానపదుల వ్యవహారంలో ఉన్నట్లు అర్థమౌతుంది. ‘గాధాసప్తశతి’ రాసిన హాల చక్రవర్తి, ‘బృహత్కథామంజరి’ రచిం చిన గుణాఢ్యుడు ఆంధ్రులని చెబుతున్నా, వీరి రచనలు ప్రాకృతంలోనే ఉండేవి. అప్పటికి తెలుగు భాష కవిత్వ భాషగా ఎదగకపోవడమే దీనికి కారణం. ఆ తర్వాత వెయ్యేళ్లపాటు జానపదుల గీతాల్లో, శాసనాల్లో, ఆస్థానాల్లో, అంతఃపురాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ, రాజరాజనరేంద్రుడి కాలం నాటికి కావ్యభాషగా అవతరించింది. ఆనాడు వాడుకలో ఉన్న సంస్కృతం, ప్రాకృతం, పాళీ మొదలైన భాషల పదాలను తనలో విలీనం చేసుకుని, విస్తృతి చెందింది. బౌద్ధ, జైన మతాల ప్రచారం కూడా ఈ భాషాభివృద్ధికి దోహదం చేసింది. ఇలా ద్రావిడ భాషా కుటుంబం నుంచి పుట్టిన తెలుగు సంస్కృత భాషా సంగమంలో పరిపుష్టి చెంది, ఆర్య ద్రావిడ భాషల సమ్మిళితమైన తియ్యని తేనెలూరు తెలుగు భాషగా అవతరించింది. శాతవాహనుల తర్వాత కొంతకాలానికి తెలుగుదేశాన్ని పాలించిన రేనాటి చోళులు మొట్టమొదటిసారిగా తెలుగుభాషను శాసనాలలో వాడటం మొదలెట్టారు. అప్పటినుంచి దినదినాభివృద్ధి చెందుతూ పల్లవులు, చాళుక్యులు, చోళులు మొదలైన రాజుల ప్రాపకంలో రాజ భాషగా ఎదిగి 11 వ శతాబ్దం నాటికి సర్వాంగసుందరంగా రూపొంది, గ్రంథ రచనకు అనువైన భాషగా మన తెలుగు భాష అవతరించింది. 11వ శతాబ్దంలో తెలుగుదేశాన్ని పరిపాలించిన తెలుగు రాజు రాజరాజనరేంద్రుడు మాతృభాషలో గ్రంథరచనకు ప్రోత్సహించడంతో ప్రపంచ సాహిత్యంలోనే అతి పెద్దగ్రంథంగా పంచమవేదంగా ప్రశంసలందుకున్న మహాభారత రచన నన్నయచేతిలో అక్షరరమ్యతతో మొదలైంది. నాటి ఆదికావ్యం నుంచి నేటి ఆధునిక కావ్యాల వరకు శాఖోపశాఖలుగా విస్తరించిన మన తెలుగు సాహిత్యానికి అక్షర రమ్యతతో అందాలు పొదిగాడు నన్నయ్య. తేటతెలుగుల నాటకీయతతో నాణ్యాలుదిద్దాడు తిక్కన. ప్రబంధకవితా రసాలతో రంగులద్దాడు ఎర్రన. పలుకు పలుకులో జాను తెలుగుల కులుకులు నేర్పాడు సోమన్న. భక్తిరసంతో మోక్షానికి సోపానాలు పరిచాడు పోతన. ఇక తెలుగు సాహిత్యానికి పట్టం కట్టిన వారుగా శ్రీకృష్ణదేవరాయలు, గణపతి దేవుడు చరిత్రలో మిగిలిపోతారు. ఎందరో మహాకవులు ఈ భాషా వృక్షాన్ని ఆశ్రయించి చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాచన సోముడు, గోనబుద్ధారెడ్డి, వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, పింగళి, అల్లసాని మొదలైన కవులు, మొల్ల, రంగాజమ్మ వంటి కవయిత్రుల లేఖిని నుంచి రమణీయ ప్రబంధ సాహిత్యరూపంలో అవతరించింది మన తెలుగు భాష. రాయల స్వర్ణయుగాన్ని దాటి చక్రవర్తుల కోటల మీదుగా, జమీందార్ల సంస్థానాలను స్పృశిస్తూ, పురోగమించినది తెలుగు భాష. వందల ఏళ్ల బానిసత్వాన్ని ఎదిరించి కవుల కలాల్నే ఖడ్గంగా మార్చుకుని పోరాడింది మన భాష. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేస్తున్నది. ఎందరో విదేశీయులు తెలుగు భాషలోని తియ్యందనానికి ముగ్ధులై ఈ భాషను నేర్చుకోవడమే కాకుండా దీని గొప్పతనాన్ని కీర్తిస్తూ అనేక వ్యాసాలు రాశారు. పరిశోధనలు చేశారు. నిఘంటువులు వెలువరించారు. వారిలో ముఖ్యులు సీపీ బ్రౌన్, డా. కార్వే, డా. కాంప్‌బెల్, డా. కాల్డ్వెల్ మొదలైనవారు. ఆధునిక కవులు గురజాడ, కందుకూరి, జాషువా, రాయప్రోలు, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె లాంటి అభ్యుదయవాదులు, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి తెలుగుతల్లి ముద్దుబిడ్డలు ఈ జాతికి, భాషకు పోరాటాలు నేర్పారు. ఆత్మగౌరవాన్ని అందించారు. వారి బాటలో రెండు తెలుగు రాష్ట్రాలు భాషా వికాసానికి కృషి చేయాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని కాపాడుకోగలుగుతాం. (డిసెంబర్ 15–19 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా) - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్సీపీ నాయకురాలు -
సృజన, పరిశోధన సమాంతరంగా జరగాలి
హైదరాబాద్: తెలంగాణ సాహిత్యంలో సృజనాత్మకత, పరిశోధన రెండూ సమాంతరంగా జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కవులు, రచయితలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. తెలంగాణలో సాహిత్యం ప్రజల సాహిత్యంగా వచ్చిందని ఆ వైభవాన్ని ప్రపంచానికి సాక్ష్యాధారాలతో నిరూపించబోతున్నామని సిధారెడ్డి అన్నారు. ప్రతి ఏటా తెలంగాణ తెలుగు ప్రపంచ మహా సభలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో నిరంతరం కవిత్వం పరవళ్ళు తొక్కుతుందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. కథా సాహిత్యం, నవల, నాటకం తదితర ప్రక్రియలు ప్రభావవంతంగా వస్తున్నాయన్నారు. ఒకే వేదికపై మొత్తం 11 కవితా సంపుటాలు ఆవిష్క రణకు నోచుకోవడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ...తెరసం ప్రజల సాహిత్య సంఘ మని, తెలంగాణ ఆత్మను పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సంపాదకులు కె.శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్, ఉపాధ్యక్షుడు ఘనపురం, తెరసం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు పాల్గొన్నారు. -
పెద్దన్న తెలియాలి.. సోమన్న మరుగునపడొద్దు
కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని తాను అనుకోవడం లేదనీ; అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదనీ దేశపతి శ్రీనివాస్ అంటున్నారు. డిసెంబర్ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మహాసభల కోర్ కమిటీ సభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్న దేశపతితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ: ఎడ్మినిస్ట్రేషన్ మీలోని సృజనకారుడిని ఇబ్బంది పెట్టడం లేదా? ఇబ్బంది పెడుతోంది. హద్దులు ఏర్పడతాయి; మనదైన స్పేస్ తగ్గిపోతుంది. సృజనకు అవసరమైన ఉత్ప్రేరణ తగ్గిపోతుంది. అయినా ఏదో ఒక మేరకు సాహిత్యకారులతో సంభాషణలో ఉండటం వల్ల నా సృజనను సజీవంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఏ క్రియేటివ్ ప్రాసెస్ నడుస్తోంది మీలో ఇప్పుడు? తెలంగాణ సాహిత్య మూర్తులు జగజ్జేయమానంగా వెలుగొందాలంటే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాక, తెలంగాణ సాహిత్య వైభవం సాక్షాత్కరించేలా పాటలు రాయడం మొదలుపెట్టాను. ఉదాహరణకు(పాడి వినిపించారు), ‘మన తెలంగాణము తెలుగు మాగాణము/ పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము/ చరితకు తొలి తెలుగందము జినవల్లభు కందము/ పంపకవిలో ప్రతిఫలించె తెలుగన్నడ బంధము/ నన్నయ కన్నా మున్నే ఉన్నదిచట ఛందము/ మల్లియరేచన చల్లిన మరుమల్లెల గంధము’. మనకు రాజకీయ నాయకుల హోర్డింగులు పెట్టడమే తెలుసు. కానీ సాహిత్యమూర్తులను హైదరాబాద్ అంతటా హోర్డింగుల్లో నిలిపితే వారి ప్రశస్తీ, భాష కోసం వారు చేసిన కృషీ ఫోకస్ అవుతాయి. వారి కోసం రాస్తున్న పంక్తులే ఒక సృజనకారుడిగా నా లోపల ఇప్పుడు సుడులు తిరుగుతున్నాయి. ఎవరెవరి పేర్లతో తోరణాలు నిలపాలన్న ఎంపిక పూర్తయ్యిందా? హాలుడి నుంచి ఆధునిక వైతాళికుల వరకు ఇప్పటికి 63 మంది తోరణాలు డిజైన్ చేయడం పూర్తయ్యింది. ఇంకా ఈ సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉంది. పంక్తులు, పాటలు రాయడానికి వాళ్లను ఎంతమేరకు మీలోపలికి తీసుకున్నారు? ఒక కవిని ఆయన భాషలోనే, ఆయన హృదయంతోనే, ఆయన దృక్పథంతోనే, ఆయన భావుకతతోనే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. ఉదాహరణకు రామదాసును తలుచుకోగానే భద్రాద్రి ఆలయం, కీర్తనలు స్ఫురణకొస్తాయి. కానీ ఆయన తెలుగులో భజనగీత సృజనకు ఆద్యుడు. త్యాగరాజుకు కూడా ప్రేరణగా నిలిచినవాడు. అందుకే, ‘తేనెలొలుకు తెలుగులోన/ భజనగీత సృజనమునకు/ ఆద్యుడైన రామదాసు/ భక్త శ్రేష్ఠుడు... రాగరాజు త్యాగరాజు/ వినయమొప్ప వినుతించిన/ విబుధవరుడు రామదాసు/ వందనీయుడు’ అన్నాను. కోర్ కమిటీ సభ్యుడిగా ఈ మహాసభలు ఏం సాధించగలవని మీరు భావిస్తున్నారు? ఒకటి: ఇన్నాళ్లూ తెలంగాణ భాష మీద దాడి జరిగింది. ఉపేక్ష భావం, చిన్నచూపు ఉండినాయి. ఏ భాషైనా గానీ అక్కడి భౌతిక చారిత్రక రాజకీయ ఆర్థిక పరిస్థితుల వల్ల రూపొందుతుంది. భాష అనేది జ్ఞాపకాల నిధి. అది ఇద్దరు వ్యక్తులు కేవలం భావాలు పంచుకొనే సాధనం మాత్రమే కాదు. భాషలో అక్కడి మట్టి వాసన, వారి స్మృతులు, సాంస్కృతిక వాతావరణం అన్నీ ఉంటాయి. తెలంగాణ ప్రజల్లో తమ భాష పట్ల ఒక ఔన్నత్య భావన ఈ మహాసభలు ఏర్పరచగలవు. రెండు: తెలుగు భాషలో ఏమాత్రం అభినివేశం లేని పిల్లల తరం రావడం ఇప్పటి విషాదం. వీరికి మాతృభాష పట్ల ఒక విశాల దృష్టి ఏర్పడుతుంది. తెలుగుకు చరిత్ర, విస్తృతి, వైశిష్ట్యం ఉన్నాయి; కవులకూ భాషావేత్తలకూ సమాజంలో గౌరవం ఉంది, అని వారికి తెలుస్తుంది. మూడు: ఆధునిక అవసరాలకు తెలుగును ఎలా విస్తరించాలో చేయాల్సిన ఆలోచనకు ఈ సభలు ఒక ప్రేరణ ఇవ్వొచ్చు. ఐదు నుంచి పదేళ్ల తర్వాత తెలుగు భవిష్యత్ చిత్రం ఎలా వుండబోతోందని మీ ఊహ? ఛానళ్ల తరం, ఐటీ తరం, అమెరికా తల్లిదండ్రుల తరం, నలబై అంటే ఇంగ్లీషులో ఎంత అనే తరం వచ్చాయి. వీరికి తెలుగులోని మౌలికాంశాలు తెలియదు. అయినప్పటికీ ఒక భాషగా తెలుగు అంతరించిపోతుంది, ఉండకుండా పోతుంది అనైతే నేను అనుకోవడం లేదు. గ్రామాల్లో ఏ నాట్లు వేసే స్త్రీ, ఏ కలుపుతీసే స్త్రీ ముందర నిలబడి దోసిలి పట్టినా భాషా భిక్ష పెడుతుంది. అయితే, కోర్టులో సాక్షి తెలుగులో చెబితే దాన్ని ఇంగ్లీషులో అనువాదం చేసి నమోదు చేస్తారు. అలా వుండకూడదు. పరిపాలనకూ, వ్యవహారానికీ మొత్తంగా తెలుగును ఉపయోగించే రోజులు రావాలి. అదేదో సెంటిమెంటుగా కాదు, ప్రజల అవసరం కోసం తెలుగును ఉపయోగించాలి. దానికోసం నా స్థాయిలో నేను కృషి చేస్తాను. కేసీఆర్‌ను దగ్గరినుంచి చూసినవాడిగా– తెలుగుకు తనను తాను ఒక ఛాంపియన్‌గా నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఏమైనా ఆయనలో కనబడిందా? లేదు. ఆయన పద్యాన్ని ప్రేమించినవారు. రాజకీయ ఉపన్యాసాలకు కూడా సాహిత్య పరిమళం అద్దినవారు. ఎన్నో సభల్లో– ‘ఆరంభించరు నీచమానవులు’ అంటూ భర్తృహరి సుభాషితం చెప్పారు. మొన్న (ఉప రాష్ట్రపతి) వెంకయ్యనాయుడు అభినందన సభలో కూడా ‘చదువది ఎంత కలిగిన’ పద్యం చెప్పారు. తెలంగాణలో ప్రకాశితమైన ఉద్యమ సాహిత్యం, జానపద సాహిత్యం గుర్తింపునొందాయి. కానీ శిష్ట సాహిత్యం, ఇతర సాహిత్య ప్రక్రియల మీద ఇంకా చర్చ జరగవలసేవుంది. తెలంగాణ భాషను తెలుగు భాషాభిమానులందరూ ప్రేమించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయనంటే సద్భావన, ప్రశంసే ఉన్నాయి. కాబట్టి కొత్త కీర్తి కోసం అయితే ఈ మహాసభల్ని ఆయన తలపెట్టలేదు. తెలంగాణలో జరుగుతున్న మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ వైతాళికుల తోరణాలు నిలబెట్టడాన్ని ఎలా చూస్తున్నారు? ఇంతకాలం ఏం జరిగిందంటే– తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యం విస్మరణకు గురైంది. తెలుగు సాహిత్య సంపూర్ణ దర్శనం జరగాలంటే ఈ నేల మీద జరిగిన కృషి కూడా అందులో చేరాలి. కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని నేను అనుకోవడం లేదు. అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదు. పద్యానికి జాషువా అద్దిన మానవతా పరిమళాన్ని ఎలా విస్మరించగలం! ఆ తప్పు ఇప్పుడు మనం చేయకూడదు. అందుకే, తెలుగు సాహిత్యంలో మైలురాళ్లు అనదగిన ఆంధ్ర వైతాళికులకూ తోరణాలు కడుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో తెలుగు అంటేనే ఒక కానిమాటగా చూసిన ధోరణి ఉండింది. ఇప్పుడు అదే తెలుగు సభల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని ఎలా చూడాలి? ఉద్యమకాలంలో కొన్ని అతివ్యాప్తులుంటాయి. తెలుగంటే వాళ్లది, తెలంగాణ భాష అంటే మనది అనే ఒక వాదన ఉండింది. తెలుగు తల్లి అనే భావన గతంలో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంతో ముడిపడినదిగా చూపబడింది. నిజానికి అది భాషా స్వరూపం. అందుకే రాష్ట్రం విడిపోయాక భౌతిక వాస్తవం పలుచనబడి, తెలుగు తల్లి అనే భావన తటస్థత పొందింది. ఆ ప్రతీకతో ఇప్పుడు తెలంగాణకు నిమిత్తం లేదు. తెలంగాణలో అందమైన తెలుగు మాట్లాడుతారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఇది పుట్టినిల్లు. బీజప్రాయం నుంచి శాఖోపశాఖలుగా తెలుగు విస్తరించిన నేల ఇది. తెలంగాణ నుడికారం, సామెతలు, శబ్దజాలం వీటన్నింటికీ పట్టంకట్టాల్సిన సమయం వచ్చింది. -
తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, రైళ్లు, బస్సు ల్లో మహాసభ లోగో స్టిక్కర్లను అతికించడంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లా కేంద్రాల్లో తెలుగు కవితలు, పద్యాలను హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించ నున్నారు. మహాసభల ఏర్పాట్లపై శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ముఖ్యులను ఇతర ప్రముఖులను ఆహ్వానించడం, ముఖాముఖి చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచురణలు, సాహిత్య ప్రక్రియలు, ఆతిథ్య ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మహా సభలకు వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా తగిన ప్రచారం కల్పించేందుకు సంపాదకులు, మీడియా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని కూడా ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. దీనితోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రాచీన శాసనాలు, చారిత్రక, వారసత్వ కట్టడాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణా చారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ఎస్.వి.సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథా లయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృ తిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో పాటు కోర్ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు నిజామా బాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. -
రాళ్లబండి కవితాప్రసాద్‌కు 25వేలు జరిమానా
హైదరాబాద్ : రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్‌కు సమాచార హక్కు కమిషన్ రూ.25వేలు జరిమానా విధించింది. తెలుగు మహాసభల ఖర్చుకు సంబంధించి ఇంతవరకూ ఆయన వివరాలు సమర్పించలేదని సమాచారం. అంతే కాకుండా ఆడిట్ విషయంలో అడిగిన సమాచారం సకాలంలో అందించకపోవటంతో పాటు, తప్పుడు సమాచారాం ఇచ్చారంటూ సమాచార హక్కు కమిషనర్ విజయబాబు జరిమానా విధించారు. కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని సమాచార హక్కు కమిషన్.... ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా, ఎటువంటి విచారణకైనా తాను సిద్దమేనని రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ తెలుగు మహాసభలు, రవీంద్ర భారతి హాలు కేటాయింపునకు సంబంధించి అడిగిన వివరాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు.