breaking news
Web designing
-
మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్.. మహిళలకు కోచింగ్, జాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఎస్ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. టెక్‌సాక్షం పేరుతో 62,000 మందికి ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది. నిపుణులైన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్షిప్స్, చిన్న వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం శిక్షణ ఇస్తారు. -
డ్రీమ్ వీవర్ కీప్ మూవింగ్.. డోంట్ క్విట్
శ్రీలక్ష్మి సురేశ్... ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వెబ్ డిజైనర్, సిఈవోగా నిలిచిన అమ్మాయి. కేరళ కోజికోడ్‌లో తను చదువుతున్న స్కూల్ కోసం ప్రెజెంటేషన్.కామ్ అనే వెబ్ సైట్‌ను తయారుచేసి రికార్డు సాధించారు. అప్పుడు శ్రీలక్ష్మి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. ఇందుకుగాను శ్రీలక్ష్మి 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అత్యద్భుతంగా వెబ్ డిజైన్ చేసిందని మేధావుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ వెబ్మాస్టర్స్ సంస్థ శ్రీలక్ష్మికి తమ సంస్థలో సభ్యత్వంతోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డ్ వెబ్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆ అసోషియేషన్‌లో 18 సంవత్సరాల లోపు ఉండి, సభ్యత్వం పొందిన ఏకైక అమ్మాయి తనే. ఎన్నో సత్కారాలు, అవార్డులు అందుకున్న శ్రీలక్ష్మి ఇప్పుడు సొంతంగా వెబ్ ఇడిజైనింగ్ కంపెనీ ప్రారంభించారు. (www. edesign.co.in) ఈ కంపెనీకి సిఈవో. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో సిఈవోగా రికార్డు సాధించారు శ్రీలక్ష్మి. ఇప్పుడు శ్రీలక్ష్మి సైబ్రోసిస్ టెక్నో సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో కలిసి ఆన్లైన్ పిక్సెల్ ట్రేడర్స్ సంస్థను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. శ్రీలక్ష్మి తండ్రి సురేశ్ మీనన్. ఆయన అడ్వొకేట్. తల్లి విజు సురేశ్. వెబ్ డిజైనింగ్ మీద తనకు ఆసక్తి కలగడానికి కారణం.. తన తండ్రి తనను చిన్నతనం నుంచి కంప్యూటర్ మీద పనిచేసుకోనివ్వటమే అంటారు. ‘కంప్యూటర్ నోట్పాడ్ మీద ఇంగ్లీషు అక్షరాలు టైప్ చేస్తూ నేర్చుకున్నాను’ అంటారు శ్రీలక్ష్మి. ఇంకా స్కూల్లో కూడా చేరకముందే మైక్రోసాఫ్ట్ పెయింట్‌లో బొమ్మలు వేయడం ప్రారంభించారు శ్రీలక్ష్మి. ‘కంప్యూటర్ నా ప్రాణ స్నేహితురాలు. నా ఆరు సంవత్సరాల వయసులో ఒక చిన్న కుర్రవాడు తయారు చేసిన వెబ్‌సైట్‌ని నాన్న నాకు చూపిస్తూ, నాకు ఇష్టమైతే నన్ను కూడా చేయమని చెప్పారు. అప్పుడు నేను ఎంఎస్ వర్డ్ ఉపయోగిస్తూ ప్రయత్నించాను, ఆ తరవాత ఎంఎస్ ఫ్రంట్ పేజీలో ప్రయత్నించాను. అలా నా మొదటి వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాను. అది కూడా మా స్కూల్ కోసం www.presentationshss.com పేరున తయారు చేశాను. అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు. ఇప్పుడు నేను వెబ్‌సైట్స్‌ని డ్రీమ్వీవర్ ఉపయోగిస్తూ డెవలప్ చేస్తున్నాను’ అని ఎంతో ఆనందంగా చెబుతారు శ్రీలక్ష్మి. టైనీలోగో (tinylogo) అనే సెర్స్ ఇంజిన్ కూడా తయారు చేశారు శ్రీలక్ష్మి. తనకు లోగోలను సేకరించటమంటే ఇష్టమని, అందుకోసమే ఈ సైట్ ప్రారంభించానని చెబుతారు. అయితే ఇతరుల అనుమతి లేకుండా వారి లోగోలను తీసుకోవటం నేరమని నాన్న చెప్పారు. అందువల్ల వారి దగ్గర నుంచి చట్టబద్ధంగా లోగోలను సేకరిస్తున్నట్లు చెబుతారు శ్రీలక్ష్మి. ఆ సమయంలోనే శ్రీలక్ష్మి ‘సైనల్ రైన్బో’ టెక్నాలజీతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అబిదీన్ (సైబ్రోసిస్ టెక్నో సొల్యూషన్స్) ని కలిసి, లోగోల ఆధారంగా వాటికి సంబంధించిన అంశాలను సెర్చ్ చేయటం గురించి చర్చించారు. ఆ విధంగా లోగో ఆధారంగా సమాచారాన్ని సేకరించేలా వారితో కలిసి సెర్చ్ ఇంజిన్ తయారుచేశారు. ‘‘నా మొదటి వెబ్సైట్ తయారు చేసుకున్నప్పుడు నేను ఎవరో ఎవరికీ తెలియదు. అందువల్ల నాకు అస్సలు టెన్షన్ లేదు. ఇప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్‌గా ఉంటోంది. అందరూ మెచ్చుకునేలా చేయాలనే సంకల్పంతో, ఇప్పుడు ఎక్కువ సమయం వెబ్ డిజైనింగ్ గురించి బాగా చదువుతున్నాను. ఇంకా పిహెచ్‌పి, ఏఎస్పి... లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులంతా మెచ్చుకునేలా కష్టపడుతున్నాను’ అంటూ సంతోషంగా అంటారు శ్రీలక్ష్మిసురేశ్. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటం వల్ల శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది నిపుణులతో చర్చించటానికి అవకాశాలు వస్తున్నాయి. ‘‘విదేశీ మార్కెట్ మీద ఆధారపడిన వారి పరిస్థితులు బాలేవు. నేను విదేశీ కంపెనీలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయట్లేదు. చిన్నవి మాత్రమే చేస్తున్నాను. వెబ్సైట్ల అవసరం రోజురోజుకీ బాగా పెరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా వెబ్సైట్లు పెట్టుకుంటున్నారు. నేను ఎక్కువ ఆర్డర్లు తీసుకుని, చక్కగా చేసి ఇస్తున్నాను. అందువల్ల నా కంపెనీ భవిష్యత్తు గురించి నేను బాధపడనక్కర్లేదు’’ అంటారు ఎంతో ధీమాగా శ్రీలక్ష్మి. ప్రస్తుతం www.stateofkerala.in వెబ్సైట్లో కేరళ గురించి సమాచారాన్ని పొందుపరచి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా రూపొందిస్తున్నాను’’ అంటున్న శ్రీలక్ష్మి చదువుతో పాటు ఈ పనులన్నీ ఎంతో ప్రణాళికతో చేస్తున్నారు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుందని, అదేవిధంగా అందరికీ చాలా సౌకర్యంగా ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలని ఉంది. పిల్లలు కూడా పెద్దవాళ్లు చేసినవన్నీ చేయగలరు అంటూ ఎంతో ఉత్సాహంగా చెబుతారు. ‘కీప్ మూవింగ్, డోంట్ క్విట్’ అనేది శ్రీలక్ష్మి నినాదం. -
వీరాభిమాని నం.1
గాలే: ‘మరి కొద్ది రోజుల్లో కరోనా ముగిసిపోతుంది... వచ్చే నెల రోజుల్లో అంతా సర్దుకుంటుంది... ఇంగ్లండ్ జట్టు వచ్చి సిరీస్ ఆడుతుంది...’ ఇలా ఆశపడుతూనే అతను ఏకంగా పది నెలలు శ్రీలంకలోనే గడిపేశాడు. ఎట్టకేలకు ఆ వీరాభిమాని కోరిక తీరింది. ఆ అభిమాని పేరు రాబ్ లూయిస్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టంటే పడి చస్తాడు. ఇదే ఉత్సాహంతో అతను గత ఏడాది మార్చిలో శ్రీలంకలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకొని సిద్ధమైపోయాడు. ఆటగాళ్లు వెళ్లక ముందే అక్కడికి చేరుకొని ఎపుడెపుడా అని ఆట కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో కరోనా వచ్చేసింది... ప్రపంచమంతా మారిపోయింది. ఇంగ్లండ్ పర్యటన కూడా వాయిదా పడింది. ఇటు శ్రీలంక నుంచి బయటకు వెళ్లేందుకు ఆంక్షలు, అటు ఇంగ్లండ్‌లో పరిస్థితి తీవ్రం. దాంతో 37 ఏళ్ల లూయిస్ లంకలోనే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని అతను ఊహించలేదు. త్వరలోనే సిరీస్ జరుగుతుందనే లూయిస్ కూడా ఆశిస్తూ వచ్చాడు. వృత్తిరీత్యా వెబ్ డిజైనర్ అయిన అతను ఆన్లైన్లోనే కొంత మొత్తం సంపాదించడం, లంక కరెన్సీ విలువ చాలా తక్కువ కావడంతో అదృష్టవశాత్తూ అతనికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురు కాలేదు. చివరకు గురువారం ఇంగ్లండ్–శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అతని కోరిక నెరవేరింది. అయితే ఇదీ అంత సులువుగా దక్కలేదు. బయో బబుల్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గాలే స్టేడియం చుట్టుపక్కల నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడి నుంచే చూసేందుకు ప్రయత్నించాడు. చివరకు మైదానం పక్కనే ఉన్న ప్రఖ్యాత ‘డచ్ ఫోర్ట్’ ఎక్కి అతను వీక్షించాడు. అన్నింటికి మించి శనివారం డబుల్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ ప్రత్యేకంగా రాబ్ లూయిస్ వైపు తిరిగి తన బ్యాట్ చూపించడంతో అతని ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా దూరమైంది! తన గురించి తెలుసుకొని ఇంగ్లండ్ క్రికెటర్లు ఫోన్లో మాట్లాడారని చెప్పిన లూయిస్ ... సిరీస్ ముగిసిన తర్వాత వారితో కలిసి బీర్ తాగాలని కోరుకుంటున్నాడు! -
రెయిన్బో టెక్నాలజీస్ పేరుతో ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని 100 మందిని నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్ టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతకు వల వేసింది ఓ ముఠా. రెయిన్బో టెక్నాలజీస్ పేరుతో దాదాపు వంద మందిని రిక్రూట్ మెంట్ చేసుకుంది. శిక్షణ ఇప్పించేందుకు డిపాజిట్ చేయాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.9వేల నుంచి 15 వేల వరకూ వసూలు చేసింది. సుమారు వంద మంది నుంచి 10లక్షల రూపాయలు వసూలు చేసింది. మూడు నెలలు గడిచినా నిర్వాహకులు ఏ ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో అనుమానం వచ్చి బాధితులంతా విశాఖ త్రీ టౌన్ పోలీసులను సంప్రదించారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త ప్రారంభించారు. -
భిన్నంగా ఆలోచించే వారికి భవ్యమైన కెరీర్లు
కొందరికి అందరిలాగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రొటీన్‌గా పనిచేయడం అస్సలు నచ్చదు. అందరికీ భిన్నంగా తమకు చేయాలనిపించినప్పుడే విధులు నిర్వహించడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తమకు నచ్చినప్పుడు పనిచే యడానికి వీలు కల్పించే కెరీర్ కావాలని కోరుకుంటారు. అలాంటి రంగంలోనే ఉపాధిని వెతుక్కుంటారు. ఇలా వైవిధ్యమైన కెరీర్ కోరుకునేవారికి నేటి హైటెక్ జాబ్ మార్కెట్ ఆహ్వానం పలుకుతోంది. సిటీలో ఆయా రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. భిన్నంగా ఆలోచించే వారికోసం పలు భవ్యమైన కెరీర్స్. ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ ప్రస్తుత ఈ-కామర్స్, టెక్నాలజీ యుగంలో అంతటా వెబ్‌సైట్స్ హవా నడుస్తోంది. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి కంపెనీ కూడా తమకంటూ ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలని భావిస్తోంది. దాంతో ఆయా కంపెనీల అవసరాలు, ప్రాధాన్యాల మేరకు వెబ్‌సైట్‌ను రూపొందించడానికి వెబ్ డిజైనర్ల అవసరం ఏర్పడింది. వీరి పని కేవలం వెబ్ డిజైనింగ్ వరకే పరిమితం. కాబట్టి వెబ్ డిజైనింగ్ కోసం ఉద్యోగిని నియమించుకోవడం లేదు. ఆ బాధ్యతలు పొరుగు సేవల కన్సల్టెంట్స్‌కు అప్పగిస్తున్నాయి. కాబట్టి పని వేళలతో నిమిత్తం లేకుండా వెబ్ డిజైనింగ్ చేయొచ్చు. కంపెనీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తే సరిపోతుంది. వెబ్ డిజైనింగ్‌కు సంబంధించి పలు ప్రైవేట్ సంస్థలు స్వల్పకాలిక కోర్సులను అందజేస్తున్నాయి. వాటిని నేర్చుకోవడం ద్వారా వెబ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు ఈ రంగంలో ఫ్రీలాన్సర్‌గా స్థిరపడొచ్చు. డిజైన్ చేసిన వెబ్సైట్/సంస్థను బట్టి వేతనం ఉంటుంది. నెలకు రూ.10 వేల -20 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ చాలా మంది డబ్బును స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టాలని భావిస్తుంటారు. ఎక్కడ, ఎలా అనే విషయంలో సరైన అవగాహన ఉండదు. ఇటువంటి వారిని గైడ్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు. ఎక్కడ భూమి ఉంది? దాని ధర ఎంత? రాబోయే కాలంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయి? వంటి విషయాలను వీరు సమగ్రంగా వివరిస్తుంటారు. దీనికి కూడా సమయంతో నిమిత్తం లేదు. కేవలం ఫోన్ ద్వారా ఇన్వెస్టర్, భూ యజమానితో మాట్లాడి అనుకున్న సమయానికి భూమిని చూపిస్తే సరిపోతుంది. ఇతర ఉద్యోగాలు చేస్తూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరించవచ్చు. భూమికి సంబంధించి చేసుకున్న ఒప్పందం మేరకు కమిషన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది భూమిపై పెట్టుబడి దిశగా ఆలోచిస్తున్న తరుణంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ భిన్నమైన కెరీర్‌గా చెప్పొచ్చు. సోషల్ మీడియా కన్సల్టెంట్ ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది. తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడానికి సోషల్ మీడియా చక్కని మాధ్యమంగా మారింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయం, క్రీడలు.. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే క్లిక్‌తో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని లక్షలాది మంది వీక్షిస్తుంటారు. దీని ఆధారంగా సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఆయా సంస్థలు సోషల్ మీడియా వ్యవహారాలను కన్సల్టెంట్లకు అప్పగిస్తున్నాయి. వీరు తమకు వీలైన సమయంలో సంబంధిత వ్యవహారాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ ఫోన్‌తోనే ఎప్పుడైనా ఇటువంటి పనులను పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న తరుణంలో ఇది ఒక మంచి అవకాశం. వీరికి ఇంగ్లిష్ భాష, స్థానిక పరిస్థితులపై పట్టు ఉండాలి. చేస్తున్న పని ఆధారంగా డబ్బు అందుతుంది. నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సంపాదించుకోవచ్చు. పర్సనల్ ట్రైనర్ నేడు ప్రపంచమంతా నైపుణ్యాలాధారంగా పని చేస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టీచింగ్.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కమ్యూనికేషన్, లీడర్షిప్ వంటి లక్షణాలు తప్పనిసరి. ఈ అంశాలు అకడమిక్స్‌లో పెద్దగా కనిపించవు. వీటికున్న ప్రాధాన్యత దృష్ట్యా స్వతహాగా పెంపొందించుకోవాలి. లేదా శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవాలి. ఈ క్రమంలో వివిధ పరీక్షలకు ఇచ్చే కోచింగ్ మాదిరిగానే వ్యక్తిగత నైపుణ్యాల శిక్షణ తరగతులను నిర్వహించవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో లేదా వారాంతాల్లో ఆయా అంశాలపై శిక్షణనివ్వచ్చు. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగార్థులందరూ నైపుణ్య మంత్రం జపిస్తున్నందున ఇలాంటి తరగతులకు మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని సొంతంగా చేపట్టవచ్చు లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో చెప్పొచ్చు. తరగతులు/సమయం ఆధారంగా వేతనం ఉంటుంది. నెలకు రూ.15 వేల -20 వేల వరకు సంపాదించవచ్చు. గ్రాఫిక్ డిజైనర్ ప్రస్తుత మార్కెటింగ్ యుగంలో వినియోగదారులను ఆకర్షించాలన్నా.. బోర్డు సమావేశ నిర్ణయాలను ప్రభావవంతంగా నివేదిక రూపంలో తెలపాలన్నా.. పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకు ఏ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ముద్రించాలన్నా.. గ్రాఫిక్ డిజైనర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రింటింగ్ ప్రెస్‌లు, ఫొటోషాప్‌లు, డిజైనింగ్ స్టూడియోలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు తదితర సంస్థలు ఇందుకు ఉపాధి వేదికలు. వీలైన సమయంలో లేదా ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసుకోవచ్చు. ఇందుకోసం ఫొటోషాప్, కొరల్‌డ్రా వంటి సాంకేతిక అంశాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ విభాగంలో స్వల్పకాలిక కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఎంచుకున్న పనిని బట్టి వేతనం ఉంటుంది. నెలకు రూ.10 వేల -20 వేల వరకు వేతనం పొందొచ్చు. ట్యాక్స్ కన్సల్టెంట్ మనలో చాలా మందికి పన్నులకు సంబంధించిన అంశాలు అంతగా తెలియవు. ఇటువంటి నేపథ్యంలో ఎంత ఆదాయం వస్తే పన్ను చెల్లించాలి? అన్ని రంగాల వారు చెల్లించాలా? పన్నుల భారం పడకుండా ఉండాలంటే.. ఎటువంటి పద్ధతులను అనుసరించాలి? వంటి అంశాలపై అవగాహన కల్పించడం ట్యాక్స్ కన్సల్టెంట్ బాధ్యత. చాలా మంది/సంస్థలు తమకున్న పరిమితుల దృష్ట్యా ట్యాక్స్ సంబంధిత వ్యవహారాలను పొరుగు సేవల రూపంలో కన్సల్టెంట్లకు అప్పగిస్తుంటాయి. వీరు క్లైంట్ల సమయానుకూలతలను బట్టి వారిని కలిసి సంబంధిత వివరాలు సేకరిస్తారు. తర్వాత ఏం చేయాలి? ఏవిధంగా చేయాలి? అనే అంశంపై గెడైన్స్ ఇస్తారు. కామర్స్, మేనేజ్మెంట్ అభ్యర్థులు మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. పనిని బట్టి నెలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు ఆదాయం అందుకోవచ్చు. డెంటల్ హైజీనిస్ట్ డెంటిస్ట్ విధులకు సహాయకారిగా ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే. డెంటిస్ట్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో క్లినిక్‌లు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో వీరికి డెంటల్ హైజీనిస్ట్లు అవసరమవుతారు. దంతవైద్యంపై అందరికీ అవగాహన ఏర్పడడం, ప్రతి చోటా డెంటల్ క్లినిక్‌లు కనిపిస్తుండటంతో వీరి ప్రాధాన్యత పెరిగింది. వచ్చిన పేషంట్లను సమన్వయం చేయడం, చికిత్స సంబంధిత వ్యవహారాల్లో డాక్టర్‌కు సహాయం అందించడం, పేషంట్లకు సలహాలు ఇవ్వడం వంటివి వీరి విధులు. పని గంటలను బట్టి వేతనాలను చెల్లిస్తారు. నెలకు రూ. 6 వేల నుంచి 10 వేల వరకు అందుకోవచ్చు. ట్రావెల్ గైడ్ చారిత్రక కట్టడాల ప్రాధాన్యత, విశిష్టతలను వివరంగా తెలుసుకుంటేనే వాటి సందర్శన పరిపూర్ణమవుతుంది. ఇందుకు సహకరించే వారు ట్రావెల్ గైడ్లు. కట్టడానికి సంబంధించిన విశేషాలను వివరించడంతోపాటు ఇంకా సందర్శించాల్సిన ప్రదేశాలు, ఎక్కడ బస చేయొచ్చు? మనకు కావల్సిన ఆహారం ఎక్కడ లభిస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ట్రావెల్ గైడ్‌గా రాణించాలంటే.. భాషలపై పట్టు ఉండాలి. ఎందుకంటే.. వచ్చిన పర్యాటకుల స్థానిక భాషను నేపథ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాల పట్ల ఆసక్తి ఉండాలి. చూపించిన ప్రదేశం, ప్రయాణించిన దూరం వంటి అంశాలాధారంగా ఆదాయం లభిస్తుంది. నెలకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాన్ని పొందొచ్చు. నర్సింగ్ సమయంతో పోటీపడి పరుగులు పెడుతున్న నగర జీవులు..అంతే వేగంగా వ్యాధుల బారిన పడుతున్నారు. వాటి నుంచి ఉపశమనం కల్పించే దిశలో న ర్సుల సేవలు ఎంతో అవసరం. ప్రతి చిన్న సమస్యకు ఆసుపత్రులకు వెళ్లడం ఎంతో వృథా వ్యవహారం. ఇంజక్షన్ చేయడం, ఫస్ట్ ఎయిడ్, డ్రెస్సింగ్, బీపీ చెకప్, సెలైన్ ఎక్కించడం, వంటి పనులను ఇంట్లో చేయడానికి పార్ట్‌టైమ్ నర్సులు అవసరం. అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్లు ఈవెనింగ్ క్లినిక్స్/మార్నింగ్ క్లినిక్స్‌లు నిర్వహిస్తుంటారు. అందులో వారికి తోడ్పడానికి నర్సుల సేవలు తప్పనిసరి. ఇలాంటి సందర్భాల్లో నర్సుల అవసరం కొన్ని రోజులకు లేదా కొన్ని గంటలకే పరిమితం. కాబట్టి అనువైన సమయంలో ఈ సేవలను అందించవచ్చు. వీరికి విధులు నిర్వహించిన సమయాన్ని బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.10 వేల-14 వేల ఆదాయం అందుకోవచ్చు. మేకప్ ఆర్టిస్ట్ సంప్రదాయ పని వేళలతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తున్న మరో విభాగం.. మేకప్ ఆర్టిస్ట్. నేటి తరం పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకు అన్ని రకాల శుభకార్యాలకు అలంకరణ విషయంలో ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా శుభ కార్యాల సమయాన్ని అనుసరించి మేకప్ చేస్తే సరిపోతుంది. మేకప్‌ను బట్టి వేతనాన్ని చెల్లిస్తారు. నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు ఆదాయం పొందొచ్చు. స్పోర్ట్స్/ఫిజికల్ కోచ్ చాలామంది ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్‌పై మక్కువ చూపిస్తున్నారు. స్పోర్ట్స్/ఫిజికల్ కోచ్ ..కార్యకలాపాలన్నీ ఉదయం, సాయంత్రం ఉంటాయి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం అనే విధానానికి భిన్నంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోచ్‌గా కొనసాగవచ్చు. దీనికి అకడమిక్ కోర్సులు అవసరం లేదు. స్వల్ప శిక్షణతో ఇందులో స్థిరపడొచ్చు. స్పోర్ట్స్ క్లబ్‌లు, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, స్కూల్స్, కాలేజీల్లో ఈ తరహా ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు రూ.5 వేల-రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తుంది.