vaira reservoir
-
ఔరా.. వైరా..
తడారిన భూములకు ఊపిరి పోస్తోంది. ఎండిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.. లక్షలాది బతుకులకు అన్నం పెడుతోంది. పర్యాటక కేంద్రంగా కూడా వరి్ధల్లుతున్న ఆ జలాశయం వయసు వందేళ్లు.. ఖమ్మం జిల్లాలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరొందిన వైరా జలాశయంపై కథనమిది. వైరా: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన వైరా జలాశయం.. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కల్పతరువుగా నిలుస్తున్న ఈ జలాశయాన్ని స్వాతంత్య్రానికి ముందు నైజాం నవాబు నిర్మించారు. వృథా నీటిని అరికట్టేలా.. తొలినాళ్లలో ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే నిమ్మవాగు, ఏన్కూరు మండలం నుంచి ప్రవహించే గండివాగు, గిన్నెలవాగు, పెద్దవాగుల నుంచి వచ్చే మరో ఏరు.. వైరా సమీపాన కలిసి అతిపెద్ద ప్రవాహంగా తయారై వృ«థాగా పోయేది. ఈ పరిస్థితుల్లో ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని.. నాటి పాలకుడైన నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆలోచన చేశారు. దీంతో సాయిద్ జాదా నవాబ్ అలావత్జంగ్ బçహదూర్ 1923వ సంవత్సరంలో శంకుస్థాపన చేయగా అప్పటి నిజాం ప్రభుత్వ కార్యదర్శి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బçహదూర్ పర్యవేక్షణలో సుమారు రూ.36 లక్షలతో ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. డంగు సున్నం, రాయితో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా.. 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. అలాగే, 130 చదరపు మైళ్ల భూమిని రైతుల నుంచి సేకరించి.. అప్పట్లోనే సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 88 అడుగులు కాగా, పొడవు 5,800 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు 19 మైళ్ల దూరం ప్రవహిస్తూ.. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. కుడి కాల్వ 15 మైళ్ల దూరం ప్రవహించి 29 ఉపకాల్వల ద్వారా 16 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ఐదు మైళ్ల దూరం ప్రవహిస్తూ 22 ఉప కాల్వల ద్వారా తొమ్మిది వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిoది. 1930లో కేవలం 12 వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేలా డిజైన్ చేసినా ప్రస్తుతం రెండింతలుగా సాగవుతుండడం విశేషం. దాహార్తి తీరుస్తూ.. ఖమ్మం జిల్లాలోని వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, వేంసూరు, కొణిజర్ల, చింతకాని, ఏన్కూరు, పెనుబల్లి తదితర 11 మండలాల్లోని 420 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రిజర్వాయర్ నుంచి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ కృషితో మహర్దశ.. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక కృషి వల్ల ఈ జలాశయం రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు అప్పట్లో రూ.51 కోట్లు మంజూరు చేయగా మహర్దశ పట్టింది. జలాశయం ఆధునికీకరణలో భాగంగా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీత, సిమెంట్‌తో లైనింగ్ చేయించి కాల్వలు పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఫలించింది. పర్యాటకంగానూ అభివృద్ధి రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్లు.. అందమైన పూల తోటలు.. చుట్టూ నీరు.. కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరిపింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ.. అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయంసంధ్య వేళల్లో ఇక్కడి దృశ్యాలను తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఈమేరకు పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్క్ నిర్మించి.. పూలతోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ రూ.70 లక్షలు వెచ్చిoచింది. ఇక్కడ పలు టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా జరగడం విశేషం. మత్స్యకారులకు జీవనోపాధి వైరా రిజర్వాయర్‌పై కొణిజర్ల, వైరా, తల్లాడ మండలాలకు చెందిన సుమారు 500 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి.. ముందు నుంచే మత్స్యకారులు చేపలు, రొయ్య పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు. -
సుజలం.. విఫలం
ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సరఫరా అవుతున్న సుజల స్రవంతి జలాలు సురక్షితమేనా? తాగటానికి యోగ్యమైనవేనా? ఏ మేరకు శుద్ధి చేస్తున్నారు? ఎలా శుద్ధి చేస్తున్నారు? అనే వి ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ‘పేరుకే సుజల స్రవంతి పథకం..కానీ వీటి నుంచి సరఫరా అవుతోంది అపరిశుభ్ర జలం. ఈ నీరు తాగిన పలువురు వ్యాధుల బారిన పడు తున్నారు. అత్తెసరు శుభ్రతతో కూడిన కలుషిత జలాన్ని పంపిణీ చేయడమే దీనికి కారణం’ అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నీటి మూటల్లాంటి హామీలిచ్చే పాలకులే వీటికి సమాధానం చెప్పాలంటున్నారు. వైరా వైరా రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం నుంచి ఆరు మండలాల్లోని 120 గ్రామాలకు రోజుకు కోటి లీటర్ల నీరు సరఫరా అవుతోంది. నీరు ఎలా ఉంటున్నాయి? శుభ్రం చేస్తున్నారా? పథకం నిర్వహణ ఎలా ఉందో పర్యవేక్షించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్ల మామూళ్ల మత్తులో పడి అసలు విషయమే మరిచిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. నీటిని శుద్ధిచేసే ముడిపదార్థాలను నాసిరకమైనవి వాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన పైపులైన్‌కు ఏర్పాటు చే సిన ఎయిర్‌వాల్వ్స్, గేట్‌వాల్వ్స్ లీకేజీలతో నీరు కలుషితం అవుతున్నాయి. పనిచేయని ఆలం కలిపే మోటార్ సుజల స్రవంతి మంచినీటి పథకంలో ఆలం కలిపేం దుకు మూడు మోటార్లు వినియోగించాలి. ఏడాడి నుంచి ఈ మూడుమోటార్లు పనిచేయడం లేదు. ఆలం పూర్తిస్థాయిలో కలవడం లేదు. వైరా రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరితే అవే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ప్లాంట్‌లో కెమికల్స్, ముడిపదార్థాలు కలిపే కేంద్రాలు అపరిశుభ్రంగా ఉన్నా పట్టడం లేదు. 2002లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేయలేదు. రాడ్లు బయటపడి ప్రమాదకరంగా ఉన్నాయి. నాసిరకంగా ఎయిర్‌వాల్వ్స్ వైరా రిజర్వాయర్ నుంచి వైరా, మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో పలు గ్రామాలకు నీటిని సరఫరా చేసే పైపులైన్లకు బిగించిన ఎయిర్‌వాల్వ్స్ దెబ్బతిన్నాయి. గాలి వదలడానికి వాల్వ్‌లో ఉన్న బాల్స్ సరిగా పనిచేయడం లేదు. నీరు లీకై ఎయిర్‌వాల్వ్స్ మురికికూపంగా తయారవుతున్నాయి. తిరిగి అదే నీరు పైపుల ద్వారా సరఫరా అవుతోంది. చాంబర్ల చుట్టూ మురికిపేరుకుపోవడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి. అరకొర నీటి పరీక్షలు రిజర్వాయర్ వద్ద నీటిశుద్ధి కేంద్రంలో అరకొర పరికరాలు ఏర్పాటు చేశారు. లక్ష లీటర్లకు లీటర్ ఫ్లోరిన్ కలిపి సరఫరా చేయాలి. సరఫరా చేసే ముందు శుద్ధి చేసిన నీటిని పరీక్షించాలి. గతంలో పలుమార్లు ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తనిఖీ చేసి అసహనం వ్యక్తం చేశారు. అయినా ఈ కేంద్రానికి అవసరమైన పరికరాలు మంజూరు కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. చాంబర్లలో చెత్తాచెదారం.. ఆరు మండలాల్లో 100 ఎయిర్‌వాల్వ్స్, మరో 100 గేట్‌వాల్వ్స్ ఉన్నాయి. ఇవన్నీ శిథిలావస్థకు చేరడంతో నీరు లీకవుతోంది. చెత్తాచెదారం చేరి అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఈ అపరిశుభ్రనీరే తిగిరి గ్రామాల్లోని ట్యాంకులకు చేరుతోంది. ఆ నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. నామమాత్రం నీటిశుద్ధి వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న సుజల స్రవంతి మంచినీటి పథకాన్ని పరిశీలించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు కోటి లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలాన్ని రెండేళ్ళుగా ఉపయోగించడం లేదని సిబ్బందే అంటున్నారు. నీటిలో ఆమ్లం, క్షారత్వం ఎంత శాతం ఉందని కోలిచేందుకు మాత్రమే క్లోరిన్‌ను వినియోగిస్తున్నారు. ఇది 7-9 శాతం మాత్రమే ఉండాలని తెలిపారు. 6 మండలాలకు వెళ్ళాలంటే సుమారు 60 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలి. నీటిశుద్ధి సరిగా చేయకపోవడం, పీహెచ్శాతం ఎంత ఉందో తెలుసుకోవడం లేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోనూ క్లోరిన్కెమికల్స్ కలపడం లేదు. ఎయిర్‌వాల్వ్స్, గేట్‌వాల్వ్స్ లీకవుతున్నాయి. నీరు మురికిగా మారుతోంది. బ్యాక్టీరియా వృద్ధి చెంది పిల్లలు, వృద్ధులు వ్యాధులు బారిన పడుతున్నారు. మోకాళ్లు, కీళ్లనొప్పులు, విషజ్వరాలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం జిల్లాలో ఇటువంటి సుజల స్రవంతి మంచినీటి పథకాలు వైరా, పాలేరు, అడవిమల్లెల, గంగారం, కల్లూరు పెద్దచెరువు, నాగిలిగొండ, చింతకాని మండలాల్లో ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా ఇదే విధంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు సుజల స్రవంతికి సరఫరా చేసే క్లోరిన్, ఆలం వంటివి నాసిరకంగా ఉంటున్నాయని తెలుస్తోంది. నీటి శుద్ధిని పరిక్షించాల్సిన పరికరాలు లేవు. క్లోరిన్‌శాతం కూడా తక్కువగా ఉంటోంది. ముడిపదార్థాలు కలపకుండానే, నీటి పరీక్ష చేయకుండానే గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ పథకాలను పరిశీలించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.