breaking news
vadodhara
-
ఆర్థిక సంస్కరణల్ని కొనసాగిస్తాం
వడోదర, దహేజ్: నోట్ల రద్దు, జీఎస్టీపై ప్రతిపక్షాల విమర్శల్ని తోసిపుచ్చుతూ కఠిన నిర్ణయాల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణల దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన నిర్ణయాల అమలుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కిందన్నారు. వర్తకులు జీఎస్టీ కింద నమోదు చేసుకుంటే వారి పాత లావాదేవీల జోలికి పోమని ఆయన హామీనిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోదీ ఆదివారం సుడిగాలి పర్యటన జరిపారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంలో అనుసంధానించే ‘రోరో’ ఫెర్రీ సర్వీసులను(రోల్ ఆన్–రోల్ ఆఫ్) ప్రారంభించారు. అలాగే, భావ్‌నగర్, వడోదర జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా.. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈసీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ఈ నెలలో మోదీ గుజరాత్లో పర్యటించడం ఇది మూడోసారి. ఉదయం గుజరాత్‌లోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ల్ని సముద్ర మార్గం ద్వారా అనుసంధానించే రోల్–ఆన్ రోల్–ఆఫ్ (రోరో) ఫెర్రీ సేవల్ని భరూచ్ జిల్లా ఘోఘా– భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య ప్రధాని ప్రారంభించారు. 100 మంది అంధ విద్యార్థులతో కలిసి ఘోఘా నుంచి దహేజ్ వరకూ ఫెర్రీలో ప్రధాని ప్రయాణించారు. మొదటి దశ ఫెర్రీ సేవల్ని కేవలం ప్రయాణికుల కోసమే ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ప్రారంభమయ్యే రెండో దశలో కార్లు వంటి తేలికపాటి వాహనాల్ని కూడా తరలించవచ్చు. ఈ ఫెర్రీ సేవలతో ఘోఘా–భరూచ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా ఉన్న దూరం 330 కి.మీ. కాగా, జలమార్గంలో అది కేవలం 30 కి.మీ. మాత్రమే. అనంతరం దహేజ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఆర్థిక సంస్కరణల అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండేలా చర్యలు కొనసాగిస్తాం. సంస్కరణలు, కఠిన నిర్ణయాల అనంతరం.. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ఇప్పుడు దేశం సరైన మార్గంలో ముందుకు పోతుంది’ అని మోదీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్న విషయాన్ని అనేకమంది ఆర్థిక వేత్తలు ఏకగ్రీవంగా అంగీకరించారని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధి దిగజారుతుందన్న ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ.. ‘ఇటీవల లెక్కల్ని పరిశీలిస్తే.. బొగ్గు, విద్యుత్, సహజ వాయువు, ఇతర వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రూ. 30 వేల కోట్ల డాలర్ల నుంచి 40 వేల కోట్ల డాలర్లకు పెరిగాయి’ అని ప్రధాని వెల్లడించారు. జీఎస్టీలో నమోదు చేసుకుంటున్న వర్తకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పారు. ‘గత కొద్ది నెలల్లో 27 లక్షల మంది అదనంగా జీఎస్టీలో నమోదు చేయించుకున్నారు. పన్ను ఎగవేయాలని ఏ వ్యాపారవేత్తా కోరుకోవడం లేదు. పన్ను నిబంధనలు, వ్యవస్థ, పన్ను అధికారులతో పాటు రాజకీయ నాయకులు వారిని ఆ విధంగా పురికొల్పుతున్నారు’ అని చెప్పారు. జీఎస్టీలో చేరితే వారి గత ఖాతాల్ని వెలికితీస్తారనే ఆందోళన అవసరం లేదని హామీనిచ్చారు. నన్నేమీ అనలేక.. ఈసీపై విమర్శలు ‘దీపావళి త్వరాత మోదీ గుజరాత్‌కు ఎందుకు వస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనగా ఉన్నాయి. నన్ను ఏమీ అనలేక ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. నేను వడోదర రాకూడదా?’ అని వడోదరలో జరిగిన సభలో మోదీ అన్నారు. కాంగ్రెస్ తీరును తప్పుపడుతూ.. ఇటీవల గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గెలుపును ప్రస్తావించారు. ‘అప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా జరిగిన రీకౌంటింగ్‌లో గెలుపొందినవారే.. ఇప్పుడు ఈసీని విమర్శిస్తున్నారు’ అన్నారు. వడోదరలో అభివృద్ధి పనుల్ని ప్రస్తావిస్తూ.. ‘వారు ఇంతకముందెప్పుడూ ఇలాంటి అభివృద్ధి పనుల్ని చూడలేదు. ఈ అభివృద్ధిని జీర్ణించుకోవడం వారికి కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఓడరేవులు కీలకం కేంద్ర ప్రభుత్వం పీ ఫర్ పీ(పోరŠస్ట్ ఫర్ ప్రాస్పరిటీ) నినాదాన్ని చేపట్టిందని చెప్పారు. దేశాభివృద్ధికి అత్యాధునిక ఓడరేవులు ఎంతో అవసరం. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో నౌకాశ్రయాలు, ఓడరేవులు నిరాదరణకు గురయ్యాయి. వాటిని ఆధునీకరించేందుకు సాగరమాల పథకాన్ని ప్రారంభించాం’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలోని జలరవాణా మార్గాల ద్వారా సరకు రవాణా చేస్తే టన్నుకు 20 పైసలే పడుతుందని, అదే రైల్వేకు రూ.1, రోడ్డు మార్గంలో రూ. 1.50లు ఖర్చవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు అంతర్గత జల రవాణాకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చేముందు దేశంలో కేవలం ఆరు జల రవాణా మార్గాలు ఉండేవని, ఇప్పుడు 100 మార్గాల్ని గుర్తించామన్నారు. -
వడోదరలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం
-
లంచం అడిగాడని దేహశుద్ది చేశారు
-
సొంత రాష్ట్రానికి మోడీ గుడ్‌బై
-
రా.. రా... రాయుడు
వడోదర: భారత టెస్టు జట్టులో తెలుగు తేజం అంబటి రాయుడుకు తొలిసారిగా చోటు దక్కింది. దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత వన్డే, టెస్టు జట్టును సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన రాయుడు గత ఆగస్టులో జింబాబ్వే పర్యటనలో తొలిసారి వన్డే ఆడాడు. ప్రస్తుతం వన్డే జట్టుతో పాటు ఉన్నా తుది జట్టులో స్థానం దక్కడం లేదు. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో అటు వన్డేలు, ఇటు టెస్టు జట్టులోనూ రాయుడికి స్థానం దక్కింది. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత మరోసారి రాష్ట్ర ఆటగాడికి స్థానం లభించినట్టయ్యింది. అలాగే ఏడాది కాలంగా ఫామ్‌లో లేక జట్టుకు దూరమైన పేసర్ జహీర్ ఖాన్‌ను సెలక్టర్లు కరుణించారు. కానీ రంజీల్లో రాణిస్తున్న ఓపెనర్ గౌతం గంభీర్‌ను దూరం పెట్టారు. టెస్టు జట్టును 17 మందితో, వన్డే జట్టును 16 మందితో ఎంపిక చేశారు. డిసెంబర్ 5 నుంచి మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత 18 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది. టెస్టు సిరీస్‌కు ముందు జట్టు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. సచిన్ టెండూల్కర్ టెస్టుల నుంచి తప్పుకున్న అనంతరం భారత జట్టు తొలిసారిగా బరిలోకి దిగనుంది. ‘గంభీర్ పేరు చర్చకు వచ్చింది. చాలా విషయాలు మేం చర్చించాం. కెప్టెన్ ధోనితో కూడా సంప్రదించాం. జట్ల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. గత డిసెంబర్లో జహీర్ చివరిసారిగా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. గాయం, ఫామ్‌లో లేకపోవడంతో ఈ పేసర్ జట్టుకు దూరమయ్యాడు. అయితే పునరాగమనం కోసం కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా ప్రస్తుత రంజీ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే జహీర్‌ను వన్డే జట్టులోకి పరిగణలోకి తీసుకోలేదు. అలాగే సెహ్వాగ్, హర్భజన్లను కూడా పక్కనబెట్టారు. టెస్టు జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా ఉంటాడు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇతర స్పిన్నర్లుగా అశ్విన్, ఓజా ఉంటారు. అమిత్ మిశ్రాకు వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కింది. ఆసీస్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌లో ధారాళంగా పరుగులు సమర్పించిన ఇషాంత్ శర్మను వన్డే జట్టులో కూడా ఉంచారు. జయదేవ్ ఉనాద్కట్, వినయ్ కుమార్‌లు వన్డేల్లో చోటు కోల్పోయారు. ఉమేశ్ యాదవ్, రహానే రెండు జట్లలోనూ ఉన్నారు. సచిన్ ‘స్థానం’లో కోహ్లి! ఓవరాల్‌గా టెస్టు జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్లు, ఐదుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక ఆల్‌రౌండర్ ఉన్నాడు. మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా టెండూల్కర్ స్థానంలో విరాట్ కోహ్లి వచ్చే అవకాశం ఉంది. మూడో నంబర్లో పుజారా, రోహిత్ ఐదో స్థానంలో రానుండగా రహానే, జడేజాలలో ఒకరు జట్టు కూర్పులో భాగంగా బరిలోకి దిగుతారు. తుది జట్టులో జహీర్‌తో పాటు... షమీ, ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్‌లలో ఇద్దరు బరిలోకి దిగే అవకాశం ఉంది.