breaking news
University of Silicon Andhra
-
ప్రవాస చరిత్రలో సువర్ణాధ్యాయం 'సిలికానాంధ్ర'
కాలిఫోర్నియా: భారతీయ సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని కలిగించటానికి ఆవిర్భవించిన 'యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర' ప్రవాస చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. భారతీయ కళలు, కర్ణాటక సంగీతం, కూచిపూడితో పాటు మరెన్నో అంశాలపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందించడానికి ఏర్పాటైన ఈ వర్సిటీ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో 5.5 మిలియన్ డాలర్ లు వెచ్చించి సొంతంగా భవనాన్ని సమకూర్చుకుంది. ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి 10 లక్షల డాలర్ల విరాళం అందజేశారు. ఆయన గౌరవార్ధం విశ్వవిద్యాలయ భవనానికి 'డా. లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం' అని నామకరణం చేసారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లకిరెడ్డి కుటుంబ సభ్యులు.. సిలికానాంధ్ర అభివృద్దికి భవిష్యత్తులోనూ తమ సహకారం అందిస్తామన్నారు. తాను సిలికానాంధ్రను పదిహేనేళ్ల నుంచి చూస్తున్నానని, చెప్పింది చేసి చూపించే సత్తా వారికుందని డా. హనిమిరెడ్డి అన్నారు. సిలికానాంధ్ర వారంతా ఒకే కుటుంబంలా పనిచేస్తుంటారని, అందుకే తమ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల విరాళం అందించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి, చిత్రవీణ రవికిరణ్, డా.విక్రం లకిరెడ్డి , జయ ప్రకాశ్ రెడ్డి, మాధురి కిషోర్, స్మితా మాధవ్ వంటి కళాకారులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు, దాతలు హాజరై సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. భారతీయ సంస్కృతికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని మేళవించి పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందించబోతున్నామని, జనవరి 2017 నుండి తరగతులు ప్రారంభమౌతాయని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలను తలపించే విధంగా ఈ వర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. చీఫ్ అకాడెమిక్ ఆఫీసర్ రాజు చమర్తి మాట్లాడుతూ.. పదేళ్ల కిందట 150 మంది విద్యార్ధులతో ప్రారంభమైన మనబడి ద్వారా ఇంతవరకు 25,000 పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పించామని, ఈ విద్యా సంవత్సరంలో 7500 మందికి పైగా విద్యార్ధులు ఇప్పటికే నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ భవనం కొనుగోలు చేయటానికి సహాయం చేసిన విశ్వ విద్యాలయ వ్యవస్థాపక దాతలను యూనివర్సిటీ ముఖ్య ఆర్ధిక వ్యవహారాల అధికారి (సీఎఫ్ఓ) దీనబాబు కొండుభట్ల సభికులకు పరిచయం చేసి సత్కరించారు. ఒక లాభాపేక్షరహిత (ఎన్పీఓ) కు బ్యాంకు ద్వారా లోన్ లభించడానికి, డాక్టర్ హనిమిరెడ్డి వంటి వారి నుంచి భారీ సహాయం లభించడానికి కార్యకర్తల అంకితభావం, జవాబుదారి తనంతో పాటు సిలికానాంధ్ర ఆర్ధిక ప్రణాళికలు పారదర్శకంగా ఉండడం ముఖ్య కారణమన్నారు. రాబోయే అయిదేళ్లలో 100 మిలియన్ డాలర్లను విరాళాలు ద్వారా సేకరించి అత్యాధునిక విశ్వ విద్యాలయ ప్రాంగణాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.విశ్వవిద్యాలయానికి సహకరించ దలచిన దాతలు + 1 408 205 5527 కి ఫోన్ చేయవలసిందిగా అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, అజయ్ గంటి ,రవి కుచిభోట్ల ,సంజీవ్ తనుగుల, శాంతి కూచిభొట్ల, శ్రీరాం కోట్ని, ప్రభా మాలెంపాటి, సాయి కందుల, రవి చివుకుల, ఫణీ మాధవ్ కస్తూరి, వంశి నాదెళ్ల , శాంతి అయ్యగారి , గోపిరెడ్డి శరత్ వేట , భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, యం.జె. తాటిపామల, తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ గడ్డపై తొలి తెలుగు వర్సిటీ : యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర
అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా కలిసి 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థ.. సిలికానాంధ్ర. ఇప్పుడు అదే సంస్థ తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలు భవిష్యత్తు తరాలకు అందించడంతో పాటు.. వాటికి సంబంధించిన కోర్సులు, కెరీర్ అవకాశాలు మెరుగుపరిచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటైన ఈ వర్సిటీలో.. తెలుగు సంస్కృతి సాహిత్య విషయాలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ కోర్సులు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమవుతాయని అంటున్న యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర అధ్యక్షులు/ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆనంద్ కూచిభొట్లతో ఇంటర్వ్యూ.. ప్రపంచంలోనే మొదటిది: ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఎక్కడ చూసినా భారతీయులు, తెలుగు వారు కనిపిస్తూనే ఉంటారు. కానీ వారంతా వివిధ ఉద్యోగాల రీత్యా వెళ్లడం, వారి సంతానాన్ని కూడా ఆయా దేశాల విద్యా ప్రమాణాలకు అనుగుణంగా చదివించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నేటితరం పిల్లలకు రెండు వేల సంవత్సరాలకుపైగా చరిత్ర గల మన తెలుగు భాష సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి విషయాలపై అవగాహన ఏమాత్రం ఉండడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు తరాలకు తెలుగు భాష విశిష్టతను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిందే.. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర. ఇలా పూర్తి స్థాయిలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐఈజీ సీఈఓ అమర్నాథ్ రెడ్డి, ఐఏఎస్ అధికారి సంజయ్‌జాజు ఆధ్వర్యంలో యూనివర్సిటీ వెబ్సైట్ ఆవిష్కరణ జరిగింది. అందించనున్న కోర్సులు: ప్రాథమికంగా.. అమెరికా విద్యా విధానాన్ని అనుసరించి మూడు స్కూల్స్‌ను ఏర్పాటు చేశాం. అవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్, స్కూల్ ఆఫ్ మ్యూజిక్, స్కూల్ ఆఫ్ లిటరేచర్. ఈ మూడు స్కూల్స్‌లో.. స్కూల్ ఆఫ్ డ్యాన్స్ పరిధిలో కూచిపూడి నృత్యంలో, స్కూల్ ఆఫ్ మ్యూజిక్ పరిధిలో కర్ణాటక సంగీతం, స్కూల్ ఆఫ్ లిటరేచర్ పరిధిలో ఎంఏ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందించనున్నాం. అయితే స్కూల్ ఆఫ్ లిటరేచర్‌లో ఎంఏ స్థాయిలో ఆర్ట్స్ లిటరేచర్, తెలుగు లిటరేచర్ కోర్సులు ఉంటాయి. మాస్టర్స్ ప్రోగ్రాం రెండేళ్ల వ్యవధి, డిప్లొమా ప్రోగ్రాంలు ఏడాది వ్యవధి, సర్టిఫికెట్ ప్రోగ్రాంలు ఆరు నెలల వ్యవధిలో సాగుతాయి. ఫాల్ సెషన్ నుంచి ప్రారంభం: అమెరికాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే ముందుగా సదరు ప్రాంతానికి చెందిన ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకుని, బిజినెస్ లెసైన్స్ పొందాలి. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ప్రైవేట్ పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే నియంత్రణ సంస్థకు కోర్సుల నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియను అక్టోబర్‌లో పూర్తి చేశాం. ఇక.. సదరు నియంత్రణ సంస్థ క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించి అనుమతి ఇవ్వడానికి కనీసం ఆరునెలల సమయం పడుతుంది. ఈ క్షేత్రస్థాయి తనిఖీలో మౌలిక సదుపాయాలు, అందించే కోర్సులు, ఎలెక్టివ్స్, కరిక్యులం ఇలా అన్ని అంశాలను పరిశీలించి యూనివర్సిటీ ప్రారంభానికి అనుమతినిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా విద్యా విధానం ప్రకారం వచ్చే ఏడాది (2014) ఫాల్ సెషన్ నుంచి కోర్సులు ప్రారంభించే యోచనలో ఉన్నాం. ఒకసారి కోర్సులు ప్రారంభించాక అక్కడి విద్యా వ్యవస్థ ప్రకారం స్ప్రింగ్, ఫాల్, సమ్మర్ సెషన్లలో ప్రవేశాలు నిర్వహిస్తాం. సెమిస్టర్ విధానంలో బోధన సాగుతుంది. ఒక బ్యాచ్ పూర్తయితే.. అక్రెడిటేషన్: అమెరికాలో కొత్తగా ఏర్పాటైన ఏ యూనివర్సిటీ అయినా.. తాము అందించే కోర్సులకు గుర్తింపు (అక్రెడిటేషన్) పొందాలంటే సదరు యూనివర్సిటీ నుంచి ప్రతి కోర్సులో ఒక బ్యాచ్ పూర్తయి ఉండాలి. ఇక గుర్తింపు సంస్థల పరంగా అమెరికాలో ఐదు ప్రాంతీయ గుర్తింపు సంస్థలు ఉన్నాయి. యూనివర్సిటీ ఏ గుర్తింపు సంస్థ పరిధిలో ఉంటుందో ఆ గుర్తింపు సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కసారి అక్రెడిటేషన్ వస్తే యూనివర్సిటీ.. అందించే కోర్సులకు అంతర్జాతీయ అర్హత లభిస్తుంది. ఆ సర్టిఫికెట్లతో ఎక్కడైనా ఉన్నత విద్య, లేదా ఉద్యోగం దేనికైనా దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అర్హులెవరంటే: యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర.. తెలుగు యూనివర్సిటీ అయినప్పటికీ అడ్మిషన్ల విషయంలో ప్రాంతీయ పరిమితులు లేవు. ప్రపంచంలోని ఏ దేశం విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు లిటరేచర్ మినహా మిగతా కోర్సుల్లో బోధన ఇంగ్లిష్ మాధ్యమంలో సాగుతుంది. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు హైస్కూల్ ఉత్తీర్ణత, ఎంఏ తెలుగు సాహిత్యం కోర్సుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులు అర్హులు. కేవలం యూనివర్సిటీ ప్రాంగణంలోనే కాకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా అభ్యసించే విధంగా ఆన్లైన్ కోర్సులకు కూడా రూపకల్పన చేశాం. ఈ విధానంలో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం సింక్రనస్ లేదా అసింక్రనస్ పద్ధతుల్లో పాఠాలు వినే అవకాశం ఉంటుంది. అసింక్రనస్ పద్ధతిలోనైతే విద్యార్థి తనకిష్టమైన సమయంలో పాఠాలు నేర్చుకోవచ్చు. సింక్రనస్ పద్ధతిలో మాత్రం ఒక విద్యార్థి సమూహం నిర్దిష్ట సమయంలో ఒక ప్రాంతంలో ఉండి.. అదే సమయంలో క్లాస్ రూంలో అధ్యాపకులు బోధించే అంశాలను ఆన్లైన్లో వినాల్సి ఉంటుంది. అంతేకాకుండా అమెరికా విద్యా వ్యవస్థలోని వెసులుబాటు ప్రకారం.. ఇప్పటికే అక్కడ ఆయా యూనివర్సిటీల్లో వేర్వేరు కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ప్రవాసాంధ్రులకు ఎంతో ఉపయోగపడే అంశం. నామమాత్రం ఫీజులతో: అమెరికాలో ఉన్నత విద్య అంటే భారీ స్థాయిలో ఫీజులు ఉంటాయనే భావన నెలకొని ఉంది. కానీ సిలికానాంధ్ర సంస్థ ఉద్దేశం మాత్రం దీనికి భిన్నం. ఎంఏ కోర్సును ఐదు వేల నుంచి ఆరు వేల అమెరికన్ డాలర్లకు అందించాలని యోచిస్తున్నాం. అదే విధంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెలోషిప్ గ్రాంట్స్ అందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో దాతల (డోనార్స్) సహకారం తప్పనిసరి. ఇప్పటికే ఈ విషయంలో సంప్రదింపులు సాగిస్తున్నాం. ప్రవేశ ప్రక్రియ ఇలా: యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో ప్రవేశం.. ఇతర అమెరికా యూనివర్సిటీలకు మాదిరిగానే ఉంటుంది. తెలుగు యూనివర్సిటీ అయినప్పటికీ.. అమెరికాలో నెలకొల్పినందున అక్కడి విధి విధానాల ప్రకారం.. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టోఫెల్ స్కోర్ పొందాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆయా కోర్సుల నోటిఫికేషన్స్‌కు స్పందించి రికమండేషన్ లెటర్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ), టోఫెల్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. వీటి ఆధారంగా నిపుణుల కమిటీ.. షార్ట్‌లిస్ట్ చేసి ఎంపికైన అభ్యర్థులతో తుది జాబితా విడుదల చేస్తుంది. తొలి నోటిఫికేషన్ ఆగస్టులో: యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి చట్టబద్ధమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేశాం. ఇందుకు సంబంధించి త్వరలోనే అనుమతులు రానున్నాయి. దీని ఆధారంగా వచ్చే ఫాల్ సెషన్లో ఆగస్టు 29న కోర్సులు ప్రారంభించాలనేది మా ఉద్దేశం. ఇందుకోసం జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తొలుత వంద మంది విద్యార్థులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే అమెరికా విద్యా విధానం ప్రకారం గరిష్ట విద్యార్థుల సంఖ్య విషయంలో ఎలాంటి నియంత్రణలు లేనందున ఆ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. వెబ్సైట్ ఆవిష్కరణ చేసినప్పటి నుంచే వందల సంఖ్యలో విద్యార్థులు ప్రవేశ విధి విధానాల కోసం సంప్రదించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆ తర్వాత నుంచి అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం స్ప్రింగ్, సమ్మర్ సెమిస్టర్లను కూడా ఆఫర్ చేస్తాం. పకడ్బందీగా నిర్వహణ: కోర్సుల నిర్వహణ విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా రంగాల్లో ప్రముఖులతో ప్రతి కోర్సుకు సలహా మండలిని నియమించాం. ఈ మండలిలోని సభ్యులు.. కోర్సు ఉద్దేశంతోపాటు విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చే విధంగా కోర్సు కరిక్యులంను రూపొందిస్తారు. ఉదాహరణకు కర్ణాటక మ్యూజిక్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ విభాగంలోని చారిత్రక అంశాలపై థియరీ బోధనతోపాటు.. దానికి ఆధునిక సాంకేతికతను మేళవించే విధంగా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇలా ప్రతి కోర్సులోనూ చారిత్రక అంశాలు, ఆధునిక సాంకేతికతను మేళవించే అంశాలకు చోటు చోటు కల్పిస్తాం. పలు యూనివర్సిటీలతో ఒప్పందాలు: కోర్సుల నిర్వహణ, బోధనకు సంబంధించి మన రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలతో పరస్పర ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ యూనివర్సిటీ ఏర్పాటు గురించి తెలిసినప్పటీ నుంచే పలు యూనివర్సిటీలు సంప్రదింపులు మొదలు పెట్టాయి. ఇప్పటికే సిలికానాంధ్ర సంస్థ.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో కలిసి 2007 నుంచి సంయుక్తంగా.. ఆరు నుంచి 16 ఏళ్ల వయసు మధ్య గల ప్రవాసాంధ్రుల కోసం ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అనే ఐదు దశల్లో నిర్వహిస్తున్న ‘మనబడి’ కార్యక్రమాన్నే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అవకాశాల విషయంలో: నేటి యువత లక్ష్యం కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం, సంపాదన అనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో అమెరికాలో తెలుగు యూనివర్సిటీ, అందులోనూ సాహిత్య పరమైన కోర్సులు.. వీటిని పూర్తి చేస్తే ఉద్యోగం లభిస్తుందా అనే విషయంలో ఆందోళన అవసరం లేదు. కారణం.. ప్రతి కోర్సుకు ఆధునిక సాంకేతికతను జోడించి రెండింటి సమ్మేళనంతో బోధన సాగుతుంది. దీని ద్వారా సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. కారణం ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ తాము అందించే ఉత్పత్తుల లోకలైజేషన్ ప్రక్రియకు ప్రాధాన్యత పెరిగింది. గూగుల్ సంస్థ తెలుగులో యూనికోడ్ ఫాంట్స్‌ను ఉపయోస్తుండటమే ఇందుకు చక్కని ఉదాహరణ. కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ పూర్తి చేస్తే సాఫ్ట్వేర్ సంస్థలు రెడ్ కార్పెట్ వెల్కం పలుకుతాయి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నేర్చుకుంటే ప్రపంచ స్థాయి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు: ప్రస్తుతం ఏడు కోర్సులతో యూనివర్సిటీ ప్రారంభమవుతుంది. త్వరలో కోర్సుల విస్తరణ తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలో ముందుగా.. రెండో ఏడాది ఎం.ఎస్. కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, ఎం.ఎస్. కంప్యూటర్ సైన్స్ కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఎం.ఎస్. కంప్యూటర్ సైన్స్ చేయాలంటే జీఆర్ఈ స్కోర్ తప్పనిసరి. మరో రెండేళ్లలో అత్యున్నత పీహెచ్డీ కోర్సులు ప్రారంభించే అవకాశం ఉంది. బోధన, పరిశోధన, ప్రచురణ విభాగాల్లో తెలుగు భాషను కూడా ఇతర కోర్సులకు దీటుగా తీర్చిదిద్దడమే కాకుండా వచ్చే పదేళ్లలో యూనివర్సిటీని ప్రపంచ శ్రేణి యూనివర్సిటీగా నిలపడమే లక్ష్యం. వివరాలకు: universityofsiliconandhra.org