breaking news
Uday Kiran Commits Suicide
-
ఉదయ్‌ని అనవసరంగా పెళ్ళి చేసుకున్నా:విషిత
-
ఉదయ్.. హీరో చట్రంలో బందీ అయ్యారు!
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎంతసేపు తాను స్టార్ హీరోనన్న చట్రంలో ఉదయ్ కిరణ్ బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమయ్యేవాడని ఆయన భార్య విషిత పోలీసులకు చెప్పారు. సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం.. ఇవన్నీ ఉదయ్‌పై ప్రభావం చూపాయని వివరించారు. పలుచోట్ల విలువైన స్థలాలున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఉదంతంపై మరింత సమాచారం సేకరించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గురువారం మరోమారు విషిత, ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్ మున్నాలను వేర్వేరుగా ప్రశ్నించారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్ వచ్చేనెల 18న భార్య విషితతో కలిసి చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకున్నాడు. 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించాడు. చెన్నై వెళ్లి తమిళ సినిమావకాశాల కోసం ప్రయత్నించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపారు. విచారణలో తాను ఉదయ్‌ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని పలుమార్లు నెత్తి బాదుకున్నారు. కూతురి జీవితం సర్వనాశనమైందంటూ ఆమె తండ్రి కూడా పోలీసుల ముందు వాపోయారు. కాగా, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ సినిమాను ఉదయ్ కిరణ్ హీరోగా నిర్మిస్తున్న మున్నా... సినిమా ఖర్చులకు ఉదయ్ పేరు చెప్పి చాలా మంది వద్ధ అప్పు వసూలు చేసినట్లు తేలింది. సుమారు 12 చోట్ల అప్పులు చేయడంతో వారంతా గత మూడు నాలుగు నెలలుగా ఉదయ్‌కిరణ్ ఇంటి చుట్టూ తిరిగారు. లిఫ్ట్‌కు వాడే తాడుతో ఉరి: ఉదయ్ కిరణ్ ఉరేసుకోవడానికి వాడిన తాడు ఎక్కడ్నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. లిఫ్ట్ పాడైనప్పుడు లేదా ఆగినప్పుడు పైకి లాగేందుకు ఆ తాడును అపార్ట్‌మెంట్‌వాసులు వినియోగిస్తున్నట్లు తేలింది. అవసరం లేని సమయంలో ఆ తాడును టైపై ఓ మూలన పడేస్తారు. ఉదయ్ తాను ఉరేసుకోవడానికి ముందు తాడును ఇంట్లోకి తెచ్చుకొని ఉంటాడని పోలీసులు తెలిపారు. తాడు పొడవుగా ఉండడంతో ఉరికి సరిపోయేంత మేర కత్తిరించి, మిగతా తాడును మళ్లీ టైపై వేసి వచ్చినట్లు భావిస్తున్నారు. తొలుత భార్య విషిత చున్నీతో ఉరేసుకోవాలని భావించి, బీరువాలో ఉన్న రెండు చున్నీలను బయటకు తీశాడు. కానీ ఆ రెండు ఫ్యాన్ కొక్కానికి అందకపోవడంతో తాడును వినియోగించినట్లు తెలుస్తోంది. ఉరేసుకునే ముందు ఎలా చనిపోవాలన్న దానిపై కిరణ్ చాలాసేపు తర్జనభర్జన పడ్డట్లు అక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ముందుగా చేతి మణికట్టు వద్ద కోసుకొని చనిపోవాలని భావించాడు. కత్తితో మణికట్టు తెంచుకునేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు చెబుతున్నారు. -
ఉదయ్ కిరణ్ అంతిమ యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి భౌతికకాయాన్ని ఎర్రగడ్డ స్మశాన వాటికకు తరలిస్తున్నారు. అంతకు ముందు ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని పలువురు సినీ ప్రముఖలు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. పలువురు మహిళలు ....ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవారు పాల్గొన్నారు. -
ఎదిరించి నిలవాలి..
సనత్‌నగర్, న్యూస్‌లైన్: కెరటాన్ని మించిన స్ఫూర్తి జీవితానికి ఏముంటుంది..? గెలుపోటములు వెలుగునీడల్లాంటివి. పడిలేచిన కెరటం ఎప్పుడైనా ఒడ్డును తాకాల్సిందే కదా. ఓడిపోయిన ప్రతి జీవితం ఏదో ఒక సమయంలో విజయతీరాన్ని చేరుకోవలసిందే. చిన్న వయసులోనే కెరటంలా ఎగిసిన హీరో ఉదయ్‌కిరణ్ తీవ్ర నిరాశానిస్పృహల నడుమ ఆయన ఆత్మహత్యకు పాల్పడిన తీరు సినీవర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. ఎండమావుల్లాంటి సినిమా జీవితంలో అవకాశాలు లభించడం అంత సులభం కాదు. అలాగని ప్రతిభా పాటవాలు ఉన్నవాళ్లకు అవి దరిచేరకుండా ఉండవు. సుమారు 19 సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించి అభిమానుల హృదయాల్లో ‘లవర్‌బాయ్’గా సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు రావడం లేదనే ఆవేదన... ఇండస్ట్రీకి దూరమవుతున్నాననే బాధ.. కారణాలు ఏవైతేనేం. ప్రతికూలతను అధిగమించలేకపోయాడు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి ఎత్తుపల్లాలు కొత్తేం కాదు. ఇప్పుడు పేరుప్రఖ్యాతలు సంపాదించుకొన్న ఎంతో మంది ఒకప్పుడు ఇలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే కావడం గమనార్హం. చావు పరిష్కారం కాదు అవకాశాలు లభించక కుమిలిపోతున్న ఉదయ్‌కిరణ్ లాంటివాళ్లు తెలుగు సినీపరిశ్రమలో ఇంకా ఎంతోమంది ఉన్నారని సినీ వర్గాలే పేర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యకు చావు మాత్రం పరిష్కారం కాబోదని మానసిక నిపుణులు చెబుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సినీ హీరో వరకు ఏదో ఒక ఫ్రేమ్‌లో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించుకొనే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని... కొద్దిపాటి ఓటములకే భయపడి పారిపోవలసిన పనిలేదని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు నిర్వేదంలో ఉండి ఒక్క సినిమాతో బ్రహ్మాండమైన టర్నింగ్ తీసుకున్న నిర్మాతలున్నారు. హీరోగా ఎదగలేని వాళ్లు యాంకర్లుగానో, రచయితలాగానో చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే వెలుగు వెలిగి వెండితెరకు దూరమైన ఓ వర్ధమాన నటుడు ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య రంగంలో చక్కగా రాణిస్తున్నాడు. ఇలా తమ రంగంలో అపజయాలను తట్టుకుని నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని విజయం కోసం కృషి చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం పాపం.. ఏ రంగంలోనైనా ప్రయత్నిస్తే ఓడిపోవడం అనేది ఉండదు. ఇక అవకాశాలు లేవన్న భావనతో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఎవరో అవకాశాలు ఇవ్వడం కాదు. మనకు మనమే ప్లాట్‌ఫాంను క్రియేట్ చేసుకోవాలి. అంతెందుకు.. సినిమా పరిజ్ఞానం అంతగాలేని వారు కూడా యూట్యూబ్‌ను ఆసరాగా చేసుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. తద్వారా అవకాశాలను చేజక్కించుకుంటున్నారు. ఫైనాన్షియల్ పరంగా కూడా ప్లానింగ్ అవసరం. - దాసరి మారుతి, సినీ డెరైక్టర్ ఎదిగేవరకు పోరాడాలి.. టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు దక్కకపోవడం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న పాపం. కొత్తవారికి దర్శకులు, నిర్మాతలు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. తాము ఎంచుకున్న రంగంలో పైకి ఎదిగేవరకు పోరాడాలే తప్ప జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకోకూడదు. - పీసీ ఆదిత్య, సినీ దర్శకుడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత శోక సంద్రంలో అభిమానులు బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తమ అభిమాన హీరో ఇక లేరని తెలుసుకున్న ఉదయ్‌కిరణ్ అభిమానులు సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు, శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అపోలో నుంచి మృతదేహాన్ని ఉస్మానియాకు శవపరీక్ష నిమిత్తం తరలిస్తుండగా అభిమానులు చూసేందుకు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఉదయ్ మృతదేహాన్ని చూసి కొందరు విలపించారు. సినీరంగానికి చెందిన నటులు శ్రీకాంత్, శివాజీరాజా, శివకృష్ణ, వైజాగ్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, ఢిల్లీ రాజేశ్వరి, విజయ్‌చందర్ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కొందరి గుప్పిట్లో చిత్ర పరిశ్రమ! బంజారాహిల్స్, నూస్య్లైన్: తెలుగు చిత్ర పరిశ్రమలో అండదండలు ఉన్నవారే అవకాశాలు దక్కించుకుంటున్నారని, ఏ అండాలేనివారు అవకాశాలకు దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరో ఉదయ్‌కిరణ్ ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. 19 చిత్రాల్లో నటించి ‘లవర్‌బాయ్’గా పేరుతెచ్చుకున్న ఉదయ్‌కిరణ్ మృతి ఫిల్మ్‌నగర్‌లో సంచలనం రేపింది. సోమవారం ఉదయం ఈ విషయం తెలియడంతో సినీ కార్యాలయాలు, సినీ స్టూడియోల్లోనూ ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యపైన, అందుకు దారితీసిన కారణాలపైన చర్చించుకున్నారు. చిత్ర పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొన్ని కుటుంబాలు ఉదయ్‌కిరణ్ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వర్థమాన హీరోలు సైతం సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని సినీ పెద్దలు పేర్కొంటున్నారు. కొందరు హీరోయిన్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదని, గడిచిన రెండు, మూడేళ్లు ఒక వెలుగు వెలిగిన హీరోలకు సినిమా ఛాన్సులు లేకుండాపోయాయని.. వారు పడుతున్న వేదన అంతాఇంతా కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. చెమ్మగిల్లిన కళ్లు ఉదయ్‌కిరణ్‌పై ట్వీట్స్ ‘మెరిసేదంతా బంగారం కాదు. పెద్ద చిరునవ్వు వెనక ఎంతో బాధ దాగుంటుంది. ఉదయ్ విషయం నన్నెంతో కలిచి వేసింది. అతని ఆత్మకు శాంతి కలగాలి’ - శ్రద్ధాదాస్ యువ నటుడి మరణం చాలా బాధ కలిగించింది. ఒక్కోసారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. - గుత్తా జ్వాల ఉదయ్‌కిరణ్ ఇకలేరు. చాలా బాధగా ఉంది. - ఎస్ఎస్ రాజమౌళి ఉదయ్‌కిరణ్ మరణం దుర్వార్త. అందరికీ కష్టాలు ఉంటాయి. అందరూ పోరాడాల్సిందే. కొంత మంది పోరాటాన్ని వదిలేస్తారు. అలా చేయకపోతే బాగుండు. - చిన్మయి శ్రీపద మనం ఇలా జరగకుండా చూసి ఉండాల్సింది. - జీవా పొద్దున్నే ఈ దుర్వార్త వినడానికి నిద్రలేచానా. నాకు తెలిసిన వాళ్లలో అత్యంత స్నేహపాత్రుడు ఉదయ్‌కిరణ్. నేను దుఃఖంలో మునిగి పోయాను. - ప్రియమణి చాలా దుర్వార్త. ఆర్ఐపీ ఉదయ్ - గోపీచంద్ వాట్ ది హెల్. ఉదయ్‌కిరణ్ వార్త నిజమా? ఇంకా నమ్మలేకుండా ఉన్నా. - స్నేహా ఉల్లాల్ ఎంతో మంచి వాడు. స్వీట్ పర్సన్. ఉదయ్ లేడంటే ఇప్పటికీ నమ్మసక్యం కాకుండా ఉంది. - వరుణ్‌సందేశ్ నాకు అత్యంత దగ్గరి స్నేహితుడు. ఉదయ్ కిరణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వియ్ విల్ మిస్‌యూ. - మంచు మనోజ్ నీ చిరునవ్వు వెనకున్న విషాదం మాకు తెలీదు. నీ ఆత్మ సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నా. ఉదయ్‌కిరణ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. - చార్మి -
షాక్‌కు గురయ్యా: దర్శకుడు తేజ
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త విని షాక్‌కు గురైనట్లు దర్శకుడు తేజ తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్నేహితుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఆ వార్త నిజం కాకపోతే బాగుండు అనుకున్నానన్నారు. ఉదయ్ కిరణ్‌ను చివరగా అతనిని పెళ్లిలో చూశానని ...చాలా సంతోషంగా ఉన్నాడని తేజ తెలిపారు. తనను కలవాలని ఉదయ్ కిరణ్ అడిగితే.... కొంత సమయం తీసుకుందామని చెప్పానన్నారు. సినిమాలు లేకపోతే ఏ నటుడైనా డిప్రెషన్‌కు గురవుతారని, యాక్టర్లకు సినిమాలు తప్ప, మరేమీ తెలియదని తేజ అన్నారు. మీసాలు కూడా రాని ఉదయ్‌ను తానే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశానని, చాలా మంచి వ్యక్తి అని, ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదని అన్నారు. తన కెరీర్‌కు బాగోనందున కొంత సమయం తీసుకుని...ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయిందన్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోవటం...ఇప్పుడు ఉదయ్ మృతి బాధాకరమన్నారు. కాగా ఉదయ్ కిరణ్‌ను చిత్రపరిశ్రమలో తొక్కేసారా? లేదా అన్నది తనకంటే మీడియాకే బాగా తెలుసు అని...విలేకర్ల ప్రశ్నకు తేజ సమాధానం ఇచ్చారు.