breaking news
swami asimananda
-
అన్ని ‘సంఝౌతా’ కేసులేనా?
సాక్షి, న్యూఢిల్లీ : 12 ఏళ్ల క్రితం 68 మంది ప్రయాణికులను బలితీసుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసులో నిందితులంతా విడుదలయ్యారు. నెంబర్ వన్ నిందితుడు స్వామి అసీమానంద్ సహా నిందితులందరిని మార్చి 20వ తేదీన కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విడుదల చేసిన విషయం తెల్సిందే. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విఫలమైనే కారణంగానే నిందితులను విడుదల చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇంతకుముందు మక్కా మసీదు, ఆజ్మీర్ షరీఫ్ బాంబు పేలుళ్ల కేసుల నుంచి కూడా స్వామి అసీమానంద్ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగానే విడుదలయ్యారు. హిందూత్వ టెర్రర్ కేసులన్నింటిలో సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఎన్ఐఏ విఫలమైందంటూ కోర్టులు పలు సార్లు ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ప్రత్యేక కోర్టు తీర్పుతో విడుదలైన అసీమానంద బయటకు రాగానే తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. 2010, డిసెంబర్ నెలలో, 2011, జనవరి నెలలో బాంబు పేలుళ్ల వెనక తన హస్తం ఉందని కోర్టు ముందు అసీమానంద స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత మాటమార్చి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేయడం వల్ల అలా తాను వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ‘కారవాన్’ అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారన్న విశయాన్ని ఖండించారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని హింసాత్మక సంఘటనల్లో తన హస్తం ఉందని గర్వంగా చెప్పుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ముస్లింలు లక్ష్యంగా జరిగిన అన్ని బాంబు పేలుళ్ల సంఘటనలకు ఆరెస్సెస్ నాయకులు మోహన్ భగవత్, ఇంద్రేశ్ కుమార్ల దీవెనలు కూడా ఉన్నాయని ఆయన ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2006లో జరిగిన మాలెగావ్ బాంబ్ కేసు, 2007లో జరిగిన సంఝౌతా బాంబ్ కేసు, 2007లో జరిగిన మెక్కా మసీదు పేలుడు కేసు, 2007లోనే జరిగిన అజ్మీర్ షరీఫ్ పేలుడు కేసు, 2008లో జరిగిన మాలేగావ్ మరో కేసు... వీటన్నింటి వెనక హిందూత్వ శక్తుల హస్తం ఉందనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల వెనక హిందూత్వ శక్తుల నెట్వర్క్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయని ‘సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసు’ ప్రత్యేక దర్యాప్తు బృందానికి మూడేళ్లపాటు నాయకత్వం వహించిన హర్యానా పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ 2016, జూన్ 6వ తేదీన ‘ది వైర్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఇండోర్ వెళ్లడం, అక్కడి ఆరెస్సెస్ సభ్యుడు సునీల్ జోషి, అతని ఇద్దరు అనుచరుల హస్తం ఉందని విచారణలో తేలడం, ఆ బృందం సునీల్ జోషిని అరెస్ట్ చేసేలోగా ఆయన హత్య జరగడం తదితర పరిణామాల గురించి పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ పూసగుచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝాతా కేసులో నిందితులను మార్చి 20వ తేదీన ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ‘ది వైర్ న్యూస్’ నాటి వికాస్ నారాయణ్ రాయ్ ఇంటర్వ్యూను ఈ మార్చి 21వ తేదీన పునర్ ప్రచురించింది. ఈ హిందూత్వ కేసుల దర్యాప్తును 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వీకరించినప్పటి నుంచి కొన్ని కేసులు కాల గర్భంలో కలిసి పోయాయి. కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేక నిందితులు విడుదలయ్యారు. కొన్ని కేసుల్లో నిందితులంతా బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక్క కేసులో కూడా ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడలేదు. 2008 నాటి మాలెగావ్ కేసులో నిందితులైన సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్ట్‌నెంట్ కల్నల్ పురోహిత్ బెయిల్‌పై విడుదలయ్యారు. నాటి ఆరెస్సెస్ స్థానిక నాయకుడు ఇంద్రేశ్ కుమార్ నేడు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు. సాక్ష్యాధారాలు లేక సంఝౌతా కేసు నుంచి కూడా పురోహిత్ విడుదలయ్యారు. ఎవరి మధ్య ఏం ‘సంఝౌతా’ కుదరిందోగానీ నేరస్థులతా తప్పించుకున్నారు. దేశంలో జరగుతున్న టెర్రరిస్టు దాడుల కేసులను త్వరతిగతిన దర్యాప్తు జరిపి నేరస్థులకు తగిన శిక్ష విధించేందుకు 2009లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ సంస్థను ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ టెర్రరిస్టు కేసుల దర్యాప్తునకు ఏ రాష్ట్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు చీఫ్‌గా 2017లో ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. -
‘మక్కా’ నిందితుడికి ‘సంఝౌతా’ కేసులో బెయిల్
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానందకు హర్యానాలోని పంచకుల న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులోనూ ఇతడు నిందితుడిగా ఉండటంతో ఆ కేసులో బెయిల్ లభించింది. భారత్–పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 2007 ఫిబ్రవరి 18న భారీ పేలుడు జరిగింది. ఢిల్లీకి 80 కిమీ దూరంలో ఉన్న పానిపట్ సమీపంలోని దివానా వద్ద జరిగిన ఈ ఘటనలో మొత్తం 68 మంది పాక్ పౌరులు మరణించారు. ఈ కేసును తొలుత స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిప్పటికీ ఆపై కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ‘సంఝౌతా’లో వినియోగించిన బాంబులు హైదరాబాద్‌లోని మక్కా మసీదు, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాల్లో వినియోగించిన వాటిని పోలి ఉన్నాయి. దీంతో దర్యాప్తు సంస్థలు ఇవన్నీ ఒకే మాడ్యుల్ పనిగా నిర్థారించాయి. ‘మక్కా’, ‘అజ్మీర్’ కేసుల్లో అసిమానంద కీలక నిందితుడిగా తేలడంతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడులోనూ నిందితుడిగా చేర్చింది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను అధికారులు 2010లో అరెస్టు చేసింది. అప్పట్లోనే ‘మక్కా’ కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి విచారించింది. తాను చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే కలీమ్ అనే వ్యక్తి పరిచయంతో పరివర్తన చెందానంటూ ఎన్ఐఏ విచారణలో బయటపెట్టిన విషయం విదితమే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన సర్కార్ బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. తరచూ ఉగ్రవాదంపై చర్చిస్తూ దీనికి ప్రతీకారంగా దాడులకు దిగాలంటూ అను^è రులను రెచ్చగొట్టేవాడు. ‘మక్కా’ కేసుల్లో నిందితులుగా ఉండి పట్టుబడిన దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మల విచారణలో అసిమానందకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ కేసులో బెయిల్ లభించింది. ఇప్పుడు ‘సంఝౌతా’లోనూ బెయిల్ మంజూరైంది. ‘మక్కా’ కేసులో బెయిల్ రాకపోవడంతో నగరానికి తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.