breaking news
sharadha scam
-
బెంగాల్ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం?
సాక్షి, నేషనల్ డెస్క్: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ‘దీదీ వర్సెస్ మోదీ’ తాజా ఎపిసోడ్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడేది బీజేపీయేనని, బెంగాల్ రాజకీయాల్లో వేళ్లూనుకోవాలనే ఆ పార్టీ ఆకాంక్ష ఈ ‘ఘర్షణ’తో తీరనుందని విశ్లేషకుల అంచనా. శారద స్కామ్ విచారణ ఎలా జరగనుంది?, సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలేంటి? అనే విషయాలను పక్కనబెట్టి.. కేవలం రాజకీయ కోణంలో ఈ ఘర్షణను విశ్లేషిస్తే.. అంతిమంగా ఇది బీజేపీకి జాక్‌పాట్ లాంటిదేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో జీరోతో ప్రారంభమైన బీజేపీ ఉనికికి దీనివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని, పెరిగే సానుకూల ఓటు.. సీట్ల సంఖ్యను పెంచుకునేలా బీజేపీకి లాభిస్తుందని వాదిస్తున్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్లు ఇంకా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయి. తృణమూల్‌కు బీజేపీ, ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి మోదీ.. బలమైన ప్రత్యర్థులుగా అవతరించారు. ప్రజల్లోనూ ఆ భావన వ్యక్తమవుతోంది. మమతను, తృణమూల్‌ను ఎదుర్కొనే సత్తా మోదీ, షా నేతృత్వంలోని బీజేపీకే సాధ్యమనుకుంటున్నారు. శారద స్కామ్‌లో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించడాన్ని మమత అడ్డుకోవడం.. అవినీతికి మద్దతివ్వడమేనన్న భావన కూడా బలంగా వ్యక్తమవుతోంది. ఇదంతా బీజేపీకే లాభిస్తుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 10 నుంచి 15 సీట్లు గెలుచుకోగలదు’ అని బెంగాల్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఒక విశ్లేషకుడు వివరించారు. బీజేపీని అడ్డుకునేందుకు మమత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నేతల సభలు రాష్ట్రంలో జరగనివ్వకుండా అధికారికంగా, రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా వచ్చిన చాపర్ ల్యాండింగ్‌ను, సోమవారం మరో రాష్ట్ర(యూపీ) ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ను అడ్డుకున్నారు. మరోవైపు, సీబీఐ అధికారుల విధులను అడ్డుకుని, వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడాన్ని తట్టుకోలేక, మమత నిరాశ, నిస్పృహలతో చేస్తున్న చర్యలుగా భావిస్తున్నారు. మరోవైపు, లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌ల నిస్తేజం నేపథ్యంలో.. రాష్ట్రంలోని మమత వ్యతిరేక వర్గాలు బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. వేలాది రాష్ట్ర ప్రజలు బాధితులుగా ఉన్న ఒక కుంభకోణానికి సంబంధించిన విచారణను ఆమె అడ్డుకోవడం సరికాదనే అభిప్రాయం ఉంది. ఆ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీసు అధికారికి మద్దతుగా నిలవడం.. రాజకీయంగా తటస్థులైన వారి లోనూ మమత పట్ల వ్యతిరేకత పెంచుతోందని భావిస్తున్నారు. తెరపైకి ఫైర్ బ్రాండ్.. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో మమతలో కనిపించిన ఫైర్, ఉద్యమ వైఖరి, ప్రజా పోరాటాలు నిర్వహించిన నాటి ఆవేశం.. మళ్లీ ఈ ధర్నాతో మరోసారి వెలుగులోకి వచ్చాయని మరి కొందరి భావన. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ వ్యక్తిత్వం.. ఎన్నికల ముందు.. ఒక్కసారిగా తెరపైకి రావడం తృణమూల్‌కు లాభిస్తుందని, కార్యకర్తల్లో మనోస్థైర్యం పెరుగుతుందనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ధర్నా వేదికపై మమత చూపిన ఆవేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా సింగూరు రైతుల కోసం 12 ఏళ్ల క్రితం ఇదే వేదికపై 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిననాటి ఉద్యమ నేత మమత ఇప్పుడు ఈ దీక్షతో మళ్లీ ప్రత్యక్షమైందని కార్యకర్తలు అంటున్నారు. -
'మరో రోజుకు పొడిగించారు'
కోల్ కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసులో నిందితుడైన బెంగాల్ మంత్రి మదన్ మిత్రాకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మదన్ మిత్రాకు తరుపు న్యాయవాది కౌంటర్ అఫిడవిట్ ను ఇంకా దాఖలు చేయని నేపథ్యంలో తిరిగి ఈ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కోట్ల రూపాయల శారదా కుంభకోణం కేసులో మంత్రి మదన్ మిత్రా దాదాపు 11 నెలల తర్వాత కింది కోర్టులో బెయిల్ పొందారు. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించడానికి ముందు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు మిత్రా తరుపు న్యాయవాదిని కోరగా ఆయన ఇంకా కోర్టుకు అందజేయలేదు. ప్రస్తుతం మదన్ మిత్రా గృహ నిర్బంధంలోనే ఉన్న సంగతి తెలిసిందే. శారదా కుంభకోణం కేసులో ఆయనను పోలీసులు గత డిసెంబర్ 12న అరెస్టు చేశారు.