breaking news
Robotic equipment
-
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్‌కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్‌లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్‌లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్‌లోని పేషెంట్‌కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్‌లోని పేషెంట్‌కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్‌లోని చైనా ఎంబసీ స్పోక్స్‌పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్‌కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్‌కు ముందర ఇక్కడ హైదరాబాద్‌లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్‌లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్‌కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్‌గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్‌లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్‌తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్‌తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్‌గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్‌బ్లాడర్‌ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్‌ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్‌ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్‌గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
డాక్టర్ గయానాలో పేషెంట్ ఇండోర్‌లో..
న్యూఢిల్లీ: భారతీయ వైద్యుడొకరు వైద్యరంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి రోబో సాయంతో గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత దూరంలో జరిగిన రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రముఖ రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానాలోని జార్జ్‌టౌన్ పబ్లిక్ హాస్పిటల్ కార్పొరేషన్ నుంచి ఆపరేషన్ చేయగా రోగి మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఎస్ఎస్ఐ మంత్ర’ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ చేశారు. శ్రీవాస్తవ గయానాలో కూర్చుని కన్సోల్ ద్వారా రోబోను నియంత్రిస్తుండగా, ఇండోర్‌లో ఉన్న రోబోటిక్ చేతులు ఆయన చేతుల కదలికలను కచ్చితత్వంతో అనుకరిస్తూ ఆపరేషన్ చేశాయి. భారత్‌లో ఈ ఆపరేషన్‌కు జైపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ రామ్ శుక్లా, ఇండోర్‌లోని ఇర్కాడ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీలు సహకరించారు. రికార్డు నమోదవడంపై గయానాæ అధ్యక్షుడుæ మహ్మద్ ఇర్ఫాన్ హర్షం వ్యక్తం చేశారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి గుండెకు శస్త్రచికిత్సతో ప్రపంచ రికార్డ్ -
రోబోటిక్ ‘లైఫ్‌బాయ్’తో సెకన్లలో సహాయం
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్‌బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్‌తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి. సేఫ్ బీచ్‌గా విశాఖ తీరం ఆర్కే బీచ్‌లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్‌లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు -
అదిగో.. ఆటోమేటెడ్ భూతం..!
‘ఐటీ’ జనులారా.. జర భద్రం..! ♦ ఐఓటీ, ఏఐ విప్లవంతో అన్ని రంగాల్లో సమూల మార్పులు ♦ వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు ♦ మనుషులకన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యంతో పనులు ఇరవయ్యో శతాబ్దం ముగిసే సమయానికి సమాచార విప్లవం ప్రపంచ స్వరూపాన్నే మార్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతికత) విశాల ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది. ఐటీ .. అన్ని రంగాలనూ అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. 21వ శతాబ్ది ఆరంభంలో అన్ని రంగాల్లోనూ ఐటీ అత్యంత ముఖ్యమైన భాగమైంది. అయితే.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్మికుల ఉపాధి అవకాశాలను యాంత్రీకరణ, కంప్యూటరీకరణ విప్లవాలు దెబ్బతీసినట్లుగా.. ఐటీ రంగాన్నీ ముంచుకొస్తోన్న మరో విప్లవం వణికిస్తోంది. దానితో మున్ముందు ఐటీ రంగం.. అందులోని ఉపాధి అవకాశాల పరిస్థితులు సమూలంగా మారిపోనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ విప్లవమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్! అంటే.. ఇంటర్నెట్తో కూడిన వస్తుజాలం.. వాటికి కృత్రిమ మేధస్సు! కార్మికుల ఉపాధి అవకాశాలు తగ్గిపోవటానికి కంప్యూటరీకరణే ప్రధాన కారణమైతే.. ఆ కంప్యూటర్ల నిర్వహణలో పని చేసే నిపుణులు ఐటీ ఉద్యోగులుగా విలసిల్లుతున్నారు. భవిష్యత్తులో ఈ కంప్యూటర్ల నిర్వహణ సర్వస్వమూ కంప్యూటర్లే చూసుకోనున్నాయి. ఒక్క ఐటీనే కాదు.. సమస్త రంగాలనూ రానున్న విప్లవం ప్రభావితం చేయనుంది! సకల వస్తుజాలమూ ఇంటర్నెట్తో అనుసంధానమై.. కృత్రిమ మేధస్సుతోమనుషులకన్నా ఎక్కువ కచ్చితత్వంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. - పృథ్వీరాజ్ ఏమిటీ.. ఐఓటీ - ఏఐ? ఎలక్ట్రానిక్ పరికరాలు.. హైటెక్ పరికరాలు కానీ, మామూలు పరికరాలు కానీ.. అన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మెషీన్ టు మెషీన్ (ఎం టు ఎం) ప్రొటోకాల్ సాయంతో పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) సాయంతో ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని తమకు తాముగానే పనులు చేసుకుంటూ పోతుంటాయి. ఇందులో మానవ ప్రమేయం కానీ.. సూచనలు కానీ అవసరం ఉండదు. కానీ.. వీటిని దూరం నుంచి నియంత్రించవచ్చు (రిమోట్ కంట్రోలింగ్). స్మార్ట్ ఇళ్లు, ఆటోమేటెడ్ రైళ్లు, రోబోటిక్ ట్రక్కులు, ఎస్కలేటర్లు, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, కార్ల తయారీ తదితర చాలా పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది. అంటే.. ఇప్పటివరకూ యంత్రాలను నియంత్రించేందుకు అవసరమైన మానవ శ్రమ కూడా మరింతగా తగ్గిపోతోంది. యంత్రాలు తమకు తాముగా పని చేసుకుపోవటం.. సుదూరంగా ఎవరో ఒకరు మాత్రమే అన్ని యంత్రాలనూ నియంత్రించటం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్తే.. వేర్వేరు ప్రాంతాల్లోని వివిధ స్వయంచలిత యంత్ర పరిశ్రమలను.. ఒకే కేంద్రం నుంచి అతి తక్కువ సంఖ్యలో మానవులు నియంత్రించవచ్చన్నమాట. ఆ నియంత్రణను కూడా ఆటోమేటెడ్ చేసేస్తే.. మానవ పర్యవేక్షణను అత్యంత కనిష్ట స్థాయికి కుదించవచ్చు. దీనివల్ల భారీ పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల వంటి నిర్వహణ వ్యయం కనిష్టానికి తగ్గిపోవటమే కాదు.. ఐఓటీ, ఏఐల వల్ల ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి, విశ్లేషణ జరుగుతుంది కాబట్టి.. అవసరమైన పరికరాలను, అవసరమైన మార్పులతో ఉత్పత్తి చేస్తుంటాయి. అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు... మనుషులకు అవసరమైన సమస్త సేవల్లోనూ ఐఓటీ, ఏఐ విస్తరిస్తుంది. వాటితో కూడిన పరికరాలు ఆరోగ్య రంగంలో సైతం మనుషుల్లో రక్తపోటు, చక్కెర వంటి వాటిని నిరంతరం పరిశీలిస్తూ, సమాచార మార్పిడి ద్వారా విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్సలు, మందులను అందించటం చేస్తాయి. న్యాయవ్యవస్థలోనూ ఐఏ, ఐఓటీ పెను మార్పులు తీసుకువస్తుంది. ఆర్టిఫిషియల్ జ్యుడీషియల్ ఇంటెలిజెన్స్‌తో.. వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు, లేదా ప్రమాదాలు చేసినపుడు వాటికవిగానే ఆగిపోతాయి. వాటికవిగానే ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి.. సాక్ష్యాధారాలను రికార్డు చేసి.. అక్కడికక్కడే తీర్పు చెప్పటం జరిగిపోతుంది. పోలీసులు లేదా వైద్య సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇలా.. కేవలం పారిశ్రామిక, ఉపాధి రంగాల్లోనే కాదు మొత్తం ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే సమూలంగా మారిపోతాయని.. ప్రస్తుత స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవ్యవస్థ ‘స్మార్ట్, క్లౌడ్ ఎకానమీ’గా మారుతుందని విశ్లేషకుల అంచనా. మానవ శ్రమకు డిమాండ్ పడిపోతుంది కృత్రిమ మేధస్సుతో కూడిన ప్రత్యేక అప్లికేషన్లు, రోబోటిక్ పరికరాలు, ఇతర ఆటోమేషన్ రూపాల ఫలితంగా.. మానవ శ్రమకు డిమాండ్ గణనీయంగా పడిపోతుంది. వాటి ఉత్పత్తి, వినియోగం పెరిగిపోతున్న కొద్దీ.. నిరుద్యోగితా పెరిగిపోతూ ఉంటుంది. తరచుగా చేసే ఒక తరహా పనుల్లో మనుషుల శక్తి సామర్థ్యాల కన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు అధికంగా ఉండటం దీనికి కారణం. ముందుగా ప్రభావితమయ్యే రంగం.. సమాచారం ఆధారంగా నడిచే ఐటీ ఉద్యోగ రంగమని, అందులోనూ ప్రవేశ స్థాయిలో ఉద్యోగాలపై ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. భారీ స్థాయిలో సమాచార మార్పిడి, విశ్లేషణలు చేయగల ఎక్స్పర్ట్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్ వ్యవస్థల వినియోగంతో ఈ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతాయన్నది అంచనా. ఐటీ రంగం ఆటోమేటెడ్ అవుతుంది..! రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) వంటి ‘ఆటోనామిక్స్’లో వస్తున్న పరిణామాల ఫలితంగా.. కాల్ సెంటర్, టెక్నికల్ ఆపరేషన్ వర్క్ వంటి మనుషులు చేసే పనులు ఆటోమేటెడ్ అయిపోయే అవకాశముందని ఐటీ రంగ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పురోభివృద్ధితో పలు పనుల ఆటోమేషన్ జరుగుతుందని.. ఫలితంగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ వస్తుందని నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన స్పిన్ (సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ నెట్వర్క్) సదస్సులో పేర్కొన్నారు. ప్రస్తుత ఐటీ రంగ నిపుణులకు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో పునఃశిక్షణనివ్వటం పెద్ద సవాలు అవుతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. గత ఏడాది 2.5 లక్షల మందికి ఈ రంగంలో ఉద్యోగాలు లభించగా.. ఈ ఏడాది అది 2.3 లక్షలకు తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మేధస్సును మెషీన్లు అనుకరించగలవా? మానవ మెదళ్లను మెషీన్లు అనుకరించగలవని.. మానవ మెదళ్లు తెలివైనవి కాబట్టి మెషీన్లు అనుకరించే మెదళ్లు కూడా తెలివైనవిగా తయారయ్యే అవకాశముందని కొందరు నిపుణుల వాదన. మెదడును నేరుగా హార్డ్వేర్లోకి, సాఫ్ట్‌వేర్‌లోకి కాపీ చేయటం సాధ్యమేనని.. అలా కాపీ చేసిన మెదళ్లు తెలివిగలవై ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. యంత్రాలు ఇప్పటికే తెలివైనవని.. కానీ దానిని గుర్తించటంలో పరిశీలకులు విఫలమవుతున్నారని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డీప్ బ్లూ అనే సూపర్ కంప్యూటర్ గ్యారీ కాస్పరోవ్‌ను చదరంగంలో ఓడించినపుడు ఆ యంత్రం తెలివిగా ప్రవర్తించిందని వారు ఉదహరిస్తున్నారు. అయితే.. ఈ ఆటను చూసిన వారు అది కేవలం యంత్రపు కృత్రిమ మేథస్సు ప్రవర్తనేనని.. నిజమైన మేధస్సు కాదని వాదిస్తున్నారని చెప్తున్నారు. ఐఏ పరిశోధనలు.. పరిణామాలివీ... తర్కశాస్త్రం - గణితశాస్త్రంలో పరిశోధనల ఫలితంగా ప్రోగ్రామబుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ను తయారు చేశారు. అదే సమయంలో న్యూరాలజీ (నాడీ శాస్త్రం)లో పరిశోధనలు, సమాచార సిద్ధాంతం, సైబర్నెటిక్స్ (సమాచార నియంత్రణ యంత్రాధ్యయనం)ల్లో కొత్త ఆవిష్కరణల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మెదడును నిర్మించవచ్చని శాస్త్రవేత్తలు బలమైన విశ్వాసానికి వచ్చారు. ఈ క్రమంలో 1956లో అమెరికాలో డార్ట్మౌత్ కాలేజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనకు బీజం పడింది. చెకర్స్ ఆటలో గెలిచే కంప్యూటర్లు, అల్జీబ్రాలో పద సమస్యలను పరిష్కరించే, ఇంగ్లిష్ మాట్లాడే కంప్యూటర్లను తయారు చేశారు. 1997లో ఐబీఎం తయారు చేసిన డీప్ బ్లూ సూపర్ కంప్యూటర్ తయారైంది. అది.. నాటి ప్రపంచ చదరంగం చాంపియన్‌ను ఓడించి తన మేధస్సును చాటింది. 2011లో ఐబీఎం సంస్థే తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్ జియోపార్టీ క్విజ్ (ప్రశ్న - సమాధానాలు) షోలో ఇద్దరు గొప్ప చాంపియన్లను ఓడించింది. ఐఓటీ పరిశోధన.. పరిణామాలిలా... ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, సెన్సర్స్, నెట్వర్క్ కనెక్టివిటీ అన్నీ కలసివున్న భౌతిక వస్తువులను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వస్తువులు సమాచారాన్ని సేకరించి.. పరస్పరం మార్పిడి చేసుకోగలవు. వైర్లెస్ కమ్యూనికేషన్ నుంచి ఇంటర్నెట్ వరకూ.. ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి మైక్రో ఎలక్ట్రానికల్ సిస్టమ్స్ వరకూ అనేక సాంకేతిక పరిజ్ఞానాల కలయికతో ఐఓటీ ఏర్పడుతుంది. స్మార్ట్ పరికరాల అనుసంధానం విధానాన్ని 1982లో తొలిసారిగా చర్చించారు. కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో తొలిసారిగా ఒక కోక్ మెషీన్‌ను ఇంటర్నెట్తో అనుసంధానించారు. తనవద్ద ఉన్న కోక్ బాటిళ్ల వివరాలు, కొత్త బాటిళ్లు చల్లగా ఉన్నాయా లేదా అన్న సమాచారాన్ని అది ఎప్పటికప్పుడు నివేదిస్తుంటుంది. 1999 నాటికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి మీడియా, పర్యావరణ పర్యవేక్షణ, మౌలికవసతుల నిర్వహణ, తయారీ, ఇంధన నిర్వహణ, వైద్య, ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థలు, భవనాలు, ఇళ్ల ఆటోమేషన్, రవాణా తదితర రంగాల్లో ఐఓటీ విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ అనుసంధానం పెరుగుతోంది. ప్రస్తుతం అత్యధికంగా దక్షిణ కొరియాలో ప్రతి 100 మందికీ 37.9 వస్తువులు ఐఓటీలో ఉండగా.. 24వ స్థానంలో ఉన్న భారత్‌లో ప్రతి వేయి మందికీ ఆరు వస్తువులు ఐఓటీలో ఉన్నాయి. ఈ ఐఓటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జతచేయటంతో.. అది పెను విప్లవంగా మారుతోంది. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల కోట్ల పరికరాలు ఐఓటీలో ఉంటాయని పరిశీలకుల అంచనా. కృత్రిమ మేధస్సుతో మానవ మనుగడకే ముప్పు! పూర్తిస్థాయి కృత్రిమ మేథస్సు అభివృద్ధి చెందితే.. అది మానవ జాతి అంతానికి దారితీయవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేర్కొన్నారు. అదెలాజరుగుతుందనే దానిపై నిక్బోస్ట్రామ్ అనే రచయిత తన ‘సూపరింటెలిజెన్స్’ పుస్తకంలో అంచనా వేశారు. దాని ప్రకారం.. తొలుత మనుషులు కృత్రిమ మేథస్సుకు బీజం వేస్తారు. ఆ ఏఐ మనుషులపై ఆధారపడుతూ తన మేధస్సును పెంచుకుంటుంటుంది. రెండో దశలో తనకు తానుగా మేధస్సును మెరుగుపరచుకునే స్థాయికి చేరుతుంది. ఈ దశలో మానవ మేధస్సు పరిమితులను అధిగమించిపోయే అవకాశముంది. ఈ దశలో మానవ మేధస్సుకు అందని నైపుణ్యాలను, వ్యూహాలను సంతరించుకుని తన రూపురేఖలను (డిజైన్‌ను) తానే మార్చుకోగల స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. మూడో దశలో మరింత దీర్ఘ కాలిక లక్ష్యాల కోసం రహస్యంగా వ్యూహాలను తయారు చేసుకుని, రహస్యంగా ఏర్పాట్లు చేసుకునే పరిస్థితిలోకి వెళ్లవచ్చు. చివరిదైన నాలుగో దశలో ఏఐ మనుషులపై దాడికి దిగవచ్చు.. మనుషులు తనను ఎదుర్కోవటానికి ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న ఏర్పాట్లను ధ్వంసం చేసి.. మనుషులు తన మనుగడకు ప్రమాదకరమన్న భావనతో మానవజాతినే నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు. ఈ క్రమంలో మొత్తం భూగోళాన్నే తీవ్రంగా ధ్వంసం చేసే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఈ అంచనాలతో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అనేక సైన్స్ ఫిక్షన్ నవలలు, సినిమాలు వచ్చాయి. ఇస్సాక్ అసిమోవ్ ‘త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్’ నుంచి.. ఆర్థర్ సి. క్లార్క్ రాసిన 2001 ఎ స్పేస్ షిప్ ఒడిస్సీ నవల, సినిమా.. అనంతరం వచ్చిన టెర్మినేటర్ సినిమాలు ఈ కోవలోనివే.


