breaking news
Professor Lakshman
-
కాళోజీ యాదిలో ...
కవిగా కాళోజీకి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన పుస్తకం ‘నా గొడవ’. ఇది 1953లో విడుదలయింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన మహాకవి శ్రీశ్రీ ఆ సందర్భంగా అన్న మాటలు చిరస్మరణీయాలు. ‘ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన ప్రతి ఒక్కరికీ ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది విషాలజగత్తు ప్రజలందరి గొడవ’ అన్నారు. ఆనాటినుండి కాళోజీ ప్రచురించిన ప్రతి కవితాసంకలనానికి నా గొడవ అనే పేరు పెట్టాడు. ప్రపంచబాధంతా శ్రీశ్రీ బాధ అయినట్లే ప్రజల గొడవంతా తన గొడవగా భావించి కవితా ప్రస్థానం సాగించిన వ్యక్తి కాళోజీ. కాళోజీ తన పోరాటాలన్నింటికి కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఆయన చెప్పదలుచుకున్న దానిని సూటిగా సరళమైన ప్రజల భాషలో చెప్పేవాడు. ఆయనది బడిపలుకుల భాషకాదు, పలుకుబడుల భాష. అందుకే ఆయన రచనలు ప్రజలకు చేరువయ్యింది. ఒకప్పుడు భాషకోసం సమైక్య రాష్ట్రాన్ని ఆహ్వానించిన కాళోజీ, అవమానాల పాలవుతున్న ఆ భాషకోసమే మళ్లీ తెలంగాణ రాష్ట్రం అడగడానికి వెనకాడలేదు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుకభాషలోనే రాయాలనేది అతని ప్రగాఢవిశ్వాసం. తెలంగాణ భాష అన్నా, యాస అన్నా అపారమైన అభిమానం. తెలంగాణ భాష, యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. పరభాష మనల్ని మనం మనంగా బ్రతకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం. ఈ వైఖరిని మనం ఎండగట్టాలనేవారు కాళోజీ. కొన్నాళ్లు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ మాండలిక భాషాదినోత్సవంగా ఆయన అభిమానులు జరి పిండ్రు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప కాళోజీ జన్మదినాన్ని తెలం గాణ భాషాదినోత్సవంగా, అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం, అభినందనీయం. తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషిచేశారు. తెలంగాణ ప్రజాసంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన గొంతు వినిపించేవారు. మనభాష, మన పలుకుబళ్లు ఇప్పుడు మన సొంత రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగింది. వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగం, ఓయూ ‘ మొబైల్: 98491 36104 -
ఆదర్శం.. ‘చండ్ర’ జీవితం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: భారత విప్లవోద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. సీపీఐ(ఎంఎల్) తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి 32వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో పుల్లారెడ్డి ఒక చుక్కానికిగా నిలిచారని కొనియాడారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి రాజీలేని పోరాటం చేశారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు ఎన్.వెంకటేష్ మాట్లాడుతూ భూమి, భుక్తి, పీడిత ప్రజల విముక్తి లక్ష్యంగా సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి ద్రోహం తలపెట్టిన రివిజనిజం నాయకత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన గొప్ప పోరాట యోధుడు పుల్లారెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) అధికార ప్రతినిధి సత్యనారాయణ, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.