breaking news
Praja natya mandali
-
నిజమైన కళకు నీరాజనాలు
‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత, మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు విశ్వనాథ సత్యనారాయణ. నాటక, సాహిత్యాది రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. అయితే తెలుగునాట నాటక రంగానిది మహా వైభవోపేత చరిత్ర. అవి జనజీవితాన్ని ఎల్లెడలా ప్రభావితం చేశాయి. జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పాయి. నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అని చాటాయి. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో! మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో!! ఆ మహానుభావులకు వందనం!!! నాటక, సాహిత్యాది రంగాలకు చెందిన వివిధ రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో 1930లలో భారత పర్యంతం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ సారథ్యంలోని ‘మా భూమి’ ఇత్యాది కళా రూపాలను ప్రస్తావిస్తూ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది. ప్రజాకళలు ఎలా ఉండాలో ‘మా భూమి’, ‘అంతా పెద్దలే’ నాటకాలు నిరూపించా’’యని ప్రశంసల వర్షం కురిపించారు! ఈ కితాబు నాటికీ, నేటికీ మరపురాని సందేశంగా నిలిచిపోయింది. ఆ ఒరవడిలో ముందుకు సాగి, అఖిల భారత స్థాయిలోనే ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ రాష్ట్రీయ విశిష్ఠ శాఖలలో ఒకటి గుంటూరు జిల్లా ‘ప్రజా నాట్యమండలి’. భారత ప్రజానాట్య మండలికి ఆంధ్ర ప్రజానాట్య మండలి ఎలా ‘ఒజ్జ బంతి’ అయిందో, అలాగే గుంటూరు ప్రజా నాట్యమండలి వివిధ శాఖలతో పరిఢవిల్లింది. మానవ జీవన దర్పణంగా పలువురు ఆంధ్ర పండితుల, కవుల ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. సందేశాలు సమకాలీనం విశ్వనాథ వారు ఎంతటి మహాకవో, అంతటి సరసుడు, ‘గడగ్గాయి’ కూడా! పెళ్లయి, కాపురాలకు వెళ్లబోయే నూతన దంపతులందరికీ కంటికి కనిపించినా, కనిపించకపోయినా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూపడానికి మన పెద్దలు ప్రయత్నిస్తారు. కానీ విశ్వనా«థను ఒకరు మీరెప్పుడైనా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూశారా అని ప్రశ్నించగా... నాకైతే ‘అరుంధతి కనిపించలేదుగానీ చేసిన ‘అప్పులయితే’ కనిపించి, వేధించాయని చమత్కరించారు. బహుశా కొన్ని జీవితానుభవాల తర్వాత, ‘చింతామణి’ నాటక కర్తగా సుప్రసిద్ధుడైన మహాకవి కాళ్లకూరి... భార్యాభర్తల మధ్య ఉదాత్తమైన సంసార అవగాహన ఎలా ఉండాలో చెప్పడానికి ఒక పద్యాన్ని రాశారు. సందేశాత్మకంగా ఉండటానికి సరళమైన భాషలో రాసి మనకు అందించారు! ఆరోజుల్లో వేశ్యా లంపటత్వం వల్ల సంసార జీవితాలు ఎలా బుగ్గిపాలవుతున్నాయో చెప్పి, ఆ వినాశం వల్ల సంసార జీవితాల్ని రక్షించడం అవసరమని భావించి కాళ్లకూరి ఆ నాటకం రాశారు! ఫలితంగా గంభీర సంసార జీవితాల అవగాహనకు ఆ పద్యం ద్వారా సమకాలీన సందేశం అందింది. కనుకనే కాళ్లకూరి రచనకు అంత విలువ పెరిగింది. ‘కష్ట ఫలితంబు బహుళ దుఃఖ ప్రదంబు సార రహితమైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనంబు చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషులుండు!’ ప్రశ్నించే సంస్కారం బుద్ధి జీవుల్లో పెరగనంతవరకూ మనిషికి వికాసం ఉండదని కవి మీగడ రామలింగస్వామి స్పష్టం చేస్తాడు. ఎందుకని? ఆయన మాటల్లోనే నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అంటారు. ‘ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు ప్రశ్న యందే సకల దిశా ప్రగతి యుండు కాన, ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను’ అంటారు. అంతేగాదు, ‘ఈర్ష్య’ అనేది ఏ కళకూ, నాటకానికీ పనికి రాదనీ, ఈర్ష్య అనారోగ్యం, హానికరమని స్పష్టం చేశారు! ఇలా ఎన్నెన్నో దృశ్య మాలికలను ‘దర్పణం’ పేరిట గుంటూరు కళా పరిషత్ 1997–2022 సంవత్సరాల మధ్య కార్యక్రమాలన్నింటిని రసవత్తరమైన రచనా శైలిలో ‘కళ ప్రజలది’ అన్న మకుటం కింద రజతోత్సవ ప్రత్యేక సంచికగా అందించింది. ‘దర్పణం’ సంపాదకులు, సహ సంపాదకులు వల్లూరు శివప్రసాద్, వల్లూరు తాండవకృష్ణ అభినందనీయులు. నాటక రంగంలో ప్రజాకళలకు ప్రాధాన్యం కల్పించడంలో సుప్రసిద్ధులైన నవీన పథకులుగా ఖ్యాతి పొందిన నటశేఖరులు బళ్లారి రాఘవ, గరికపాటి రాజారావు ప్రఖ్యాతులకు ఈ ప్రత్యేక సంపుటిని అంకితమిచ్చారు. గుంటూరు కళాపరిషత్ కార్యక్రమాల ప్రత్యేక దృశ్యమాలిక ఈ సంచికకు ప్రత్యేక కళాకాంతులు అందించింది. ఎందరో మహానుభావులు జీవితాంతం ఆధునికులను వెన్నుతట్టి ప్రోత్సహించినవారు... కందుకూరి, తిరుపతి కవులు, చిలకమర్తి, బలిజేపల్లి, పరబ్రహ్మ పరమేశ్వరి, ఒద్దిరాజు సోదరులు, కోదాటి నరసింహం, రామరాజు, గురజాడ, బళ్లారి రాఘవ, వాసిరెడ్డి, సుంకర, ఆత్రేయ, గరికపాటి, ఆత్రేయ ఇత్యాదులు. ఇలా తెలుగు నాటక పరిణామానికి దోహదం చేసినవారి గురించి మేడిచర్ల సత్యనారాయణమూర్తి కవితాత్మకంగా కురిపించిన ప్రశంస ద్వారా దర్పణం సంచిక వైశిష్ట్యం తెలుస్తుంది. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో, మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో, నటనకు జీవం పోసి దైవాలుగా పూజలంది శిలారూపమందిన పాత్రధారులెందరో, ఎవని కళకు, యువనికలకు ఊపిరినిచ్చెనో ఈ రంగస్థలి చిత్రకారులెందరో ఆ మహానుభావులకు వందనం సాష్టాంగ వందనం!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
పెనమలూరు: ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరుగుతోన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర 10వ మహాసభల ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. దేశంలో జరుగుతోన్న ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ నియామకం ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీని నియమించారు. అధ్యక్ష కార్యదర్శులుగా పి.మంగరాజు, ఎస్.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా గుర్రం రమణ, సుభాషిణి, సహాయ కార్యదర్శులుగా షేక్.కాశిం, ఐ.వెంకటేశ్వరరావులను నియమించారు. వీరితో పాటు మరో 38 మంది కార్యవర్గ సభ్యులూ ఉన్నారు. -
ప్రజా కళాకారుడు రాజారావు
డాక్టర్ గరికపాటి రాజారావు ఫిబ్రవరి 5, 1915న కృష్ణాజిల్లా పోరంకిలో జన్మించారు. దాదాపు అందరూ కొత్త నటీ నటులతో, కొత్త టెక్నీషియన్స్‌తో రాజా ప్రొడక్షన్స్ పతాకంపై ‘పుట్టిల్లు’అనే సినిమా తీసారు. కానీ హీరోయే విలన్ కావడం వలన ఆ చిత్రం ఆర్ధికంగా దెబ్బతింది. ఈ చిత్రంతోపాటు పొట్టి శ్రీరాములు డాక్యుమెంటరీని జత కలిపి విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచ యమైన వారిలో జమున, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు టి.చలపతిరావు, ప్రసిద్ద బుర్ర కథకుడు నాజర్, పబ్లిసిటీ ఆర్టిస్టు కీతా ముఖ్యులు. 1943లో పృథ్వీరాజ్ కపూర్, కేవీ, అబ్బాస్, హరి రవీంద్రనాథ్ చటోపాధ్యాయ తదితరులతో ఏర్పడిన కమిటీతో కలిసి రాజారావు కూడా అఖిల భారత ప్రజానాట్య మండలిని స్థాపించారు. వివిధ కళా సంస్థల్ని, కళాకారుల్ని ఒకే వేదికపైకి తెచ్చి ప్రజానాట్య మండలి స్థాపించారు. దాదాపు పదేళ్లు బెజవాడలో ఉండి, డాక్టరుగా, యాక్టరుగా, నాటక సంఘాల ప్రజానాట్యమండలి ఆర్గనైజరుగా పనిచేశారు. మొగల్రాజపురంలోని కాట్రగడ్డ వారి ఆవరణలో ప్రారంభమైన ప్రజాశక్తి దినపత్రికలోని కార్మికులకు, కార్యకర్తలకు ఉచిత వైద్యం చేశారు. 1945 డిసెంబరు 30, 1946 జనవరి 1వ తేదీల్లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల మహాసభల్లో ప్రజానాట్య మండలి తరపున బుర్ర కథలు, మొదలైన ప్రదర్శనలతో చక్కని కృషి చేశారు. 1946 జూన్‌లో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ల మహాసభలు రాజమండ్రిలో జరిగినపుడు కోగంటి గోపాల కృష్ణయ్య తదితరులతో రూపొందించిన ప్రెస్‌వర్కరు, మున్సిపల్ వర్కరు నృత్య నాటికలను అద్భుతంగా ప్రదర్శించారు. 1945లో రాజమండ్రి వచ్చి లక్ష్మీవారపు పేట బుద్దుడు హాస్పిటల్ పక్కన ఉన్న పెంకు టింట్లో ఉండేవారు. వీరేశలింగం ఆర్ట్ థియేటర్ కూడా స్థాపించారు. రాజా ప్రొడక్షన్స్ స్టాపించి 1953లో ‘పుట్టినిల్లు’ సినిమా తీశారు. రాజారావు 9 సెప్టెంబరు 1963న కన్ను మూశారు. రాజరావు నటుడిగా ఆరాధన , బొబ్బిలి యుద్ధం చిత్రాలలో కనిపిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆయన జ్ఞాపకార్థం దేవీచౌక్ నుంచి వెళ్ళే ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. ఆ రోడ్డులోనే ఆయన శిష్యులు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. (నేడు గరికపాటి రాజారావు 104వ జయంతి) -అడబాల మరిడియ్య, దొడ్డిగుంట, తూ.గో.జిల్లా -
‘ప్రజానాట్య మండలి’ తరగతులు ప్రారంభం
అమరావతి: ప్రజానాట్యమండలి కళారూపాలలో ప్రజల ఇబ్బందులు, కష్టాలు ప్రతిబింబించాలని పోగ్రసివ్, డెమోక్రటిక్ ఫోరం ఎమ్మేల్సీ ఎమ్‌విఎస్ శర్మ అన్నారు. శనివారం స్థానిక శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ ఆడిటోరియంలో మూడు రోజులపాటు నిర్వహించే ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణాతరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజానాట్యమండలి ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వివిధ కళారూపాలు రూపొందించాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రజానాట్యమండలి ప్రతినిధి రమణలతో పాటు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి సుమారు వందమందిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు.