breaking news
poola ravinder
-
మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఏళ్ల తరబడి నలుగుతున్న ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం తెరమరుగైంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన సవరణ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేయడంతో దానికోసం పట్టుపడుతున్న ప్రధాన సంఘమైన పీఆర్టీయూ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి వచ్చిన పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినా, హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు వేర్వేరుగా, ఎవరి మేనేజ్మెంట్లలో వారికే పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, ఆ అంశాన్ని పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఇందుకోసం 1,09,024 మంది టీచర్లు (ప్రభుత్వ టీచర్లు 10,817 మంది, పంచాయతీరాజ్ టీచర్లు 98,207 మంది) వేచి చూస్తున్నారని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీంతో పదోన్నతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ల వారీగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్‌అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు లభిస్తాయన్నారు. నెలకు రూ. 398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం వారు 11,363 మంది ఉన్నారని, అందులో 7,010 మంది ప్రస్తుతం పనిచేస్తుండగా, 4,353 మంది రిటైర్ అయ్యారని వివరించారు. ఇందుకు రూ. 54 కోట్లు అవుతుందని సీఎంకు వివరించారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లకు 10 నెలలకు కాకుండా 12 నెలలకు వేతనం చెల్లించాలని కోరారు. టీచర్లకు 3 నెలల మెటర్నిటీ లీవ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు సీఎంకు వివరించారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిచడంతో త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, కమలాకర్‌రావు వెల్లడించారు. ఎంఈవో పోస్టులన్నీ మాకే ఇవ్వండి: జీటీఏ మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతుల కోసం సీఎం కేసీఆర్‌ను పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కోరిన నేపథ్యంలో తమ మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ మేనేజ్మెంట్ పరిధిలోని ఎంఈవో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు, బీఎడ్ లెక్చరర్లు, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లను మాతృశాఖలకు పంపించాలని పేర్కొన్నారు. -
పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ను కలసిన పీఆర్టీయూ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 63 శాతం ఫిట్మెంట్తో 2013 జులై నుంచి వేతన సవరణ వర్తింపజేయాలని కోరారు. శుక్రవారం సచివాలయంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో పాటు పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సరోత్తమ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు. -
తెలంగాణ సోయితోనే ఒక్కటవుతున్నరు
* ఊదితే కొట్టుకుపోతనన్నరు.. ఇప్పుడు వాళ్లే కనిపించకుండ పోయిండ్రు * పోలవరం, నాగార్జునసాగర్, పీపీఏలపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు * మౌనంగా ఉంటే.. దోచుకుందామని చూస్తున్నరు * టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: రాజకీయ అవకాశాల కోసం కాకుండా తెలంగాణ సోయితోనే ఇక్కడి రాజకీయ నాయకత్వం అంతా ఏకీకృతం అవుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, పీఆర్టీయూ ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, పి.భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, టీడీపీ ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, సలీంతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఉఫ్‌మని ఊదితే ఈ బక్కోడు కొట్టుకుపోతడని, ఆరునెలల్లో ఈ పార్టీ కనిపించకుండా పోతదని, మఖలో పుట్టి పుబ్బలో పోతదని టీఆర్ఎస్ పెట్టిన కొత్తలో కొందరు ఎద్దేవా చేసిండ్రు. అట్లా అన్నోళ్లే ఇప్పుడు కనిపించకుండా పోయిండ్రు. అనేక తిప్పలు, పోరాటాలు, మలుపుల తర్వాత కొత్త రాష్ట్రంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకుని మనుగడలోకి వచ్చింది. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవడానికి దూసుకుపోతున్నది. తెలంగాణ ఉద్యమాన్ని చూసి నవ్వినోళ్లు పత్తా లేకుండా పోయిండ్రు..’’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్లు కంటగింపుతో చేసిన కుట్రలు, కుతంత్రాలను చూసి కడుపుమండిన తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడటానికి ఒకే వేదిక మీదకు వచ్చి, అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే ఐక్యతను కొనసాగించాలె.. తెలంగాణను వ్యతిరేక శక్తుల దాడి నుంచి తప్పించడానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజలకు అండగా వచ్చారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ చేరికలు రాజకీయ చేరికలు కావు. పదవులకోసం, పైరవీలకోసం వచ్చినవారు కాదు. ఎవరి మీద కోపంతోనో ఆ పార్టీలను విడిచిపెట్టి రాలేదని, కేవలం తెలంగాణ ప్రజల అభివృద్ధి, ఆకాంక్షలను నెరవేర్చడానికే టీఆర్ఎస్లో చేరుతున్నామని వారే చెప్పారు. తెలంగాణ సోయే వారి చేరికలకు కారణం. తెలంగాణ అభివృద్ధికోసం సర్వశక్తులూ ఒడ్డుతాం. కొందరు ఎమ్మెల్సీలను ఈ వేదిక మీదనే కలుస్తున్నా.. చేరికలకు సంబంధించి కొందరితో ఇప్పటిదాకా మాట్లాడలేదు కూడా. తెలంగాణ అభివృద్ధికోసం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కుట్రలకు, కుతంత్రాలకు వ్యతిరేకంగా, దీటుగా సమాధానం చెప్పడానికి తెలంగాణ శక్తులన్నీ ఏకీకృతం కావాలె. ఇదే ఐక్యతను కొనసాగించాలె..’’ అని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు కుట్రలు.. ‘‘సమైక్యాంధ్ర ఏర్పాటుకావడం ఒక చరిత్ర. అదే సమైక్య ఆంధ్రప్రదేశ్ అంతర్థానం కావడం ఒక చరిత్ర. తెలంగాణ ఏర్పాటు కావడం ఒక చరిత్ర. ఇలాంటి కీలక సమయంలోనూ చంద్రబాబు కుట్రలను ఆపలేదు. జూన్ 2 నాటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కూడా కాకముందే చంద్రబాబు ఢిల్లీకి పోయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కుట్రలు చేసిండు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపించే విధంగా ఆర్డినెన్సు తెప్పిచ్చిండు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయకముందే చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నడు.’’ అని కేసీఆర్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన సందర్భంగా సంబరాలు కూడా పూర్తికాకముందే కసిని, తెలంగాణ వ్యతిరేకతను బయటపెట్టుకున్నాడని విమర్శించారు. పోలవరం పూర్తిచేయాలని, తెలంగాణ ప్రాంత గిరిజనులను ముంచాలని ఆంధ్రా అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. నాగార్జునసాగర్‌ను ఇప్పటిదాకా బలప్రయోగంతో వాడుకున్నట్టుగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా వాడుకుందామనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం, నాగార్జునసాగర్, పీపీఏల రద్దు వంటివాటి విషయంలో బాబు తెలంగాణకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని కేసీఆర్ విమర్శించారు. దోచుకుందామని చూస్తున్నరు ‘‘హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు కట్టాలంటూ కొందరు మంత్రులు నిన్న గవర్నరును కలిశారు. అంటే వారంతట వారే నాన్‌లోకల్ అని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పటిదాకా తెలంగాణేతరులకు తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని ఖర్చు పెట్టినట్టుగా ఒప్పుకున్నట్టే కదా. నేను మాట్లాడకుంటే ఇట్లా చేస్తరు. మాట్లాడితేనేమో అట్లా మాట్లాడ్తరా? అని అంటరు. రుణమాఫీ, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించుకోవడం వంటి వాటిని అమలుచేయడానికి మౌనంగా పనిచేసుకుంటున్నా. మన పనేదో మనం అన్నట్టుగా ఉంటే వాళ్లేమో మనలను ఎలా దోపిడీ చేద్దామా? అని చూస్తున్నరు’’ అని కేసీఆర్ మండిపడ్డారు. టీటీడీపీ నేతలకు పౌరుషం లేదు.. తెలంగాణ టీడీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘‘తెలంగాణ వ్యతిరేకపార్టీ అని నగ్నంగా బయటపడిన టీడీపీలో ఇంకా ఎందుకు ఉండాలె. ఆర్డినెన్సు ద్వారా తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపించిన చంద్రబాబు మోచేతి కింది నీళ్లు ఎందుకు తాగాలె? ఆ పార్టీ నేతలకు చీమూనెత్తురూ, పౌరుషం ఏమీ లేవు..’’ అని మండిపడ్డారు. కాగా.. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, టి.పద్మారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, జి.నగేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు మరో దెబ్బ సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో దిక్కుతోచని స్థితి.. మరోవైపు రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి.. ఇలాంటి పరిస్థితి మధ్య ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరడంతో తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. అసెంబ్లీలో అంతంత మాత్రమే బలమున్నా మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టవచ్చన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీడీపీకి మిగిలింది నలుగురే! సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శాసనమండలిలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ బోడకుంటి వెంకటేశ్వర్లు (వరంగల్), కోశాధికారి మహ్మద్ సలీం (హైదరాబాద్) తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పి బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడంతో శాసనమండలిలో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురే మిగిలినట్లయింది. ప్రస్తుతం టీడీపీకి మండలిలో అరికెల నర్సారెడ్డి, వి.గంగాధర్‌గౌడ్ (నిజామాబాద్), పొట్ల నాగేశ్వర్ రావు, బాలసాని లక్ష్మీనారాయణ(ఖమ్మం) మాత్రమే మిగిలారు. వీరిలో కూడా ఒకరిద్దరు టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశమున్నట్లు సమాచారం. టీటీడీపీ నేతల సమీక్ష ఎమ్మెల్సీలు పార్టీని వీడిన నేపథ్యంలో ఎల్.రమణ అధ్యక్షతన టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, మండవ వెంకటేశ్వర్రావు తదితరులు బుధవారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్సీల అనర్హత కోసం మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వారు పునరాలోచించాలి: పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలంటే పదవులొక్కటే కాదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. పలువురు ఎమ్మెల్సీలు, నేతలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతుండడంపై ఆయన బుధవారమిక్కడ స్పందించారు. ‘‘కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళుతున్న నేతలు పార్టీని వీడడంపై పునరాలోచిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడం సమర్థనీయం కాదని నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య అన్నారు. పార్టీ ఓడిపోగానే పార్టీలు మార డం తగదన్నారు.