breaking news
peddamul
-
కాంగ్రెస్‌లో వర్గపోరు
పెద్దేముల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పెద్దేముల్‌కు వచ్చిన డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డిని పలువురు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేయరాదంటూ పెద్దేముల్‌కు చెందిన మాజీ ఎంపీపీ భర్త రవికుమార్, నాయకులు కుమార్, గోపాలకృష్ణతో పాటు పలువురు నినాదాలు చేశారు. పెద్దేముల్ నాయకులకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించని వ్యక్తివి గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఆయనను ప్రశ్నించారు. వారిని మాజీ ఎంపీపీ రాంగోపాల్ తదితరులు సముదాయించినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చేసేదేమీలేక లక్ష్మారెడ్డి స్థానిక ఉపసర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి ఆయన వాహనంలో తాండూరుకు వెళుతుండగా.. డీసీసీబీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నాలుగు రోజుల క్రితం తాండూరు సిండికేట్‌లో పెద్దేముల్ గ్రామానికి చెందిన ఓ కార్యకర్తపై లక్ష్మారెడ్డి చెయ్యిచేసుకున్నారని, అందువల్లే ఆయనను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ వర్గపోరు ప్రభావం కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులపై పడవచ్చని కొంత మంది నాయకులు అంటున్నారు. బరిలో ఉన్న నాయకులు తలలు పట్టుకుంటున్నారు. -
పెద్దేముల్లో సబ్‌కలెక్టర్ పర్యటన
పెద్దేముల్, న్యూస్‌లైన్: పెద్దేముల్లో బాలిక మెడలో వృద్ధుడు తాళి కట్టాడని వచ్చిన వార్తలపై మంగళవారం వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి బహిరంగ విచారణ చేపట్టారు. సబ్‌కలెక్టర్, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముందుగా సబ్‌కలెక్టర్ బాలిక నానమ్మ మొగులమ్మతో మాట్లాడుతూ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. జరిగిన విషయం చెప్పాలని..ఎవరికీ భయపడొద్దని చెప్పారు. అయితే బాలికకు పెళ్లి జరగలేదని కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో చెప్పారు. గ్రామస్తులను కూడా ఆమ్రపాలి ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని కోరగా..ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె వెనుదిరిగారు. సబ్‌కలెక్టర్ వెంట రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు. కాగా బాలికను మంగళవారం రాత్రి తాండూరు నుంచి నగరంలోని నింబోలిఅడ్డ బాలికల హోంకు తరలించారు.