breaking news
PCC chief N Raghuvir Reddy
-
రఘువీరా దొంగాట
సాక్షి, కంబదూరు: సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పరిచయాలు.. టీడీపీతో చీకటి ఒప్పందం గెలుపు తీరాలకు చేరుస్తాయని భ్రమపడిన ఆయనకు వాస్తవం బోధపడింది. ప్రజల్లో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ఆదరణ.. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ దూసుకుపోతున్న తీరుతో రఘువీరా చీకటి రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ వర్గీయులను తన వైపునకు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీలు ఎర వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపుతూ మంతనాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ వర్గీయులకు రఘువీరాతో పాటు ఆయన వర్గీయులు ఫోన్లు చేస్తూ పార్టీ మారాలనే ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. అయినప్పటికీ ససేమిరా అంటుండటంతో ఆయనే స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బతిమలాడుతున్నారు. ఈ కోవలోనే గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో కంబదూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ దళిత నేతలు సీహెచ్ నరసప్ప, మల్లేష్, మల్లికార్జునతో పాటు మరికొందరి ఇళ్ల వద్దకు రఘువీరారెడ్డి వెళ్లారు. పడుకున్న వాళ్లను నిద్ర లేపి పార్టీలో చేరాలని బలవంతపెట్టారు. వాళ్లంతా పార్టీ మారబోమని స్పష్టం చేసినా బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఫొటోలు తీయించారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయించి వైఎస్సార్సీపీ శ్రేణులు పార్టీ మారుతున్నారనే సంకేతాలు పంపే ప్రయత్నం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. -
బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి మడకశిర: ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో సోమవారం ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్‌తో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని పార్టీల ఆమోదంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేరుస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ పాల్గొన్నారు.