రఘువీరా దొంగాట

PCC Chief Raghuveera Reddy Forcing YSRCP Activists To Join In Congress - Sakshi

 అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఇళ్లకు వెళ్లి పార్టీ మారాలని బలవంతం  

మారబోమని చెప్పినా కండువాలు వేసి  ఫొటోలతో ప్రచారం

సాక్షి, కంబదూరు: సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పరిచయాలు.. టీడీపీతో చీకటి ఒప్పందం గెలుపు తీరాలకు చేరుస్తాయని భ్రమపడిన ఆయనకు వాస్తవం బోధపడింది. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ఆదరణ.. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ దూసుకుపోతున్న తీరుతో రఘువీరా చీకటి రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఎలాగైనా వైఎస్సార్‌సీపీ వర్గీయులను తన వైపునకు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీలు ఎర వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపుతూ మంతనాలు మొదలు పెట్టారు.

నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ వర్గీయులకు రఘువీరాతో పాటు ఆయన వర్గీయులు ఫోన్లు చేస్తూ పార్టీ మారాలనే ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. అయినప్పటికీ ససేమిరా అంటుండటంతో ఆయనే స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బతిమలాడుతున్నారు. ఈ కోవలోనే గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో కంబదూరు మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ దళిత నేతలు సీహెచ్‌ నరసప్ప, మల్లేష్, మల్లికార్జునతో పాటు మరికొందరి ఇళ్ల వద్దకు రఘువీరారెడ్డి వెళ్లారు. పడుకున్న వాళ్లను నిద్ర లేపి పార్టీలో చేరాలని బలవంతపెట్టారు. వాళ్లంతా పార్టీ మారబోమని స్పష్టం చేసినా బలవంతంగా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి ఫొటోలు తీయించారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు పార్టీ మారుతున్నారనే సంకేతాలు పంపే ప్రయత్నం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top